SSC Exams : SSC Exams : తెలంగాణలో పదో తరగతి పరీక్షా విధానంలో మార్పులు చేస్తూ ఎస్ఎస్‌సీ (SSC) బోర్టు నిర్ణయం తీసుకుంది. ఇంటర్నల్ మార్కులు , ఫైనల్ ఎగ్జామ్ వారీగా వేరువేరుగా కేటాయించిన మార్కులని ఇకపై రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. ఇప్పటి నుంచి ఇంటర్నల్ మార్కులు ఉండవని స్పష్టం చేసిన పాఠశాల విద్యాశాఖ.. మార్కులన్నీ ఫైనల్ పరీక్షలకే కేటాయిస్తూ నిర్ణయం తీసుకుంది.
పాఠశాల విద్యాశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ బీ. వెంకటేశం పేరుతో ప్రభుత్వం ప్రత్యేక జీవో ను విడుదల చేసింది. ఇందులో ఇప్పటి వరకు పరీక్షా పేపర్ ను 80 మార్కులకు నిర్వహిస్తుండగా.. ఇకపై పూర్తిగా 100 మార్కులకు పరీక్షలు రాయాల్సి ఉంటుందని స్పష్టం చేసింది.
ఇప్పటి వరకు నిర్వహిస్తున్నట్లుగా పాఠశాలలో అంతర్గత పరీక్షలకు ప్రాక్టికల్స్ పేరుతో కేటాయిస్తున్న మార్కులను తొలగిస్తున్నట్లు స్పష్టం చేసింది. దీంతో.. పాఠశాల స్థాయిలో ప్రాక్టికల్స్ ను పూర్తిగా తొలగించనుండగా.. ఆ మార్కులను ఫైనల్ పరీక్ష పేపర్ లో కలపనున్నారు.
మార్కుల కేటాయింపు విధానంలో తీసుకువచ్చిన మార్పులు 2024-2025 విద్యా సంవత్సరం విద్యార్థులకు వర్తిస్తాయని పాఠశాల విద్యా శాఖ వెల్లడించింది. మార్కుల కేటాయింపు విధానంపై పూర్తి స్థాయి విశ్లేషణ, పరిశీలన చేసిన తర్వాతనే .. ఇంటర్నల్ మార్కులను పూర్తిగా ఎత్తేయ్యాలని నిర్ణయించినట్లు సంబంధిత జీవోలో ప్రభుత్వం వెల్లడించింది.