ఆవాహయామీ.. వరుణా.. ఆవాహాయామీ! అని యాగాల మంత్ర ఘోషలకు క్షుద్ర పూజల ప్రభావం కకావికలమై.. వరుణ దేవుడి రాకకు ఆటంకంగా మారిన మేఘాలన్నీ తొలగిపోయి.. కుంభవృష్టి వానలు కురిసి.. సమృద్దిగా పాడి పంటలు పండాలి. ఇదే నినాదంతో.. యాగాల విధానాన్ని ఎత్తుకున్నది సర్కార్.
క్షుద్ర పూజలకు విరుగుడుగా దైవపూజలను ప్రయోగిస్తున్నది. వర్షాలు రావొద్దంటే.. మేము ఇలా మహా వరుణ యాగం చేసి వరణుడికి రెడ్ కార్పెట్ పరుస్తాం… ఈ యాగాలు మీ పూజల శక్తులను పారదోలుతాయి.. చివరకు ఎల్‌నినో కూడా తెలంగాణకు రాకుండా చేస్తాయి.. అనేంతగా భక్తిభావంతో, త్రికరణ శుద్దిగా పూజలు, యాగాలు చేసేందుకు రెడీ అయ్యింది రేవంత్‌రెడ్డి సర్కార్.
హరీశ్ రావు క్షుద్ర పూజల టాపిక్ ఏనాడైతే బయటకు వచ్చిందో.. ఇలా వరుణుడి చుట్టూ రాజకీయాలు తిరుగుతున్నాయి. ఇలాంటి పరిస్థితిని బహుశా ఆ వరణుడు కూడా ఎప్పుడూ చూసి ఉండడు. వానలు పడకపోతే.. కప్పల పెళ్లిళ్లు చేయడం చూసి ఉంటాడు. మరీ కరువు పరిస్థితుల్లో వరుణయాగాలు కూడా కామన్‌గా చేస్తారు. కానీ ఇప్పుడు అర్జెంటుగా వరుణుడిని తలుచుకునేది ఎల్‌నినో ఎఫెక్ట్‌తో కాదు.. సాగు ఆగమాగమైందనీ కాదు.. వానలు లేక నారుమళ్లు వేసుకోవడం లేదనీ కాదు. రైతుల బాధలు చూడలేకా కాదు. హరీశ్‌రావు పన్నాగానికి చెక్ పెట్టేందుకు. ఫామ్‌హౌజ్‌లో ఉండి క్షుద్ర రాజకీయాల డైరెక్షన్ చేస్తున్న కేసీఆర్ కుతంత్ర తాంత్రిక మంత్రాలను పారదోలేందుకు. బీఆరెస్ చేస్తున్న క్షుద్ర రాజకీయానికి వరుణుడి ప్రసన్నం చేసుకోవడం ద్వారా గుణపాఠం నేర్పించడానికి.
అవును మరి. ఓ వైపు వానలు దంచుతుంటే.. ఈ మాహా వరుణ యాగమేందీ? అనుకుంటున్నారా? అంటే.. రాజకీయం అంతే మరి. దీన్ని ఇప్పుడప్పుడే వదిలి పెట్టొద్దు. నాగార్జున సాగర్ వద్ద ఈనెల 10న జరిగే ఈ మహా వరుణ యాగానికి సీఎం రేవంత్‌రెడ్డి కూడా వెళ్తున్నాడంటేనే ఎంతటి ప్రయార్టీ ఇచ్చి ఉంటాడు? దేనికీ.. వరుణయాగానికి కాదు. తెలంగాణ జాతికి హరీశ్‌రావు క్షుద్ర పూజల పన్నాగాన్ని వివరించేందుకు.
108 మంది రుత్వికులు, 11 హోమ గుండాలతో వేదోక్తంగా పూజలు నిర్వహిస్తారన్నమాట. చివరకు జరిగే పూర్ణాహుతికి సీఎం హాజరు అవుతారు. ఈ పూజలు, యాగాలన్నీ మంత్రి ఉత్తమ్ కుమార్ చూసుకుంటాడు. ఎందుకంటే నీళ్ల మంత్రి కదా…? వరణుడికి ఆయనే టచ్‌లో ఉంటాడు మరి. యాదగిరి గుట్ట శ్రీ లక్ష్మీ నరసింహస్వామి అర్చకులు ఇదంతా చేస్తున్నారు. అంటే దేవాదాయ శాఖ దీన్ని టేకోవర్ చేస్తుందన్నమాట. ఆ ఖర్చంతా ప్రభుత్వానిదే. మంత్రి, సీఎంకు ఈ ఖర్చులతో సంబంధం లేదు. ఇది వ్యక్తిగతంగా చేస్తున్న పూజ కాదు కదా! తెలంగాణ కోసం.. రైతుల కోసం కాబట్టి ప్రభుత్వమే ఖర్చు భరించాలి. అది ఎన్ని కోట్లైనా.
లేకపోతే హరీశ్ చేపించిన క్షుద్రపూజలకు తెలంగాణ కరువు కోరలకు చిక్కి తల్లడిల్లిపోవడం ఖాయం. ఎల్‌నినోను మించిన కరువు ఆ క్షుద్ర పూజల వల్ల సంభవించే అవకాశాలున్నాయి. అందుకే సర్కార్ ఈ విధంగా మహా వరుణ యాగం నిర్వహించి తెలంగాణ ఎవుసాన్ని, రైతాంగాన్ని, తద్వారా ప్రజలను కాపాడబోతోంది. కేసీఆర్ మహా అయుత చండీయాగం చేసి .. బంగారు తెలంగాణ వైపు రాష్ట్రాన్ని తీసుకెళ్లాడు. ఇప్పుడు రేవంత్ రెడ్డి ప్రభుత్వంలో సమృద్ధిగా వర్షాల కోసం ఆవాహయామీ యాగాలు జరుగుతున్నాయి.