India Post DIGIPIN| మీరు కొరియర్ లేదా పోస్ట్ చేయడానికి సంబంధింత ప్రాంతానికి చెందిన గుర్తింపు పిన్ కోడ్ ఇంతకాలం రాసేవారు. కానీ ఇప్పుడు దాని అవసరం లేదు అని భారత తపాల విభాగమైన ఇండియా పోస్ట్ తెలిపింది. ఎందుకంటే ఇండియా పోస్ట్ కొత్తగా ప్రవేశపెట్టిన డిజిపిన్ సేవతో ఇకపై కొరియర్‌లు పంపడానికి సాంప్రదాయ పిన్ కోడ్‌లు అవసరం లేదు. ఈ వినూత్న వ్యవస్థ మీరు నివసించే లేదా టార్గెట్ స్థాన సమన్వయాల (కోఆర్డినేట్స్) ఆధారంగా ఒక డిజిటల్ పిన్ కోడ్‌ను జెనరేట్ చేస్తుంది. ఆ కోర్డినేట్స్ ఆధారంగా కొరియర్ సరైన చిరునామాకు చేరుతుంది. డిజిపిన్‌ను ఎలా పొందాలి, అది ఎలా పనిచేస్తుంది? ఆ వివరాలు మీ కోసం.
డిజిపిన్ అంటే ఏమిటి?
ఇండియా పోస్ట్ పూర్తిగా డిజిటల్ విధానంలోకి అడుగుపెడుతోంది. అందుకే https://dac.indiapost.gov.in/mydigipin/home అనే అధికారిక వెబ్‌సైట్‌ను ప్రారంభించింది. ఇక్కడ వినియోగదారులు తమ చిరునామాకు సంబంధించిన డిజిటల్ పిన్ కోడ్‌ను క్రియేట్ చేసుకోవచ్చు. డిజిపిన్ అనేది మీ ఇంటి లేదా కార్యాలయం యొక్క కచ్చితమైన స్థాన సమన్వయాల ఆధారంగా రూపొందిన 10-అంకెల అక్షరసంఖ్య (ఆల్ఫాన్యూమెరిక్) కోడ్.
కొరియర్, పార్సెల్ డెలివరీలతో పాటు, డిజిపిన్‌ను అత్యవసర సేవల కోసం కూడా ఉపయోగించవచ్చు. అత్యవసర పరిస్థితుల్లో పోలీసు, అంబులెన్స్ లేదా ఫైర్ సర్వీస్‌లకు మీ డిజిపిన్‌ను అందించడం ద్వారా వారు మీ చిరునామాను సులభంగా కనుగొని, తక్షణ సహాయం అందించగలరు.
డిజిపిన్‌ను ఎలా సృష్టించాలి?
డిజిపిన్ పొందడానికి, https://dac.indiapost.gov.in/mydigipin/home వెబ్‌సైట్‌కు వెళ్లండి. అక్కడ మీ పరికరానికి లోకల్ ఏరియా యాక్సెస్‌ను అనుమతించాలి. కచ్చితమైన స్థానం ఆధారంగా డిజిపిన్ సృష్టించబడుతుంది. ఈ కోడ్‌ను అత్యవసర సేవలు, లాజిస్టిక్స్, కొరియర్ డెలివరీ, రైడ్‌షేర్ బుకింగ్‌ల కోసం ఉపయోగించవచ్చు. ఐఐటీ హైదరాబాద్, ఎన్‌ఆర్‌ఎస్‌సీ, ఇస్రో సహకారంతో ఈ వ్యవస్థ అభివృద్ధి చేయబడింది. ఇది 4మీ x 4మీ గ్రిడ్‌లో ఇల్లు, కార్యాలయం లేదా సంస్థ యొక్క కచ్చితమైన స్థానాన్ని గుర్తించి, ప్రత్యేక 10-అక్షరాల కోడ్‌ను అందిస్తుంది.
సాంప్రదాయ పిన్ కోడ్‌కు ఇది చాలా భిన్నం?
సాంప్రదాయ 6-అంకెల పిన్ కోడ్‌లు పెద్ద ప్రాంతాల కోసం రూపొందించబడ్డాయి, అయితే డిజిపిన్ కచ్చితమైన స్థానాలను లక్ష్యంగా చేస్తుంది. ఇది 10-అక్షరాల అక్షరసంఖ్యా కలయికతో మరింత కచ్చితత్వంలో లొకేషన్ అడ్రస్ ని చూపిస్తుంది. ఈ డిజిటల్ పిన్ కోడ్ ఆఫ్‌లైన్‌లో కూడా ఉపయోగించడానికి సౌకర్యవంతంగా ఉంటుంది. దీంతో ఏదైనా ప్రాంతంలోని స్థానాలను సులభంగా కనుగొనవచ్చు.
Also Read: క్రికెట్ మ్యాచ్‌ను నిలిపేసిన పావురం.. ఫీల్డింగ్ చేసిన పక్షులు
డిజిపిన్ వ్యవస్థ భారత రాష్ట్రాలలో కొరియర్, అత్యవసర సేవలను మరింత సమర్థవంతంగా, కచ్చితంగా చేరేలా చేస్తుంది. ఈ సులభ, డిజిటల్ పరిష్కారం సాంప్రదాయ పిన్ కోడ్‌లను మించి, కచ్చితమైన చిరునామా గుర్తింపును అందిస్తుంది. ఈ సేవ భారత పోస్ట్‌ను ఆధునిక డిజిటల్ యుగంలోకి తీసుకెళ్తోంది.