Mobile Charging Cost: స్మార్ట్‌ఫోన్ లేని రోజును ఊహించుకోవడం కష్టం. ఉదయం లేచింది మొదలు రాత్రి పడుకునే వరకు ఏదో ఒక పనికి మొబైల్ వాడాల్సిందే. ఈ క్రమంలో రోజుకు కనీసం ఒక్కసారైనా (కొందరు రెండు మూడు సార్లు) ఫోన్‌కు ఛార్జింగ్ పెడుతుంటాం. అయితే రోజంతా ఛార్జింగ్ పెట్టడం వల్ల నెలవారీ కరెంట్ బిల్లు భారీగా పెరిగిపోతోందేమో అని చాలామంది సందేహిస్తుంటారు. మరి నిజంగానే 30 రోజుల పాటు స్మార్ట్‌ఫోన్ ఛార్జ్ చేస్తే ఎంత విద్యుత్ ఖర్చవుతుంది? దానికి అయ్యే బిల్లు ఎంత? దీనికి సంబంధించిన లెక్కలు ఇప్పుడు చూద్దాం.
సాధారణ స్మార్ట్‌ఫోన్ బ్యాటరీ సామర్థ్యం 4,000 mAh నుండి 5,000 mAh వరకు ఉంటుంది. ఫోన్‌ను 0% నుండి 100% వరకు ఛార్జ్ చేయడానికి దాదాపు 15 నుండి 25 వాట్ల (Watts) విద్యుత్ వినియోగం అవుతుంది. ఈ లెక్కన పూర్తి ఛార్జింగ్‌కు సగటున 0.02 నుండి 0.03 యూనిట్లు (kWh) అవుతుందని అంచనా.
మెుబైల్ ఛార్జింగ్ పెట్టడం వల్ల ఒక రోజుకు 0.03 యూనిట్లు అనుకుంటే 30 రోజులకూ 0.90 యూనిట్లు అవుతుంది. అంటే 1 యూనిట్ కంటే తక్కువ. ఒకవేళ రోజూ 2 సార్లు ఛార్జింగ్ చేసినా లేదా ఫాస్ట్ ఛార్జర్ వాడినా నెలకు గరిష్టంగా 1.5 నుండి 2 యూనిట్ల విద్యుత్ మాత్రమే ఖర్చవుతుంది.
దేశంలో సగటు గృహ విద్యుత్ ఛార్జీలు ఒక యూనిట్‌కు రూ. 6 నుండి రూ. 8 వరకు ఉంది. పైన వేసిన లెక్కల ప్రకారం.. ఒక నెల మొత్తం రోజూ ఫోన్ ఛార్జ్ చేసినా కూడా అయ్యే ఖర్చు రూ. 6 నుండి రూ. 10ల మించదు. సంవత్సరానికి లెక్కించినా కూడా మీ మొబైల్ ఛార్జింగ్ ఖర్చు రూ. 80 నుండి రూ. 100 మధ్యలోనే ఉంటుంది.
Also Read: సామాన్యులకు పండగే.. రూ.6000 లోపే వాషింగ్ మిషన్లు.. ఇక చేత్తో ఉతికే పనేలేదు!
చాలామంది ఫోన్ ఛార్జ్ అయ్యాక కూడా స్విచ్ ఆఫ్ చేయకుండా ఛార్జర్‌ను సాకెట్‌లోనే వదిలేస్తుంటారు. దీని వల్ల కొద్దిమేర విద్యుత్ ఖర్చయ్యే ఛాన్స్ ఉంది. అయితే స్విచ్ ఆన్ చేసి ఉంచిన ఛార్జర్ చాలా స్వల్ప విద్యుత్‌ను (0.1 W నుండి 0.5 W) మాత్రమే తీసుకుంటుంది. సంవత్సరం పొడవునా ఛార్జర్‌ను అలాగే ప్లగ్‌లో ఉంచినా కూడా దానికి అయ్యే ఖర్చు కేవలం రూ. 10 నుండి రూ. 20 మాత్రమే. అయితే భద్రతా కారణాల దృష్ట్యా ఛార్జింగ్ పూర్తయ్యాక స్విచ్ ఆఫ్ చేయడం మంచిదని నిపుణులు సూచిస్తున్నారు.