Tirumala: తిరుమల మాడవీధులు గోవిందా నామస్మరణతో మారుమ్రోగుతున్నాయి. ఎటుచూసినా భక్తజనసందోహం తిరువీధులలో కనిపిస్తోంది. అలిపిరి నుండి గల కాలినడక దారి భక్తులతో నిండుగా కనిపిస్తోంది. శ్రీ శ్రీనివాసా శరణు.. శరణు అంటూ భక్తులు కలియుగ వైకుంఠం శ్రీ శ్రీనివాసుడి దర్శనం కోసం బారులు తీరుతున్నారు. దీనితో భక్తుల సేవలో తరించే టీటీడీ, ఎటువంటి అసౌకర్యం కలుగకుండా.. అన్ని చర్యలు చేపట్టింది. తెలుగు రాష్ట్రాల నుండే కాకుండా, దేశ విదేశాల నుండి స్వామి వారి దర్శనార్థం తిరుమలకు చేరుకుంటున్నారు.
ప్రస్తుతం శ్రీవారి సర్వదర్శనానికి 6 గంటల సమయం పడుతుందని టీటీడీ ప్రకటించింది. అలాగే సోమవారం స్వామి వారిని 84,950 మంది భక్తులు దర్శించుకోగా.. 21,098 మంది భక్తులు తలనీలాలు సమర్పించి తమ మొక్కులు చెల్లించుకున్నారు. అంతేకాదు స్వామి వారికి భక్తులు సమర్పించిన కానుకల ద్వారా రూ. 3.80 కోట్ల మేర ఆదాయం వచ్చినట్లు టీటీడీ అధికారులు తెలిపారు.
నేటి నుండి అధ్యయనోత్సవాలు..
తిరుమల శ్రీవారికి ఏడాది పూర్తి నిర్వహించే 450 పై చిలుకు ఉత్సవాలలో 25 రోజుల అత్యంత సుదీర్ఘమైన అధ్యయనోత్సవాలు ఈ ఏడాది డిసెంబరు 30 నుంచి 2025 జనవరి 23వ తేదీ వరకు తిరుమల ఆలయంలో ఘనంగా జరగనుంది. సాధారణంగా ధనుర్మాసంలో వైకుంఠ ఏకాదశికి 11 రోజులు ముందుగా శ్రీవారి సన్నిధిలో దివ్యప్రబంధ పాసుర పారాయణంగా పిలిచే ఈ అధ్యయనోత్సవాలు ప్రారంభమవుతాయి. ఈ సందర్భంగా స్వామివారి ప్రాశస్త్యంపై 12 మంది ఆళ్వార్లు రచించిన దివ్యప్రబంధ పాశురాలను శ్రీవైష్ణవ జీయంగార్లు గోష్ఠిగానం చేస్తారు.
Also Read: TTD News: కొత్త ఏడాదిలో తిరుమలకు వెళ్తున్నారా.. దర్శనంతో పాటు ఈ భాగ్యం కూడా పొందండి!
ఆళ్వార్ దివ్యప్రబంధంలోని 4 వేల పాశురాలను 25 రోజుల పాటు శ్రీవారి ఆలయంలోని రంగనాయకుల మండపంలో శ్రీవైష్ణవులు పారాయణం చేస్తారు. కాగా, తొలి 11 రోజులను పగల్‌పత్తు అని, మిగిలిన 10 రోజులను రాపత్తు అని వ్యవహరిస్తారు. 22వ రోజున కణ్ణినున్ శిరుత్తాంబు, 23వ రోజున రామానుజ నూట్రందాది, 24వ రోజున శ్రీవరాహస్వామివారి శాత్తుమోర, 25వ రోజున అధ్యయనోత్సవాలు పూర్తవుతాయి