Hyderabad : అవును, పరమాన్నమే పాయిజన్ అయింది. తియ్యటి విషం కమ్మగా గొంతులోకి జారిపోయింది. బెల్లంతో చేసిన పరమాన్నం. భలే టేస్టీగా ఉంది. బాగుంది కదాని మరింత తిన్నారు. తిన్న వారంతా ఇప్పుడు ఆసుపత్రి పాలయ్యారు. ఒకరు ఇద్దరు కాదు.. ఏకంగా 92 మంది అస్వస్థతకు గురయ్యారు. ఇప్పటికే ఒకరు చనిపోయారు. 18 మంది ఐసీయూలో ఉన్నారు. 74 మంది హాస్పిటల్‌లో చికిత్స పొందుతున్నారు. తెలంగాణ ప్రభుత్వాన్ని షేక్ చేసిన ఎర్రగడ్డ మానసిక చికిత్సాలయం ఫుడ్ పాయిజన్ ఘటనలో పరమాన్నం వల్లే ప్రాణాల మీదకు వచ్చిందని ప్రాథమికంగా నిర్థారణకు వచ్చారు. మరింత విచారణ జరుగుతోంది. పూర్తి స్థాయి నివేదిక రావాల్సి ఉంది.
అసలేం జరిగిందంటే..
జూన్ 2న తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఎర్రగడ్డ మెంటల్ హాస్పిటల్‌లో వేడుక నిర్వహించారు. అనంతరం విందు కూడా ఏర్పాటు చేశారు. మధ్యాహ్నం భోజనం చేసిన వాళ్లంతా.. సాయంత్రానికల్లా అస్వస్థతకు లోనయ్యారు. మొదట 30 మందికి అనారోగ్యం అన్నారు. ఆ తర్వాత సంఖ్య పెరుగుకుంటూ పోయింది. 30 కాస్తా 50.. 70.. చివరికి 92 మందికి ఫుడ్ పాయిజన్ అయిందని లెక్క తేల్చారు. కరణ్ అనే మానసిగ రోగి చనిపోవడం కలకలం రేపింది.
వేటు పడింది..
అంబులెన్సులతో ఎర్రగడ్డ ఆసుపత్రి ప్రాంగణం నిండిపోయింది. పరిస్థితి సీరియస్‌గా ఉన్న 18 మందిని ఉస్మానియా హాస్పిటల్‌కు తరలించారు. మిగతా 74 మందికి ఎర్రగడ్డలోనే ట్రీట్‌మెంట్ చేస్తున్నారు. జిల్లా కలెక్టర్, ఆరోగ్య శాఖ కార్యదర్శి, మంత్రి రాజనర్సింహ తదితరులు హాస్పిటల్‌కు వచ్చి పరిస్థితిని సమీక్షించారు. ఫుడ్ పాయిజన్ ఘటనపై పోలీసులు, ఆరోగ్య శాఖ, వాటర్ బోర్డు వేరువేరుగా విచారణ చేస్తున్నారు. హాస్పిటల్ RMOను సస్పెండ్ చేశారు. డైట్ కాంట్రాక్టర్‌ను తొలగించారు.
పరమాన్నమే విషంగా..
ఇంతకీ ఫుడ్ పాయిజన్ ఎలా జరిగింది? వాటర్ వల్లనా? భోజనం వల్లనా? అనే దిశగా రెండు రోజుల పాటు విచారణ జరిపారు. చివరికి విందులో పెట్టిన బెల్లం పరవాన్నం వల్లే ఫుడ్ పాయిజన్ అయిందని గుర్తించారు. నీళ్లు కలుషితం కాలేదని తేల్చారు. రోగులకు అందిస్తున్న నీటి నమూనా పరీక్షించగా ఎలాంటి సమస్య లేదని తేలింది. ఆహారం వండే వంటగది పరిశుభ్రంగా లేదని అధికారులు ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఎలా చనిపోయాడంటే..
చనిపోయిన కరణ్.. గ్యాస్ట్రో ఎంటిరైటిస్‌తో మరణించినట్టు నిర్ధారించారు వైద్యులు. పాయిజన్‌గా మారిన పరవాన్నం తినడం.. అప్పటికే గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్ ఉండటంతో.. రెండు కలిసి అతని ప్రాణాలు తీశాయని తెలిపారు. శాంపిల్స్ ల్యాబ్‌కు పంపించామని.. ల్యాబ్ రిపోర్ట్ వచ్చాక అతని మృతికి అసలు కారణం తెలుస్తుందని వెల్లడించారు.