Hidden Camera: నేటి డిజిటల్ యుగంలో.. టెక్నాలజీ అద్భుతాలు సృష్టిస్తున్నా.. అదే టెక్నాలజీ మన ప్రైవసీకి ముప్పుగా మారుతోంది. ముఖ్యంగా.. మనం సురక్షితమని భావించే ప్రదేశాలు అంటే.. హోటల్ గదులు, పేయింగ్ గెస్ట్ , హాస్టళ్లు, లేదా కొత్తగా తీసుకున్న అద్దె ఇళ్లలో కొందరు దుండగులు రహస్యంగా స్పై కెమెరాలను అమర్చే ప్రమాదం ఉంది.
మీరు ప్రయాణంలో ఉన్నప్పుడు లేదా కొత్త ప్రదేశంలో ఉంటున్నప్పుడు, మీకు తెలియకుండానే మీ ప్రైవేట్ క్షణాలు రికార్డ్ కావచ్చు. అందుకే.. ఈ తరహా స్పై కెమెరాలు గుర్తించే విధానాలను తెలుసుకోవడం, అప్రమత్తంగా ఉండటం అనేది ఇప్పుడు తప్పనిసరి.మీ వ్యక్తిగత భద్రతకు భంగం కలగకుండా ఉండాలంటే.. గదిలోకి అడుగు పెట్టిన వెంటనే తీసుకోవాల్సిన జాగ్రత్తలు, ఆ కెమెరాలను గుర్తించే సులభ మార్గాలను తెలుసుకుని సిద్ధంగా ఉండాలి.
స్పై కెమెరాలను గుర్తించే మార్గాలు:
దాచిన కెమెరాలు చాలా చిన్నవిగా ఉంటాయి. వాటిని గుర్తించడం కష్టం. అయితే.. కొన్ని సులభమైన పద్ధతుల ద్వారా వీటి ఉనికిని మాత్రం తెలుసుకోవచ్చు.
1. కంటితో చూడటం:
గదిలోకి రాగానే ముందుగా కొన్ని ముఖ్యమైన ప్రదేశాలను పరిశీలించండి. దాచిన కెమెరాలు సాధారణంగా ఎలక్ట్రికల్ వస్తువులు, ప్లాస్టిక్ వస్తువులు లేదా అద్దాల వెనుక ఉంటాయి.
టీవీ సెట్‌లు, స్మోక్ డిటెక్టర్లు, ఎయిర్ కండీషనర్ వెంట్లు, బుక్‌షెల్ఫ్‌లు, లాంప్‌లు, పవర్ సాకెట్లు, డెకరేటివ్ వస్తువులు, అద్దాల వెనుక భాగాలను పరిశీలించండి.
అద్దాలను పరీక్షించడం: గదిలోని అద్దం రెండు వైపుల అద్దమా అని తెలుసుకోవడానికి.. మీ వేలిని అద్దం ఉపరితలంపై ఆనించండి. వేలికి.. అద్దంలో కనిపించే ప్రతిబింబానికి మధ్య చిన్న గ్యాప్ లేకపోతే (అంటే వేలు ప్రతిబింబాన్ని తాకుతున్నట్లు అనిపిస్తే), అది రెండు వైపుల అద్దం అయ్యే అవకాశం ఉంది. దాని వెనక కెమెరా ఉండొచ్చు.
2.మొబైల్ ఫోన్ లైట్ టెక్నిక్ :
కెమెరా లెన్స్‌లు కాంతిని ప్రతిబింబిస్తాయి. అందుకే.. గదిలో లైట్లు ఆపి, మీ మొబైల్ ఫోన్ యొక్క ఫ్లాష్‌లైట్‌ను ఉపయోగించి అనుమానాస్పద వస్తువుల దగ్గర చెక్ చేయండి.
ఏదైనా చిన్న మెరుపు లేదా ప్రతిబింబం కనిపిస్తే.. దానిని జాగ్రత్తగా పరిశీలించండి. దాగి ఉన్న కెమెరా లెన్స్ కాంతిని తిప్పి పంపుతుంది.
3.మొబైల్ ఫోన్ కెమెరా టెస్ట్:
కొన్ని దాచిన కెమెరాలు ఇన్‌ఫ్రారెడ్ లైట్‌ను రాత్రిపూట రికార్డింగ్ కోసం ఉపయోగిస్తాయి. మనిషి కంటికి కనిపించని ఈ కాంతిని మొబైల్ ఫోన్ కెమెరా ద్వారా గుర్తించవచ్చు. గదిలో పూర్తిగా వెలుతురు లేకుండా చేసి.. మీ మొబైల్ ఫోన్ కెమెరా (సెల్ఫీ కెమెరా కాదు, వెనుక కెమెరా)ను ఆన్ చేసి, అనుమానం ఉన్న ప్రదేశాల వైపు చూడండి.కెమెరా లెన్స్‌లో ఎరుపు లేదా ఊదా రంగులో మెరుపు కనిపిస్తే.. అది ఇన్‌ఫ్రారెడ్ కెమెరా అయ్యే అవకాశం ఉంది.
Also Read: బ్రేక్- అప్‌కు ఛాన్స్ ఇవ్వొద్దు.. ప్రతి జంట గుర్తుంచుకోవాల్సిన రిలేషన్‌షిప్ రూల్స్
4. స్పై కెమెరా డిటెక్టర్ యాప్‌లు:
స్మార్ట్‌ఫోన్ యాప్ స్టోర్లలో ‘Hidden Camera Detector’ వంటి యాప్‌లు అందుబాటులో ఉన్నాయి. ఈ యాప్‌లు దాచిన కెమెరాల నుంచి వెలువడే ఎలక్ట్రోమ్యాగ్నెటిక్ ఫీల్డ్‌లను గుర్తించడానికి ప్రయత్నిస్తాయి. వీటిని ఉపయోగించి అనుమానాస్పదంగా ఉన్న ప్రాంతాలలో సెర్చ్ చేయవచ్చు.
సురక్షితంగా ఉండేందుకు తీసుకోవాల్సిన జాగ్రత్తలు:
కవర్ చేయండి: బాత్‌రూమ్, బెడ్‌రూమ్ వంటి ప్రదేశాలలో అనుమానాస్పద వస్తువులను (ఉదా: స్మోక్ డిటెక్టర్లు, ఎయిర్ ప్యూరిఫైయర్‌లు) దళసరి క్లాత్ లేదా టేప్‌తో కవర్ చేయండి.
వై-ఫై చెక్: గదిలో అనుమానాస్పద వై-ఫై నెట్‌వర్క్ ఉంటే (ఉదా: ‘RoomCam’ లేదా ‘HiddenDVR’ వంటి పేర్లతో).. జాగ్రత్త వహించండి. చాలా స్పై కెమెరాలు వై-ఫై ద్వారా డేటాను పంపుతాయి.
అద్దెకు తీసుకునే ముందు చెక్ చేయండి: హోటల్ బుక్ చేసే ముందు లేదా పీజీలో చేరే ముందు ఆ స్థలం గురించి ఆన్‌లైన్ సమీక్షలు రివ్యూలు తప్పకుండా చెక్ చేయండి.
అనుమానం వస్తే ఫిర్యాదు: మీకు నిజంగా కెమెరా ఉందని బలంగా అనిపిస్తే వెంటనే హోటల్ మేనేజ్‌మెంట్‌కు లేదా స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేయండి.