Jio 5G vs Starlink: ఇంటర్నెట్ వినియోగం రోజురోజుకూ పెరుగుతోంది. వీడియోలు చూడటం, ఆన్‌లైన్ క్లాసులు, వర్క్ ఫ్రమ్ హోమ్, డిజిటల్ పేమెంట్స్.. ఇలా ప్రతీ పనికీ హైస్పీడ్ ఇంటర్నెట్ అవసరం అవుతోంది. ఈ నేపథ్యంలో భారత్‌లో జియో 5G లాంటి మొబైల్ నెట్‌వర్క్ సేవలు విస్తరిస్తుండగా, మరోవైపు ఎలాన్ మస్క్ కు చెందిన స్పేస్ ఎక్స్ సంస్థ స్టార్ లింక్ ద్వారా శాటిలైట్ ఇంటర్నెట్ అందిస్తోంది. మరి ఈ రెండింటి మధ్య అసలు తేడా ఏంటి? భారత్‌కు ఏ టెక్నాలజీ ఎక్కువ ఉపయోగపడుతుంది?
జియో 5G అనేది మొబైల్ టవర్స్, నెట్‌వర్క్ పరికరాల ద్వారా పనిచేసే ఐదో తరం వైర్ లెస్ టెక్నాలజీ. వినియోగదారుల ఫోన్లు సమీపంలోని 5G నెట్‌వర్క్ కు కనెక్ట్ అవుతాయి. దీంతో వేగంగా ఇంటర్నెట్ ఉపయోగించుకోవచ్చు. వీడియో స్ట్రీమింగ్, ఆన్‌లైన్ గేమింగ్, వీడియో కాల్స్, పెద్ద ఫైల్స్ డౌన్‌లోడ్ చేయడం లాంటి పనులకు 5G ఉపయోగపడుతుంది. అయితే, 5G స్పీడ్ అనేది ప్రాంతం, సిగ్నల్ క్వాలిటీ, నెట్ వర్క్ రద్దీ, ఫోన్ సామర్థ్యం మీద ఆధారపడి ఉంటుంది. 5G సేవలు అందుబాటులో లేని ప్రాంతాల్లో ఈ బెనిఫిట్ పొందడం కష్టంగా ఉంటుంది.
స్టార్‌లింక్ మాత్రం భూమికి దగ్గరగా తిరిగే శాటిలైట్ల సాయంతో ఇంటర్నెట్ అందిస్తుంది. ఇందుకోసం వినియోగదారుల ఇంటి దగ్గర ప్రత్యేక శాటిలైట్ డిష్, ఇతర పరికరాలు ఏర్పాటు చేయాల్సి ఉంటుంది. దీని ద్వారా మొబైల్ టవర్లు, ఫైబర్ కేబుల్స్ ఏర్పాటు చేయడం కష్టమైన మారుమూల ప్రాంతాలకు కూడా ఇంటర్నెట్ అందించే అవకాశం ఉంటుంది. కొండ ప్రాంతాలు, సముద్ర ప్రాంతాలు, గ్రామీణ ప్రాంతాల్లో కనెక్టివిటీ మెరుగుపరచడానికి ఇది ఉపయోగపడుతుంది. అయితే, స్టార్‌లింక్‌కు ప్రత్యేక పరికరాలు అవసరం. పరికరాల ధర, నెలవారీ ప్లాన్, మంచి సిగ్నల్ అందే పరిస్థితులు లాంటి అంశాలు సర్వీసుల వినియోగాన్ని ప్రభావితం చేస్తాయి.
జియో 5Gలో మొబైల్ నెట్‌వర్క్ కీలకం. స్టార్‌లింక్‌లో శాటిలైట్లు ప్రధాన పాత్ర పోషిస్తాయి. 5Gని ఉపయోగించడానికి అనుకూలమైన ఫోన్, నెట్‌వర్క్ కవరేజ్ అవసరం. స్టార్‌లింక్‌కు మాత్రం ప్రత్యేక రిసీవర్ పరికరాలు కావాలి. ఖర్చు విషయంలోనూ తేడా ఉంటుంది. మొబైల్ 5G సేవలు సాధారణంగా ఇప్పటికే ఉన్న ఫోన్, డేటా ప్లాన్‌తో ఉపయోగించవచ్చు. స్టార్‌లింక్‌లో ప్రత్యేక పరికరాల ఖర్చుతో పాటు సబ్‌స్క్రిప్షన్ ఛార్జీలు కూడా ఉంటాయి. సో, ఎవరి సర్వీస్ తక్కువ ధరకు ఉంటుందనేదాన్ని బట్టి వినియోగదారుల ఎంపిక ఉంటుంది.
భారత్‌లో నగరాలు, పట్టణాలు, ఇప్పటికే 5G కవరేజ్ ఉన్న ప్రాంతాల్లో జియో 5G వంటి మొబైల్ నెట్‌వర్క్‌లు రోజువారీ అవసరాలకు ఉపయోగకరంగా ఉంటాయి. మరోవైపు, సాధారణ నెట్‌వర్క్ సౌకర్యాలు తక్కువగా ఉన్న మారుమూల ప్రాంతాల్లో స్టార్‌లింక్ ఉపయోగపడే అవకాశం ఉంటుంది. అందుకే ఈ రెండింటిలో ఏది బెస్ట్ అని చెప్పడం కష్టం. రెండూ వేర్వేరు అవసరాలను తీర్చుతాయి.
భారత్‌లో ఇంటర్నెట్ అవసరాలు పెరుగుతున్న కొద్దీ 5G విస్తరణతో పాటు శాటిలైట్ కనెక్టివిటీకి కూడా ప్రాధాన్యం పెరగవచ్చు. అయితే, స్టార్‌లింక్ ఇండియాలోకి అడుగు పెడుతుందా? లేదంటే, ఇండియన్ కంపెనీలు ఆ సర్వీసులను అందిస్తాయా? అనేది చూడాలి.
Read Also: స్టార్‌లింక్ నిజంగా ప్రమాదకరమా? భారత్ ఎందుకు ఆచితూచి అడుగులు వేస్తోంది?