Google History: ఇంటర్నెట్ ప్రపంచాన్ని ఏలుతున్న ఒకే ఒక్క పేరు గూగుల్. మనకు ఏ చిన్న అనుమానం వచ్చినా వెంటనే సెర్చ్ బార్ ఓపెన్ చేసి టైప్ చేస్తాం. కానీ, అసలు ఈ పేరు వెనుక ఉన్న కథ ఏంటి? ప్రతిరోజూ మనం వాడే ఈ పదం వెనుక ఒక చిన్న స్పెల్లింగ్ పొరపాటు ఉందని, అది ఒక రాత్రి హాస్టల్ గదిలో జరిగింది అంటే మీరు నమ్ముతారా? అసలు ఆ రాత్రి ఏమైందో తెలుసుకోవాలంటే మనం కొన్నేళ్లు వెనక్కి వెళ్లాల్సిందే.
స్టాన్‌ఫోర్డ్ విశ్వవిద్యాలయంలో పీహెచ్‌డి చేస్తున్న ఇద్దరు యువకులు లారీ పేజ్, సెర్గీ బ్రిన్. వీరిద్దరి ఆలోచనలు వేరైనా.. ఇంటర్నెట్‌లో సమాచారాన్ని సులభంగా వెతికేలా చేయాలనే లక్ష్యం మాత్రం ఒకటే. ఆ రోజుల్లో ఇంటర్నెట్‌లో సమాచారం అస్తవ్యస్తంగా ఉండేది. దాంతో వెబ్‌సైట్ల లింక్‌ల ఆధారంగా సమాచారాన్ని వర్గీకరించే ఒక కొత్త సెర్చ్ ఇంజిన్‌ను తయారు చేశారు. దానికి మొదట బ్యాక్‌రబ్ అని పేరు పెట్టారు. కానీ ఆ పేరు పెద్దగా ఆకట్టుకోలేదు. దాంతో తమ ప్రాజెక్ట్‌కు ఒక శక్తివంతమైన, అర్థవంతమైన పేరు పెట్టాలని నిర్ణయించుకున్నారు.
ఒకరోజు రాత్రి లారీ పేజ్ తన హాస్టల్ రూమ్‌లో సహచర విద్యార్థులతో కలిసి తీవ్రంగా ఆలోచిస్తున్నాడు. ఆ గదిలో లారీ పేజ్‌తో పాటు సేన్ ఆండర్సన్ అనే మరో విద్యార్థి కూడా ఉన్నాడు. వీరు సెర్చ్ ఇంజిన్ దాచగలిగే భారీ సమాచారాన్ని ప్రతిబింబించేలా ఒక మంచి పేరు కోసం వెతుకుతున్నారు. గణితంలో ఒకటి పక్కన వంద సున్నాలు ఉండే సంఖ్యను గూగోల్ (Googol) అంటారు. ఈ పదం వారిని బాగా ఆకట్టుకుంది. ఇంటర్నెట్‌లో ఉన్న అపరిమితమైన సమాచారాన్ని ఇది సరిగ్గా సూచిస్తుందని లారీ పేజ్ భావించాడు. అందుకే అదే పేరును ఖరారు చేయాలని అనుకున్నారు.
Also Read: ఈ రక్షా బంధన్‌కు కజిన్స్‌ను ఇంప్రెస్ చేసే 5 యూనిక్ టెక్ గిఫ్ట్స్.. బడ్జెట్ ధరలోనే!
పేరు అయితే అనుకున్నారు కానీ, ఆ పేరుతో డొమైన్ నేమ్ అందుబాటులో ఉందో లేదో తనిఖీ చేయాలి. లారీ పేజ్ సూచనతో సేన్ ఆండర్సన్ వెంటనే కంప్యూటర్ సిస్టమ్ ముందుకు వెళ్లాడు. ఆత్రుతలో ఆండర్సన్ టైప్ చేసేటప్పుడు ఒక చిన్న తప్పు చేశాడు. Googol అని సరిగ్గా టైప్ చేయడానికి బదులుగా, పొరపాటున Google.com అని టైప్ చేసి సెర్చ్ బటన్ నొక్కాడు. ఇంటర్నెట్ నెమ్మదిగా ఉన్న ఆ రాత్రి, ఆ ఒక్క చిన్న పొరపాటు సాంకేతిక ప్రపంచంలో ఒక కొత్త చరిత్రకు పునాది వేస్తుందని ఆ గదిలో ఉన్నవారు ఎవరూ ఊహించలేదు.
సిస్టమ్ స్క్రీన్ వైపు చూసిన లారీ పేజ్, ఆండర్సన్ చేసిన తప్పును వెంటనే గమనించాడు. అయితే అతను కోపడలేదు. పైగా స్క్రీన్‌పై కనిపిస్తున్న Google అనే కొత్త పదం అతనికి చాలా బాగా నచ్చింది. అది చూడటానికి చాలా కొత్తగా, పిలవడానికి సులభంగా అనిపించింది. అసలైన పదానికంటే ఈ కొత్త స్పెల్లింగ్ చాలా బాగుందని భావించిన లారీ పేజ్, వెంటనే ఆ డొమైన్‌ను రిజిస్టర్ చేసేశాడు. అలా ఒక హాస్టల్ రూమ్‌లో అనుకోకుండా జరిగిన స్పెల్లింగ్ పొరపాటు వల్ల ‘గూగోల్’ కాస్త ‘గూగుల్’గా మారిపోయింది.
మరుసటి రోజు ఉదయానికే ఈ విషయం సెర్గీ బ్రిన్‌కు తెలిసింది. అతను కూడా ఈ కొత్త పేరుకు ఫిదా అయ్యాడు. 1997 సెప్టెంబర్ 15న గూగుల్ డొమైన్ అధికారికంగా నమోదు చేయబడింది. ఆ తర్వాత ఒక చిన్న గ్యారేజ్ నుంచి ప్రారంభమైన ఈ సంస్థ, అతి తక్కువ కాలంలోనే ప్రపంచంలోనే అతిపెద్ద టెక్నాలజీ కంపెనీగా అవతరించింది. మనం ప్రతిరోజూ వాడే ఈ పదం వెనుక ఒక రాత్రి జరిగిన సరదా సంభాషణ, ఒక చిన్న మానవ పొరపాటు ఉన్నాయంటే నిజంగా ఆశ్చర్యంగా అనిపిస్తుంది.
సాంకేతిక ప్రపంచంలో ఎన్నో పరిశోధనలు, ప్రయోగాలు జరుగుతుంటాయి. కానీ ఒక హాస్టల్ రూమ్‌లో కేవలం ఒక్క అక్షరం తప్పుగా టైప్ చేయడం వల్ల ప్రపంచం మొత్తం మారే ఒక పేరు పుట్టుకొస్తుందని ఎవరూ ఊహించలేదు. ఆ రోజు రాత్రి ఆండర్సన్ సరైన స్పెల్లింగ్ టైప్ చేసి ఉంటే.. ఈరోజు మనం ‘గూగుల్ చేయి’ అని అనడానికి బదులు ‘గూగోల్ చేయి’ అని అనేవాళ్లమేమో! ఏది ఏమైనా ఆ రాత్రి జరిగిన ఆ చిన్న పొరపాటు, మానవ చరిత్రలోనే అత్యంత విజవంతమైన తప్పుగా నిలిచిపోయింది.
Also Read: బడ్జెట్ యూజర్లకు పండగే పండగ.. రూ.10 వేలలోపు మూడేళ్ల వారంటీతో Realme C100i వస్తోంది!