Chameleon: ఊసరవెల్లి అనగానే మనకు గుర్తుకు వచ్చేది దాని రంగురంగుల రూపం. తొండ అభివృద్ధి చెంది ఊసరవెల్లిగా మారుతుంది అని పెద్దలు అంటారు. ఇది ఎంతవరకు నిజం అనేది తెలియకపోయినా రంగులు మార్చడం అనేది మాత్రం ఇంట్రెస్టింగ్ కాన్సెప్ట్ అనే చెప్పాలి. ఊసరవెల్లి రంగులు మార్చడం మనం చాలా సినిమాల్లో, వీడియోలలో చూసే ఉంటాం. అయితే ఊసరవెల్లి రంగులు ఎలా మార్చగలుగుతుంది అనే సందేహం మనలో చాలా మందికి చాలా సార్లు వచ్చే ఉంటుంది. దానికి రకరకాల కారణాలు ఉన్నాయి. అవేంటో ఈ ఆర్టికల్‌లో తెలుసుకుందాం.
ఊసరవెల్లి రంగులు మార్చడం అనేది ప్రపంచవ్యాప్తంగా శాస్త్రవేత్తలను, పరిశోధకులను ఆకర్షించే ఒక అద్భుతమైన సహజ లక్షణం. దీనివెనుక అనేక కారణాలున్నా దాని జీవనశైలి, పర్యావరణం, జీవక్రియ ముఖ్యమైనవని సైంటిస్టులు అంటున్నారు.
పర్యావరణ అనుకూలత
ఇది చర్మంలో వివిధ రంగుల వర్ణద్రవ్యాలను కలిగి ఉంటుంది. చర్మ ఉపరితలంపై వ్యాపించిన కణాలైన క్రోమాటోఫోర్ ల ద్వారా రంగులు మార్చగలదు. ఈ లక్షణం ఊసరవెల్లి తనని తాను శత్రువుల నుండి రక్షించుకుని ఆహారం కోసం వేటాడే సమయంలో దాగుడు మూతలు ఆడడానికి సహాయపడుతుంది. ఉదాహరణకు ఆకుపచ్చ చెట్టుమీద ఉన్నప్పుడు ఆకుపచ్చ రంగులోకి, గోధుమరంగు కొమ్మపై ఉన్నప్పుడు గోధుమ రంగులోకి మారిపోతూ ఉంటుంది.
ఉష్ణోగ్రత నియంత్రణ
ఊసరవెల్లి ఇలా రంగును మార్చడం ద్వారా దాని బాడీ టెంపరేచర్ ను కంట్రోల్ చేసుకుంటుంది. అంటే ఎండలో ఉన్నప్పుడు సూర్యరశ్మిని గ్రహించడానికి ముదురు రంగులోకి, చల్లగా కావాలి అనుకున్నప్పుడు లేతరంగుల్లోకి మారుతుంది.
భావోద్వేగాలు, సామాజిక సంకేతాలు
ఇది దానిలోని భావోద్వేగాలకు తగ్గట్టుగా దాని రంగులను మారుస్తుంది. అంటే అది మార్చే రంగుల ద్వారా దానిలోని భావోద్వేగాలను తెలియజేస్తుంది. ఉదాహరణకు, భయం, ఒత్తిడి, ఆకర్షణ సమయంలో రంగులు మారుతూ ఉంటాయి. ఒక మగ ఊసరవెల్లి ఆడ ఊసరవెల్లిని ఆకర్షించడానికి, ఇతర మగ ఊసరవెల్లితో పోటీ పడే సమయంలో గానీ, శత్రువులను భయపెట్టడానికి ప్రకాశవంతమైన రంగులలోకి మారుతుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.
లైట్, ఇమేజ్ సిగ్నల్స్
ఊసరవెల్లిలో ఇరిడోసైట్ అనే కాంతిని ప్రతిబింబించే సెల్స్ ఉంటాయి. ఈ సెల్స్ ఊసరవెల్లి మార్చే రంగులను మరింత ప్రకాశంగా కనిపించేలా చేస్థాయి. దాని శరీరంలోని హార్మోన్లు, నర్వస్ సిస్టం ముఖ్య పాత్ర పోషించే ఈ ప్రాసెస్ ఒక రకమైన బయోకెమికల్ ప్రాసెస్ అని సైంటిస్టులు చెబుతున్నారు.
ఊసరవెల్లి రంగు మార్పు పర్యావరణ అనుకూలత, ఉష్ణోగ్రత నియంత్రణ, భావోద్వేగ వ్యక్తీకరణ సామాజిక సంకేతాలు కలగలిసిన ఒక అద్భుతమైన లక్షణం. ఈ లక్షణం ఊసరవెల్లిని ప్రకృతిలో ఒక అద్భుతమైన విశిష్ఠత కలిగిన జీవిగా చేస్తుంది.