Pedal Washing Machine: అటు చదువు, ఇటు కుటుంబ బాధ్యతలు.. వీటితో పాటు రోజూ గంటల తరబడి ప్రయాణం. ఇలాంటి కష్టసమయంలోనే ఆ పదో తరగతి బాలిక మనస్సులో ఒక అద్భుతమైన ఆలోచన మెరిసింది. విద్యుత్ లేకపోయినా ఇంట్లో ఉండే సాధారణ సైకిల్ ను ఉపయోగించి దుస్తులను ఎలా సులువుగా ఉతకవచ్చో ప్రపంచానికి చాటి చెప్పింది. రూ.15 వేల నుంచి రూ.40 వేల వరకూ ఖర్చు అయ్యే వాషింగ్ మిషన్ ను కేవలం రూ.2000 ఖర్చుతో ఆవిష్కరించి అందరి చేత శభాష్ అనిపించుకుంటోంది. 2003 నాటి ఈ ఆవిష్కరణకు సంబంధించిన విశేషాలేంటో ఈ కథనంలో చూద్దాం.
కేరళకు చెందిన రెమ్యా.. పదో తరగతి చదువుతున్న సమయంలో ఆమె తల్లి తీవ్ర అనారోగ్యానికి గురయ్యారు. తండ్రి సైతం క్యాన్సర్ తో బాధపడుతుండటంతో ఇంటి పనులు చేసుకొని బస్సులో స్కూలుకు వెళ్లడం రెమ్యాకు చాలా కష్టమయ్యేది. మరి ముఖ్యంగా బట్టలు ఉతకడం ఆమెకు అత్యంత ఇబ్బందికరంగా మారేది. చేతులతో బట్టలు ఉతకడానికి గంటల సమయం వృథా అవుతుండటంతో దీనికి ఏదైనా ప్రత్యామ్నాయం ఆలోచించాలని రెమ్యా నిర్ణయించుకుంది.
ఈ క్రమంలోనే విద్యుత్‌తో నడిచే వాషింగ్ మిషన్ ఎలా పనిచేస్తుందో రెమ్యా గమనించింది. మోటారు సహాయంతో లోపలి డ్రమ్ తిరగడమే అక్కడ అసలు మ్యాజిక్ అని కనుగొంది. అసలు వాషింగ్ మిషన్ మోటార్ ను విద్యుత్ కాకుండా సైకిల్ పెడల్ తో ఎందుకు తిప్పకూడదని రెమ్యా భావించింది. ఆలోచన వచ్చిందే తడవుగా ఒక కాగితంపై దానికి సంబంధించిన సైకిల్ చైన్, గేర్లు, అల్యూమినియం బాక్స్, ఇనుప మెష్‌తో కూడిన డ్రమ్ నమూనాను స్కెచ్ వేసింది.
రెమ్యా వేసిన డ్రాయింగ్‌ను ఆమె తండ్రి సమీపంలోని ఒక ఆటోమొబైల్ వర్క్‌షాప్‌కు తీసుకెళ్లారు. అక్కడ ఉన్న మెకానిక్లకు రెమ్యా స్వయంగా తన ఆలోచనను వివరించింది. వారు తమ ఖాళీ సమయంలో ఈ పరికరాన్ని తయారు చేయడానికి ఒప్పుకున్నారు. చివరికి సైకిల్ సీటు, పెడల్స్, చైన్ మెకానిజంతో కూడిన ఒక వినూత్న ‘పెడల్ వాషింగ్ మిషన్’ తయారైంది
ఈ పెడల్ వాషింగ్ మిషన్ పనిచేసే విధానం చాలా సులభంగా ఉంది. ముందుగా అల్యూమినియం డ్రమ్‌లో బట్టలు, నీళ్లు, వాషింగ్ పౌడర్ వేసి 10 నిమిషాలు నానబెడతారు. ఆ తర్వాత కేవలం 3 నుంచి 4 నిమిషాలు పెడల్ తొక్కితే సరిపోతుంది. డ్రమ్ వేగంగా తిరిగి బట్టలు శుభ్రపడతాయి. మురికి నీటిని బయటకు పంపిన తర్వాత మళ్లీ నీళ్లు పోసి ఆరబెట్టడానికి (రైన్స్) కూడా ఇదే పద్ధతి వాడతారు. చివరగా నీళ్లు లేకుండా డ్రమ్‌ను వేగంగా తిప్పడం వల్ల ‘సెంటిఫ్యూజ్’ సూత్రం ఆధారంగా బట్టలు 80 శాతం వరకు ఆరిపోతాయి.
వాషింగ్ మిషన్ కొనే శక్తి లేనివారికి, విద్యుత్ సౌకర్యం అంతగా లేని మారుమూల గ్రామాలకు ఈ పెడల్ వాషింగ్ మిషన్ పర్ఫెక్ట్ గా సెట్ అవుతుందని రెమ్యా చెబుతోంది. అప్పట్లో కేవలం రూ. 2,000 నిర్మాణ వ్యయంతో తయారైన ఈ మిషన్ వల్ల.. బట్టలు శుభ్రపడటమే కాకుండా.. పెడల్ ను తొక్కడం వల్ల ఆరోగ్యకరమైన ప్రయోజనాలు కూడా లభించనున్నాయి. 15-20 నిమిషాల పాటు మంచి శారీరక వ్యాయమం లభిస్తుందని బాలిక వివరిస్తోంది.
అయితే మొదట్లో రెమ్యా ఆలోచనను ఆమె తండ్రి, తల్లి అంతగా నమ్మలేదు. చదువును పక్కనపెట్టి దీనిపై సమయం వృథా చేస్తోందేమోనని కంగారుపడ్డారు. కానీ మిషన్ పూర్తయి బ్రహ్మాండంగా పనిచేయడం చూశాక అందరూ ఆశ్చర్యపోయారు. స్థానికులు రెమ్యాను ఆప్యాయంగా ‘లిటిల్ సైంటిస్ట్’ అని పిలవడం ప్రారంభించారు.
Also Read: జియో దుమ్మురేపే ప్లాన్.. రూ.899 కే 90 రోజుల వ్యాలిడిటీ.. 5G డేటా, ఓటీటీ, ఫ్రీ కాల్స్!
కాగా నేషనల్ ఇన్నోవేషన్ ఫౌండేషన్ (NIF) రెమ్యా ఆవిష్కరణను గుర్తించి ‘వాషింగ్ కమ్ ఎక్సర్‌సైజ్ మెషిన్’ పేరిట పేటెంట్ నమోదు చేసింది. అనేక దినపత్రికలు, టీవీ ఛానెళ్లు ఆమె కథనాన్ని ప్రసారం చేశాయి. స్థానిక చర్చిలో బిషప్ చేతుల మీదుగా ఆమెకు సన్మానం జరగడమే కాకుండా ఢిల్లీకి చెందిన ఓ ఇంజనీర్ ఈ నమూనాను మరింత మెరుగుపరచడానికి ముందుకొచ్చారు. కష్టాలను సాకుగా చూపకుండా ఒక చిన్న ఆలోచనతో నిత్య జీవిత సమస్యకు పరిష్కారం చూపిన రెమ్యా కథ అందరికీ స్ఫూర్తిదాయకమని నిపుణులు ప్రశంసిస్తున్నారు.
Also Read: Airtel గేమ్ ఛేంజింగ్ ప్లాన్.. అపరిమిత 5G, 18కి పైగా ఓటీటీలు, ఫ్రీ కాల్స్.. 84 రోజులు పండగే!