Google Maps: ప్రస్తుత కాలంలో అనేక మంది ఏదైనా తెలియని ప్రాంతానికి వెళ్లాలంటే వెంటనే గూగుల్ మ్యాప్స్ ఉపయోగిస్తారు. ఈ క్రమంలో ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది వినియోగదారులు దీనిని అత్యంత కీలకమైన సాధనంగా వినియోగిస్తున్నారు. ఇదే సమయంలో స్థానిక వ్యాపారులు తమ ప్రొఫైల్స్‌ను గూగుల్ మ్యాప్స్‌లో లిస్టింగ్ కూడా చేసుకోవచ్చు. అలా చేయడం ద్వారా వినియోగదారులు ఆ వ్యాపారాల ప్రాతం, సేవలు, సమీక్షల సహా ఇతర వివరాలను సులభంగా తెలుసుకోగలుగుతారు.
నమ్మకమైన, నిజమైన
అయితే, కొంత మంది వ్యాపారులు మాత్రం తమ ప్రొఫైల్‌లను నకిలీ సమీక్షలు, అసత్య సమాచారం ద్వారా మోసపూరితంగా ఉపయోగిస్తున్నారు. దీంతో వినియోగదారులు ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం ఉంది. ఈ రకమైన మోసాలు గూగుల్ మ్యాప్స్‌లో తీవ్రమైన సమస్యగా మారాయి. ఈ సమస్యను అధిగమించేందుకు, గూగుల్ ఇటీవల కొన్ని ముఖ్యమైన నిర్ణయాలు తీసుకుంది. వినియోగదారులకు నమ్మకమైన, నిజమైన సమాచారాన్ని అందించడానికి నూతన విధానాలు అందుబాటులోకి తీసుకువచ్చింది. ఈ చర్యలు వినియోగదారుల హక్కులను రక్షించడంతోపాటు వ్యాపారాల విశ్వాసాన్ని బలోపేతం చేయడంలో కీలక పాత్ర పోషిస్తాయి.
Read Also: Sony LinkBuds Fit: సోనీ కొత్త ఇయర్ బడ్స్..స్పెసిఫికేషన్లు …
AI ఆధారిత పర్యవేక్షణ
ఈ క్రమంలో గూగుల్ మ్యాప్స్‌లో వ్యాపారాలు, సమీక్షలు, ప్రొఫైల్‌లను పర్యవేక్షించడానికి గూగుల్ AI (ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్) టూల్స్‌ను ఉపయోగిస్తోంది. ఈ టూల్స్ గూగుల్‌ను నకిలీ వ్యాపారాలు, మోసపూరిత సమీక్షలను గుర్తించి వాటిపై చర్య తీసుకోవడంలో సహాయపడతాయి. గూగుల్, తమ అధిక శిక్షణ పొందిన విశ్లేషకులతో పాటు AI ఆధారిత సాధనాలను ఉపయోగించి, చాలా త్వరగా అనుమానాస్పద వ్యాపారాలను గుర్తించగలుగుతోంది. గూగుల్ ఏఐ ఇప్పటివరకు 10,000కి పైగా మోసపూరిత వ్యాపార జాబితాలను బ్లాక్ చేసింది. వాటిలో చాలా వ్యాపారాలు అనుమానాస్పద ప్రొఫైల్స్ మార్పులు, ఐదు స్టార్ సమీక్షలతో మోసాలు చేసిన వ్యాపారాలు ఉన్నాయి.
నకిలీ ప్రొఫైల్ సవరణలు
గూగుల్ వ్యాపార ప్రొఫైల్‌లను పర్యవేక్షించడానికి ఒక కొత్త AI టూల్‌ను ప్రారంభించింది. ఇది వ్యాపారాల నుంచి సందేహాస్పద ప్రొఫైల్ సవరణలను గుర్తిస్తుంది. ఉదాహరణకు, ఒక వ్యాపారం దాని పేరు లేదా వర్గాన్ని అనుచితంగా మార్చితే, గూగుల్ దానిని గుర్తించి, దర్యాప్తు చేస్తుంది. ఉదాహరణకు, ఒక వ్యాపారం దాని పేరు “Zoe’s Coffee House” నుంచి “Zoe’s Cafe”గా మార్చినా, అది సర్వసాధారణం. కానీ, ఒక వ్యాపారం తన వర్గాన్ని “cafe” నుంచి “plumber” కి మార్చితే, అది అనుమానాస్పదంగా పరిగణించబడుతుంది.
సందేహాస్పదంగా ఉంటే..
ఇటువంటి సవరణలను గూగుల్ వెంటనే గుర్తించి, వాటిపై చర్య తీసుకుంటుంది. ఈ విధానం ద్వారా, వ్యాపారాలు తమ ప్రొఫైల్‌లను తప్పుదారి పట్టించే రీతిలో మార్చడానికి గూగుల్ అడ్డుకుంటుంది. ఈ సంవత్సరం మాత్రమే, గూగుల్ వేలాది సందేహాస్పద సవరణలను గూగుల్ ఏఐ బ్లాక్ చేసింది.
నకిలీ 5 స్టార్ సమీక్షలు
గూగుల్ మ్యాప్స్‌లో మరొక పెద్ద సమస్య, నకిలీ ఐదు-స్టార్ సమీక్షలు. చాలా వ్యాపారాలు తమ సేవలను సులభంగా పైకి తీసుకెళ్లడానికి, ఎప్పుడూ తమ సంస్థను సందర్శించని వ్యక్తుల నుంచి ఐదు-స్టార్ సమీక్షలను కొనుగోలు చేయడం జరుగుతుంది. ఇది కస్టమర్లను మోసం చేసే ఒక మార్గం. గూగుల్ దీని పై కూడా కఠిన చర్యలు తీసుకుంటోంది. గూగుల్ ఈ సమీక్షలను అడ్డుకునేందుకు AIని ఉపయోగిస్తోంది. సమీక్షలను తరచుగా పరిశీలించి, ఏవైనా నకిలీ లేదా నిజాయితీ లేని సమీక్షలు ఉంటే వాటిని తొలగిస్తోంది. దీంతోపాటు కొన్నిసార్లు యూఎస్, యూకే, భారతదేశంలో పలువురు కస్టమర్లకు హెచ్చరికలు కూడా పంపుతుంది.