PSLV-C60 Rocket: ఇస్రో మరో కీలక ప్రయోగానికి సిద్ధమైంది. ఇవాళ రాత్రి నింగిలోకి PSLV C60 రాకెట్‌ను ప్రయోగించేందుకు సర్వం సిద్ధం చేసింది. ఏపీలోని శ్రీహరికోట నుంచి ఈ రాకెట్ అంతరిక్షంలోకి దూసుకుపోనుంది. ఇప్పటికే కౌంట్‌డౌన్ కొనసాగుతోంది. రాత్రి 9 గంటల 58 నిమిషాలకు నింగిలోకి దూసుకుపోనుంది PSLV రాకెట్.
రాకెట్ నాలుగు దశలతోపాటు ఉపగ్రహాల అనుసంధాన పనులను ఇప్పటికే పూర్తి చేశారు ఇస్రో సైంటిస్టులు. ఈ ప్రయోగం ద్వారా స్పేస్ డాకింగ్‌కు చెందిన రెండు స్పేడెక్స్ శాటిలైట్లను స్పేస్‌లోకి పంపనున్నారు. ఎస్డీ ఎక్స్01 ఛేజర్, ఎస్డీ ఎక్స్02 టార్గెట్ అనే రెండు ఉపగ్రహాలు ఉన్నాయి. ఈ శాటిలైట్లు ఒక్కొక్కటి సుమారు 220 కిలోల బరువు ఉంటుందని ఇస్రో తెలిపింది. ఈ ఉపగ్రహాలను 470 కిలోమీటర్ల ఎత్తులో భూమి కక్ష్యలో ప్రవేశపెట్టనున్నారు. భవిష్యత్తులో నిర్వహించే చంద్రయాన్-4లో భారత్ స్పేస్ స్టేషన్ నిర్మాణానికి అవసరమైన డాకింగ్ టెక్నాలజీని పరీక్షించేందుకు ఈ ప్రయోగం ఉపయోగపడనుంది.
ఇస్రోకి డాకింగ్ మిషన్ చాలా ముఖ్యమనే చెప్పాలి. ఇప్పటి వరకు ఈ టెక్నాలజీ కేవలం అమెరికా, రష్యా, చైనా వద్ద మాత్రమే ఉంది. ఇప్పుడీ ప్రయోగం సక్సెస్ అయితే ఆ దేశాల సరసన నిలబడనుంది ఇండియా. అంతేకాదు స్పేస్‌లో సొంత స్పేస్ స్టేషన్ ఏర్పాటు చేయడానికి ఈ డాకింగ్ మిషన్ తొలి అడుగు అనే చెప్పాలి. ఎందుకంటే ఒకేసారి కావాల్సిన విడిభాగాలను తీసుకెళ్లలేం కాబట్టి.. ఈ డాకింగ్ వ్యవస్థ విజయవంతమవడం ముఖ్యమనే చెప్పాలి.
భూమికి 470 కిలోమీటర్ల దూరంలోని కక్ష్యలో వాటిని విడివిడిగా ప్రవేశపెట్టిన తర్వాత అసలు ప్రయోగం మొదలవుతుంది. ప్రయోగించే రెండు ఉపగ్రహాల్లోనూ డాకింగ్ యంత్రాంగం ఒకేలా ఉంటుంది. అందువల్ల టార్గెట్‌గా, ఛేజర్‌గా దేన్నైనా సెలెక్ట్ చేసుకోవచ్చు. రెండు శాటిలైట్ల మధ్య దూరం 20 కిలోమీటర్లకు చేరుకున్నాక.. వాటి మధ్య డ్రిఫ్ట్ ఆగిపోయేలా చూస్తారు. ఇందుకోసం రెండు ఉపగ్రహాల్లోని రాకెట్లను దానికి అనుగుణంగా మండిస్తారు.
Also Read: పోస్ట్ మాస్టర్ ను టార్గెట్ చేశారు.. ఏకంగా దోచేశారు!
ప్రయోగించిన ఐదో రోజు నుంచి రెండు ఉపగ్రహాలను దగ్గరకు తీసుకురావడం మొదలుపెడతారు. రెండు ఉపగ్రహాల మధ్య దూరం తగ్గుతూ పోతుంది. గంటకు 28 వేల కిలోమీటర్ల వేగంతో పయనించే ఈ శాటిలైట్లు పరస్పరం ఢీ కొట్టుకోకుండా కమ్యూనికేషన్ సాగించుకుంటూ పూర్తి సమన్వయంతో వ్యవహరిస్తాయి. తొలుత టార్గెట్ తన వేగాన్ని తగ్గించుకుంటుంది. తద్వారా ఛేజర్ ఉపగ్రహం దాన్ని అందుకోవడానికి సమాయత్తమవుతుంది. ఆ తర్వాత మెల్లగా ఛేజర్ డాకింగ్ వ్యవస్థ.. టార్గెట్ వ్యవస్థలోకి ప్రవేశిస్తుంది. రెండు డాకింగ్ పోర్టులు లాక్ అవడంతో ప్రయోగం పూర్తవుతుంది. డాకింగ్ అనంతరం రెండు ఉపగ్రహాల మధ్య ఎలక్ట్రిక్ సప్లైని చెక్ చేస్తారు సైంటిస్టులు.
డాకింగ్ పూర్తయి ప్రయోగాలు నిర్వహించిన అనంతరం మళ్లీ రెండు ఉపగ్రహాలు విడిపోతాయి. ఇలా అన్‌డాకింగ్ అయిన తర్వాత రెండేళ్ల పాటు సేవలు అందించనున్నాయి ఈ శాటిలైట్లు. అవసరమైతే మరోసారి వీటిని స్పేస్‌లో డాకింగ్ చేయవచ్చు. జనవరి 4 నుంచి 10 రోజుల పాటు డాకింగ్‌కు అనువైన సమయం అని అంచనా వేస్తున్నారు ఇస్రో సైంటిస్టులు.
పీఎస్‌ఎల్‌వీ సిరీస్‌లో ఇది 62వ ప్రయోగం. అలాగే పీఎస్‌ఎల్‌వీ కోర్ అలోన్ దశతో చేసే 18వ ప్రయోగమని ఇస్రో తెలిపింది. ఇప్పటికే పీఎస్‌ఎల్‌వీ సిరీస్‌లో 59 ప్రయోగాలను విజయవంతంగా నిర్వహించింది ఇస్రో. రెండో దశలో ద్రవ ఇంధనం, మూడో దశలో ఘన ఇంధనం, నాలుగో దశలో ద్రవ ఇంధనం మండించడంతో C60 ప్రయోగం చేయనున్నారు.
🌟 PSLV-C60/SPADEX Mission Update 🌟
Visualize SpaDeX in Action!
🎞️ Animation Alert:
Experience the marvel of in-space docking with this animation!🌐 Click here for more information: https://t.co/jQEnGi3ocF pic.twitter.com/djVUkqXWYS
— ISRO (@isro) December 27, 2024