Eagle eye: గద్దలు ఆకాశంలో చాలా ఎత్తున ఎగురుతాయి. ఆకాశంలో వేల అడుగుల ఎత్తులో ఎగురుతున్న గద్దలు భూమిపై వాటి ఆహారాన్ని, చిన్న చిన్న వస్తువులను, ఎరను కానీ చాలా స్పష్టంగా గుర్తించగలవు. ఆకాశంలో చాలా ఎత్తున ఎగురుతున్న గద్ద వచ్చి కింద భూమిపై ఉన్న దాని ఆహారమైన చిన్న చిన్న జంతువులను స్పష్టంగా చూసి అందుకోవడం మనం చాలా సినిమాల్లో, సోషల్ మీడియా వీడియోలలో చూసే ఉంటాం. గద్దలకు ఉన్న ఈ అసాధారణ దృష్టికి శారీరకంగా, బయోలాజికల్‌గా కొన్ని కారణాలు ఉన్నాయని ఆర్నిథాలజిస్టులు (పక్షుల శాస్త్రవేత్తలు) చెబుతున్నారు. అయితే, వాటి స్పష్టమైన చూపుకి కారణాలు ఈ కింది ఆర్టికల్ చదివి తెలుసుకోండి.
రెటీనాలో ఫోవియా ప్రాంతాలు
గద్దల కళ్లు అధిక సాంద్రత గల ఫోటోరిసెప్టార్ సెల్స్‌తో నిండి ఉంటాయి. ఈ సెల్స్ కంటిపై పడిన లైట్‌ను బ్రెయిన్‌కు పంపి దానిని చూపుకు ఉపయోగపడేలా చేస్తాయి. రంగులను, వివరాలను స్పష్టంగా గుర్తించడంలో ఉపయోగపడే కోన్ కణాలు మానవ కంటిలో 2 లక్షలు ఉంటే, గద్ద కంటిలో అవి దాదాపు 10 లక్షల వరకు ఉంటాయి. గద్దల రెటీనాలో ఫోవియా అనే రెండు ప్రత్యేక ప్రాంతాలలో ఒకటి ముందుకు చూసే దృష్టికి, మరోటి పక్కకు చూసే దృష్టికి ఉపయోగపడతాయి. ఈ ఫోవియా కారణంగా గద్ద ఏకకాలంలో రెండు వేరు వేరు దిశలలో స్పష్టంగా చూడగలదని నిపుణులు చెబుతున్నారు.
దృష్టి కోణం
గద్దల కళ్లు వాటి తల పరిమాణం కంటే పెద్దగా ఉండడం వల్ల అవి విస్తృతమైన దృష్టి కోణాన్ని కలిగి ఉంటాయి. ఇవి దాదాపు 340 డిగ్రీల దృష్టి కోణంలో చూడగలవు. ఇది మానవులకు ఉన్న దృష్టి కోణం కంటే చాలా ఎక్కువ. గద్దలకు ఉన్న ఈ విస్తృతమైన దృష్టి కోణం వల్ల అవి విస్తృతమైన పరిసరాలను ఒకేసారి గమనించగలవని పరిశోధకులు చెబుతున్నారు.
Uరేస్ కూడా..
ఇవి మానవులకు కనిపించని అల్ట్రావయొలెట్ రేస్‌ను కూడా చూడగలవు. ఇది ఎర మూత్రం లేదా వేరే గుర్తులను సులభంగా గుర్తించడంలో సహాయపడుతుంది. వీటి కళ్లలో ఉండే ప్రత్యేక ఆయిల్ డ్రాప్‌లెట్స్ లైట్‌ను ఫిల్టర్ చేసి రంగులను మరింత క్లియర్‌గా చూడడానికి సహాయపడతాయని సైంటిస్టులు చెబుతున్నారు. గద్దలకు ఉండే ఐ పవర్‌తో అవి వేగవంతమైన కదలికలను కూడా చాలా క్లియర్‌గా చూడగలగడం వల్ల ఆకాశం నుంచి అంత ఎత్తు నుంచి కూడా వాటి ఎరను గుర్తించి ఖచ్చితంగా దాడి చేయడంలో సహాయపడుతుందని శాస్త్రవేత్తలు అంటున్నారు. ఈ లక్షణాల వల్ల గద్దలు ఆకాశంలో అంత ఎత్తు నుంచి కూడా స్పష్టంగా చూడగలిగే శక్తిని కలిగి ఉంటాయి.