 
					Salman Khan: బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ ను తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కలవడం సెన్సేషన్ గా మారింది. సడెన్ గా రేవంత్ రెడ్డి.. సల్లుభాయ్ ను కలవడానికి కారణం ఏంటి.. ? అసలే ఈ మధ్య సల్మాన్ ను పాకిస్తాన్ టెర్రరిస్ట్ గా ప్రకటించిన విషయం తెల్సిందే. ఇంకా ప్రజలు ఆ వార్తను మర్చిపోలేదు. ఇలాంటి సమయంలో వీరిద్దరి మధ్య ఏం రాజకీయాలు నడుస్తున్నాయి.. ? అని భయపడితే పప్పులో కాలేసినట్లే. అవును వీరిద్దరి కలయికకు కారణం.. ఒక పెళ్లి.
మాజీ కేంద్ర మంత్రి సుశీల్ కుమార్ షిండే మనవరాలి వివాహాం.. గత రాత్రి ముంబైలో ఘనంగా జరిగింది. ఈ వివాహానికి అతిరథ మహారథులు హాజరయ్యారు. సినీ, రాజకీయ ప్రముఖులతో ముంబై కళకళలాడింది. ఇక హైదరాబాద్ నుంచి తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కూడా హాజరయ్యారు. ఇక వివాహానంతరం.. రేవంత్ రెడ్డి అక్కడకు వచ్చిన వారందరిని పలకరించడం జరిగింది.
ఇక అదే పెళ్లికి హాజరయ్యిన సల్మాన్ ఖాన్ ను రేవంత్ రెడ్డి ఆప్యాయంగా పలకరించారు. కొద్దిసేపు వీరిద్దరూ ముచ్చటించుకున్నారు. పాలిటిక్స్, సినిమాలు, ఇంకా కొన్ని టాపిక్స్ గురించి వీరిద్దరూ చర్చించుకున్నట్లు సమాచారం. ప్రస్తుతం సల్మాన్ – రేవంత్ రెడ్డి కలిసి ఉన్న ఫోటో సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. అసలు వీరెప్పుడు కలిశారు అని నెటిజన్స్ షాక్ అవుతున్నారు.
అంతేకాకుండా రేవంత్ రెడ్డి.. తెలంగాణ రైజింగ్ విజన్ 2047 పేరిట ఒక డాక్యుమెంట్ రూపొందిస్తున్నారు. ఇప్పటికే దీని గురించి మాట్లాడడం కూడా జరిగింది. తెలంగాణ ఇంకా అభివృద్ధి చెందేలా.. రాబోయే 20 ఏళ్లలో ఎలా ఉండాలి అనేది ప్రతి ఒక్కరు ఎలాంటి భయాలు లేకుండా ఈ సర్వేలో తెలపొచ్చు. సల్మాన్ కూడా తెలంగాణ గురించి మాట్లాడాడు. దేశమంతటా తెలంగాణ రైజింగ్ సందేశాన్ని తెలిపేలా చేస్తాను అని హామీ ఇచ్చాడు. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు నెట్టింట వైరల్ గా మారాయి. ఇకపోతే ప్రస్తుతం సల్మాన్.. బిగ్ బాస్ హోస్ట్ గావ్యవహరిస్తూనే హీరోగా కొనసాగుతున్నాడు.