జూన్ 4 సరిగ్గా ఎన్నికల ఫలితాలు వెలువడి ఏడాది పూర్తైంది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరవాత రాష్ట్రానికి మహర్దశ పట్టిందని, రాష్ట్రానికి పట్టిన విరగడైందని మిత్రపక్షాలు సంబరాలు చేసుకుంటున్నాయి. మరోవైపు రాష్ట్రవ్యాప్తంగా జూన్ 4న వెన్నుపోటు దినం నిర్వహిస్తున్నాం. ప్రతీ ఒక్కరూ ఈ నిరసనల్లో పాల్గొనాలి అని జగన్ పిలుపు ఇచ్చారు. అంతలావున పిలుపు ఇచ్చిన మాజీ ముఖ్యమంత్రి జగన్ రాష్ట్రంలో ఎక్కడా కనిపించలేదు.
వైసీపీ శ్రేణులు అక్కడక్కడ ఈ కార్యక్రమం నిర్వహించారు. ముఖ్య నేతలు కూడా పాల్గొన్నారు. కానీ, ఈ కార్యక్రమంలో ముందుండాల్సిన పార్టీ అధ్యక్షుడు రాష్ట్రంలో ఎక్కడ కనిపించలేదు. దీంతో జగన్ ఏమైపోయారు అని పార్టీ నేతలు, కార్యకర్తలు చర్చించుకున్నారు. మంగళవారం తెనాలిలో గంజా బ్యాచ్ ను పరామర్శించిన జగన్.. అటు నుంచి అటే బెంగళూరులోని యలహంక ప్యాలెస్‌కు వెళ్లిపోయారు. ఇంకోరోజు రాష్ట్రంలో ఉండి పార్టీ కార్యక్రమంలో పాల్గొనకపోవడం వైసీపీ క్యాడర్ కు ఏమాత్రం రుచించడం లేదంట.
వైసీపీ అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్న కార్యక్రమం ఇది. అయినా ఈ కార్యక్రమంలో జగనే పాల్గొనకపోతే ఎలా అని ప్రశ్నిస్తున్నారు. వైసీపీని తిరిగి పవర్ లోకి తీసుకొచ్చేందుకు పార్టీ నేతలు, కార్యకర్తలు కష్టపడాలి.. జగన్ మాత్రం ప్యాలెస్ లో కూర్చొని హాయిగా రెస్ట్ తీసుకుంటారా అని రుసరుసలాడుతున్నారు. మరో మూడేళ్లు ఓపిక పట్టండి.. కళ్ళు మూసుకుంటే మూడేళ్లు అవుతాయి. తర్వాత మనదే అధికారం అంటూ జగన్ తెగ ధీమాగా చెప్తున్నారు. కూటమి ప్రభుత్వం ఫెయిల్ అయిందని ఇంటింటికి వెళ్లి చెప్పాలని కార్యకర్తలకు చెప్తున్న జగన్.. తమ కష్టంతో అధికారంలోకి వద్దామనుకుంటున్నారా?.. అదే అసలైన వెన్నుపోటని వైసీపీ శ్రేణులు రుసరుసలాడుతున్నాయంట.
వైసీపీ ఘోర పరాజయం తర్వాత త్వరగానే రికవరీ అయిన వైసీపీ అధ్యక్షుడు జగన్ పార్టీని గాడిలో పెట్టే పనిలో పడినట్లు కనిపించారు.. కూటమి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసన కార్యక్రమాలకు పిలుపులిచ్చారు. అయితే అన్ని ఆందోళన కార్యక్రమాలకు స్థానిక నేతలే హాజరయ్యారు తప్ప ఎక్కడ అధినేత జగన్ పాల్గొనక పోవటంపై పార్టీ శ్రేణుల్లో భిన్నమైన అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. మొదటిసారి ప్రతిపక్షంలో ఉన్న సమయంలో దీక్షలు, పాదయాత్రల పేరుతో జనానికి దగ్గరైన ఆయన ఈసారి ఎందుకు నిరసన కార్యక్రమాలకు హాజరుకావడం లేదన్న చర్చ జరుగుతోంది.
Also Read: తప్పు చేస్తేనే శిక్ష.. ఏపీ కేబినెట్‌లో అరెస్ట్‌లపై కీలక చర్చ
2024 ఎన్నికల ఫలితాలు వైసీపీని చావుదెబ్బ కొట్టాయి. 151 సీట్ల నుంచి ఆ పార్టీ 11 సీట్లకు పరిమితమై కనీసం ప్రతిపక్ష హోదా కూడా దక్కించుకోలేక పోయింది. దీంతో ఇప్పుడప్పుడే ఆ పార్టీ కోలుకోలేదని అందరూ భావించారు. అయితే అధికారం కోల్పోయిన మొదటి నెల నుంచే కూటమి ప్రభుత్వంపై విమర్శల దాడి మొదలుపెట్టిన జగన్.. వైసీపీని సెట్ చేసే పనిలో పడినట్లు కనిపించారు. పార్టీ నుంచి పోయే వాళ్ళు పోతున్నా ఆయన మాత్రం.. కొత్తగా వచ్చే వారు వస్తారన్నట్లు ఉన్నవారితోనే రాజకీయం చేస్తున్నారు.
-Story By Apparao, Bigtv Live