TRUNK CALLS VS WATSAPP: ఇళ్లల్లో నల్లటి చెక్క బల్లపై ఆ నల్లటి డయల్ ఫోన్ మెరుస్తుంటే.. ఆ కుటుంబానికే ఒక ప్రత్యేకమైన గుర్తింపు దక్కేది. ఫోన్ రింగ్ అయితే చాలు, ఇరుగు పొరుగు వాళ్లంతా ఒక్కసారిగా అలర్ట్ అయిపోయేంత హడావుడి! బాంబే నుంచి మీ చెల్లెలు ఫోన్ చేసిందని కబురు రాగానే.. కొంగులు సరిచేసుకుంటూ, చెప్పులు కూడా వేసుకోకుండా పరుగెత్తిన ఆ రోజులే వేరు. నంబర్లు తిప్పేటప్పుడు వచ్చే ఆ ‘ఖర్ర్ ఖర్ర్’ శబ్దం వెనుక ఒక అపురూపమైన బంధం ముడిపడి ఉండేది.
వీధి చివర చిన్న రేకుల షెడ్డులో పసుపు రంగు STD బోర్డు కనిపిస్తే చాలు.. అక్కడ ఎప్పుడూ ఒక చిన్న జాతరే జరిగేది. రెడ్ కలర్ డిజిటల్ మీటర్‌లో పైసలు ఎక్కుతుంటే గుండెల్లో రైళ్లు పరిగెత్తేవి. ఒక్క నిమిషం దాటితే జేబు ఖాళీ అయిపోతుందనే భయంతో స్పీడ్‌గా మాటలు ముగించే రోజులు అవి. ఇక ప్రేమలో ఉన్నవారైతే.. రాత్రి ఎనిమిది దాటాక PCO క్యూలో నిలబడి కాయిన్స్ వేస్తూ మెల్లగా గుసగుసలాడటంలో ఒక వింతైన థ్రిల్ ఉండేది.
పోస్టాఫీసుకి వెళ్లి ‘ట్రంక్ కాల్’ బుక్ చేయడం అంటే ఒక పెద్ద సాహసం. ఆపరేటర్ కాల్ కనెక్ట్ చేసేదాకా గంటల తరబడి, కొన్నిసార్లు అర్ధరాత్రి దాకా బెంచ్ మీద కూర్చుని కాపలా కాయాల్సిందే. “యువర్ ట్రంక్ కాల్ ఈజ్ రెడీ” అని ఆపరేటర్ గొంతు వినపడగానే గుండెల్లో దడ మొదలయ్యేది. సరిగ్గా మాట మొదలుపెట్టగానే లైన్‌లో వచ్చే నాయిస్, మధ్యలోనే కాల్ కట్ అయిపోతే పడే ఆరాటం.. ఆ జనరేషన్‌కి పరిచయమైన ఒక అనుభూతి.
వేగం పెరిగింది.. దూరం పెరిగిన కొద్దీ మనుషుల్ని దగ్గర చేసేలా డిజిటల్ టెక్నాలజీ స్పీడ్ అయింది. ఈరోజు టైపింగ్ కూడా అవసరం లేకుండా వాయిస్ నోట్స్, క్లిక్ కొడితే సరిపోయే లైవ్ వీడియో కాల్స్, ‘సీన్’ అయిందో లేదో చెప్పే బ్లూ టిక్స్.. అంతా వాట్సాప్ మయం. కమ్యూనికేషన్ చాలా వేగంగా, సులభంగా అయిపోయింది. కానీ నాటి ట్రంక్ కాల్స్ కోసం గంటల తరబడి ఎదురుచూసి మాట్లాడిన ఆ ఒక్క మాటలో ఉన్న ఇంటెన్సిటీ.. ఈరోజు వేలల్లో పంపుతున్న వాట్సాప్ మెసేజ్‌లలో ఉందా?
Also Read: 1980sలో విశాఖ ఉక్కు ఎలా ఏర్పాటయ్యిందంటే.. కళ్లకు కట్టినట్లు చూపించిన ‘బిగ్ టీవీ’
Also Read: అంతరిక్షం అడుగుపెట్టి.. సొంత శాటిలైట్లతో సత్తా చాటి.. 80ల్లో ISRO అంటే ఫ్లవర్ కాదు ఫైర్!