Best battery saving tricks: మార్నింగ్ ఫుల్ ఛార్జ్ చేసిన ఫోన్ సాయంత్రం అయ్యే సరికి ఆగిపోతుంటే.. ఎవరికైనా చిరాకు వస్తుంది. ప్రస్తుత కాలంలో స్మార్ట్ ఫోన్ మన జీవితంలో ప్రధాన భాగం అయిపోయింది కానీ..దీని బ్యాటరీ త్వరగా అయిపోవడం చాలా పెద్ద సమస్యగా మారింది. కొత్త ఫోన్ కొన్నప్పుడు.. వచ్చే బ్యాటరీ బ్యాకప్ కొద్ది రోజుల తర్వాత క్రమంగా తగ్గిపోతుంటుంది. అయితే కొన్ని చిన్న చిన్న మొబైల్ సెట్టింగ్స్‌ను మార్చుకోవడం ద్వారా బ్యాటరీ లైఫ్‌ను ఈజీగా డబుల్ చేసుకోవచ్చు. ఆ అద్భుతమైన ట్రిక్స్ ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.
స్మార్ట్ ఫోన్ ఛార్జింగ్ త్వరగా అయిపోవడానికి ప్రధాన కారణం డిస్‌ప్లే బ్రైట్‌నెస్. చాలా మంది ఫోన్ బ్రైట్‌నెస్‌ను చాలా ఎక్కువగా ఉంచుతుంటారు. దీని వల్ల బ్యాటరీ చాలా త్వరగా డ్రైన్ అవుతుంది. దీన్ని నివారించడానికి ఆటో-బ్రైట్‌నెస్‌ను ఆన్ చేయడం లేదా అవసరానికి తగట్టుగా బ్రైట్‌నెస్‌ను తగ్గించుకోవడం బెస్ట్. అలాగే ప్రస్తుతం ట్రెండ్ ప్రకారం చాలా ఫోన్లలో.. 120Hz హై రిఫ్రెష్ రేట్ వస్తోంది. ఇది బ్యాటరీని విపరీతంగా వాడేస్తుంది. సాధారణ పనుల కోసం దీన్ని 60Hzకి మార్చుకోవడం ద్వారా చాలా వరకు బ్యాటరీ సేవ్ చేసుకోవచ్చు.
మనం వాడని సమయాల్లో కూడా అనేక యాప్‌లు బ్యాక్‌గ్రౌండ్‌లో రన్ అవుతూ ఇంటర్నెట్‌ను , బ్యాటరీని పీల్చేస్తుంటాయి. ఇలా జరగకుండా ఉండాలంటే.. సెట్టింగ్స్‌లోకి వెళ్లి బ్యాక్‌గ్రౌండ్ యాప్ యాక్టివిటీని పరిమితం చేయడం చాలా ముఖ్యం. అలాగే జీపీఎస్ లేదా లొకేషన్ సర్వీసెస్ ఎప్పుడూ ఆన్‌లో ఉంటే బ్యాటరీ త్వరగా అయిపోతుంది. కేవలం గూగుల్ మ్యాప్స్ లేదా నావిగేషన్ అవసరమైనప్పుడు మాత్రమే లొకేషన్‌ను ఆన్ చేసి, మిగతా సమయంలో దాన్ని ఆఫ్ చేయడం మంచి అలవాటు. దీని వల్ల అనవసరమైన బ్యాటరీ ఖర్చు చాలా వరకు తగ్గుతుంది.
ప్రస్తుతం అన్ని స్మార్ట్‌ఫోన్లలోనూ సూపర్ అమోలెడ్ లేదా ఓలెడ్ డిస్‌ప్లేలు వస్తున్నాయి. వీటిలో డార్క్ మోడ్ వాడటం వల్ల పిక్సెల్స్ లైట్ ఆఫ్ అయి బ్యాటరీ లైఫ్ విపరీతంగా పెరుగుతుంది. రోజంతా డార్క్ మోడ్‌ను ఉపయోగించడం కంటికి కూడా ఎంతో విశ్రాంతిని ఇస్తుంది. మరోవైపు.. ప్రతి చిన్న యాప్ నుంచి వచ్చే అనవసరమైన నోటిఫికేషన్లు ఫోన్ స్క్రీన్‌ను పదే పదే ఆన్ చేసి బ్యాటరీని తగ్గిస్తాయి. సెట్టింగ్స్‌లో కేవలం ముఖ్యమైన యాప్‌ల నోటిఫికేషన్లను మాత్రమే అనుమతించడం ద్వారా ఈ సమస్యకు ఈజీగా చెక్ పెట్టొచ్చు.
Also Read: ఇంతవరకూ ఏ టీవీలో లేని ఫీచర్లతో.. కొత్త మోడల్ లాంచ్
ఫోన్ సెట్టింగ్స్‌లో ఆటో-సింక్ ఎప్పుడూ ఆన్‌లో ఉండటం వల్ల ఈమెయిల్స్, కాంటాక్ట్‌లు తరచూ సర్వర్‌తో సింక్ అవుతూ బ్యాటరీని ఖాళీ చేస్తుంటాయి. దీన్ని మాన్యువల్ మోడ్‌కి మార్చుకోవడం ద్వారా చాలా వరకు బ్యాటరీ రక్షించవచ్చు. అలాగే అవసరం లేని సమయంలో.. బ్లూటూత్, వైఫై, మొబైల్ డేటాను ఆఫ్‌లో ఉంచడం చాలా అవసరం. చాలా మంది ఇళ్లలో లేదా ఆఫీసులో వైఫై ఉన్నప్పటికీ మొబైల్ డేటాను ఆన్ చేస్తుంటారు, ఇది సిగ్నల్ కోసం ఫోన్ ఎక్కువ శక్తిని వాడేలా చేస్తుంది.
లేటెస్ట్ స్మార్ట్‌ఫోన్లలో వచ్చే బిల్ట్-ఇన్ బ్యాటరీ సేవర్ లేదా అడాప్టివ్ బ్యాటరీ ఫీచర్లు ఫోన్ బ్యాటరీ లైఫ్‌ను పెంచడంలో అద్భుతంగా పని చేస్తాయి. ఫోన్ బ్యాటరీ 20 శాతానికి.. పడిపోయినప్పుడు మాత్రమే కాకుండా.. రోజంతా ఆటోమేటిక్ పవర్ మేనేజ్‌మెంట్ ఆన్ చేసేయడం మంచిది. అలాగే.. రాత్రి సమయంలో ఫోన్‌ను ఓవర్‌నైట్ ఛార్జింగ్‌లో పెట్టకుండా ఆప్టిమైజ్డ్ ఛార్జింగ్ ఫీచర్‌ను వాడాలి.ఈ చిన్న సెట్టింగ్ మార్పులన్నింటినీ సరిగ్గా పాటిస్తే.. మీ ఫోన్ బ్యాటరీ లైఫ్ ఖచ్చితంగా డబుల్ అవ్వడంతో పాటు బ్యాటరీ కూడా ఎక్కువ రోజులు పాడవకుండా ఉంటుంది.