Recharge Plans : ప్రముఖ ప్రైయివేట్ టెలికాం ఆపరేటర్లు రిలయన్స్ జియో, భారతీ ఎయిర్‌టెల్, వొడాఫోన్ ఐడియా (Vi).. ఈ మధ్య కాలంలో తమ టారిఫ్‌లను విపరీతంగా పెంచేశాయి. దాదాపు 11 నుండి 25 శాతం మధ్య పెంచాయి. ఈ నిర్ణయంతో మిలియన్ల మంది యూజర్లు ప్రభావితమయ్యారు. చాలా మంది వినియోగదారులు బిఎస్‌ఎన్‌ఎల్‌కు మారగా, కొంతమంది వినియోగదారులు టారిఫ్ పెంపుపై ప్రభుత్వానికి ఫిర్యాదు చేశారు. టారిఫ్ ఛార్జీలను తగ్గించాలని ఆయా టెలికాం సంస్థలకు ఆదేశాలు జారీ చేయాలని డిమాండ్ చేశారు. తాజాగా ఈ విషయంపై స్పందించిన ప్రభుత్వం సుంకాల పెంపులో జోక్యం చేసుకోబోమని స్పష్టం చేసింది.
ప్రైయివేట్ టెలికాం ఆపరేటర్లు ప్రీపెయిడ్, పోస్ట్‌పెయిడ్ మొబైల్ ప్లాన్‌ల కోసం టారిఫ్ ధరలను పెంచేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో యూజర్లు మండిపడి ప్రభుత్వానికి ఫిర్యాదు చేశారు. ఈ విషయంపై స్పందించిన సమాచార ప్రసారాలు మరియు గ్రామీణాభివృద్ధి శాఖ సహాయ మంత్రి పెమ్మసాని చంద్ర శేఖర్ వివరణ ఇచ్చారు. టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా (TRAI) ద్వారా ఆ ఎంపికలు చేసినందున సుంకాల పెంపులో భారత ప్రభుత్వం జోక్యం చేసుకోబోమని వెల్లడించింది. 2004 నుండి పోటీ మార్కెట్‌లో టెలికాం సర్వీస్ ప్రొవైడర్‌లు తమ స్వంత ధరలను నిర్ణయించుకోవడానికి TRAI వీలు కల్పించిందని స్పష్టం చేశారు.
ధరలు సరఫరా అనేది డిమాండ్ డైనమిక్స్‌పై ఆధారపడి ఉంటాయని తెలిపారు. అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా ఈ నిర్ణయాలు ఉంటాయని వీటి విషయంలో ప్రభుత్వం జోక్యం చేసుకోవటం సరైన విషయంకాదని తెలిపారు. 2004లో ప్రపంచంలోని అనేక దేశాలకు అనుగుణంగా టెలికాం సేవలను భారతీయ సంస్థలు సైతం విస్తరించాయని.. మార్కెట్‌లో తగిన పోటీని ఎదుర్కోవల్సి వస్తుందని అందుకే వాటికి ప్రత్యేక రూల్స్ ఉంటాయని తెలిపారు. ఇంకా, ప్రపంచవ్యాప్తంగా తక్కువ టెలికాం టారిఫ్‌లను కలిగి ఉన్న దేశాలలో భారత్ కూడా ఉందని పెమ్మసాని పేర్కొన్నాడు. భారత్ లో 1GB మొబైల్ డేటా సగటు ధర తక్కువగా ఉందని, ఇది యునైటెడ్ స్టేట్స్ కి పూర్తి విరుద్ధంగా ఉందన్నారు.
ఇక టెలికాం అథారిటీ ఆఫ్ ఇండియా (TRAI) కు కొన్ని రూల్స్ ఉన్నాయి. వాటి ప్రకారం టెలికాం ఆపరేటర్లు తమ రేట్లలో ఏవైనా మార్పులు చేస్తే, మార్పు అమల్లోకి వచ్చిన ఏడు రోజుల్లోగా వినియోగదారులకు తెలియజేయాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలో రెగ్యులేటర్ మార్కెట్‌కు సర్వీస్ చెల్లుబాటును అందించే ప్రీపెయిడ్ ప్లాన్‌లు అవసరమా అనే దానిపై కూడా ట్రాయ్ సంప్రదింపులు జరుపుతున్నట్లు తెలుస్తుంది.
ఈరోజుల్లో స్మార్ట్ ఫోన్ తో పాటు డేటా వినియోగం సైతం విపరీతంగా పెరిగిపోతున్న నేపథ్యంలో ప్రముఖ టెలికాం సంస్థలన్నీ విపరీతంగా రేట్లు పెంచేసాయి అన్న విషయంలో ఎలాంటి సందేహం లేదు. ఒక టెలికాం సంస్థకు పోటీపడి మరో టెలికాం సంస్థ ఎప్పటికప్పుడు టారిఫ్ చార్జీలను విపరీతంగా పెంచేస్తుంది. దీనిపై అసహనం వ్యక్తం చేసిన కస్టమర్స్ తాజాగా జియో కు గట్టి షాక్ ఇచ్చిన సంగతి తెలిసిందే. దాదాపు 70 లక్షల యూజర్స్ జియో నుంచి వేరే నెట్వర్క్స్ కు పోర్ట్ అయిపోయారు.
ALSO READ : ఆధార్ లో అడ్రస్ మార్చాలా..! ఇంకొన్ని రోజులే గడువు