Laptop lifespan: ఇంటి పనులైనా, ఆఫీస్ వర్క్ లేదా స్టడీస్ అయినా ఈ రోజుల్లో ల్యాప్ టాప్ ప్రతి ఒక్కరి జీవితంలో ఒక ముఖ్యమైన భాగమైపోయింది. అయితే.. వేల రూపాయలు వెచ్చించి కొన్న ల్యాప్ టాప్ ఎన్ని సంవత్సరాలు పాడవకుండా ఉంటుంది? దీనికి ఏదైనా ఎక్స్పైరీ డేట్ ఉంటుందా? అనే డౌట్ చాలా మందికి వస్తుంది. కొద్ది రోజులు గడిచేసరికి.. ల్యాప్‌టాప్ స్లో అవ్వడం, బ్యాటరీ డ్రైన్ అవ్వడం జరుగుతుంటుంది. అసలు ల్యాప్‌టాప్ జీవితకాలం ఎంత? ఎప్పుడు కొత్తది మార్చాలో ఇప్పుడు చూద్దాం.
మనం కొనే ప్రతి ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్‌కూ ఒక నిర్దిష్టమైన ఆయుష్షు ఉంటుంది. ల్యాప్ టాప్‌ల విషయంలోనూ ఇదే సూత్రం వర్తిస్తుంది. అయితే వీటికి ప్యాకెట్‌పై రాసినట్లు స్పష్టమైన ‘గడువు తేదీ’ ఉండదు కానీ, వాటి హార్డ్‌వేర్ , సాఫ్ట్‌వేర్ పని తీరు ఆధారంగా వాటి జీవిత కాలం ఆధారపడి ఉంటుంది. సాధారణంగా ఒక మంచి నాణ్యత గల ల్యాప్‌టాప్ సగటున 3 నుంచి 6 సంవత్సరాల వరకు ఎలాంటి పెద్ద సమస్యలు లేకుండా పని చేస్తుంది. అయితే మీరు దానిని ఎలా వాడుతున్నారు, ఎలాంటి మెయింటెనెన్స్ చేస్తున్నారనే దానిపై ఇది ఆధారపడి ఉంటుంది.
సాఫ్ట్‌వేర్ అప్‌డేట్స్: కాలం మారుతున్న కొద్దీ విండోస్ లేదా మాకోస్ అప్‌డేట్‌లు హెవీగా మారుతుంటాయి. పాత హార్డ్‌వేర్ ఉన్న ల్యాప్‌టాప్‌లు ఈ కొత్త అప్‌డేట్‌లను మోయలేక స్లో అయిపోతాయి.
బ్యాటరీ క్షీణత: ల్యాప్‌టాప్ బ్యాటరీకి ఒక నిర్దిష్టమైన ఛార్జింగ్ సైకిల్స్ ఉంటాయి. 3-4 ఏళ్లు గడిచేసరికి బ్యాటరీ బ్యాకప్ పడిపోతుంది.
వేడెక్కడం: లోపల ఫ్యాన్లలో ధూళి పేరుకుపోవడం వల్ల ల్యాప్ టాప్ త్వరగా వేడెక్కి మదర్‌బోర్డ్ దెబ్బతినే అవకాశం ఉంది.
ల్యాప్‌టాప్ మార్చాల్సిన సమయం వచ్చిందని తెలిపే సంకేతాలు:
విపరీతంగా హ్యాంగ్ అవ్వడం: సాధారణ బ్రౌజింగ్ లేదా చిన్న సాఫ్ట్‌వేర్ ఓపెన్ చేయడానికి కూడా ల్యాప్‌టాప్ చాలా సమయం తీసుకుంటే.. అది మార్చాల్సిన సమయం వచ్చిందని అర్థం.
రిపేర్ ఖర్చు : పదే పదే హార్డ్‌వేర్ సమస్యలు వచ్చి, రిపేర్ చేయించుకోవడానికి ల్యాప్‌టాప్ అసలు ధరలో సగం ఖర్చు అవుతుంటే.. కొత్తది కొనడమే మంచిది.
బ్యాటరీ: ఛార్జర్ పెడితేనే.. ల్యాప్‌టాప్ ఆన్ అయ్యే పరిస్థితి వచ్చి, కొత్త బ్యాటరీ మార్చినా సమస్య తీరకపోతే అప్‌గ్రేడ్ అవ్వడం బెటర్.
Also Read: ల్యాప్‌టాప్‌తో ఫోన్ ఛార్జ్ చేస్తున్నారా ? అసలు విషయం తెలిస్తే..ఎప్పటికీ అలా చేయరు
SSD కి అప్‌గ్రేడ్ : మీ పాత ల్యాప్‌టాప్‌లో హార్డ్ డిస్క్ ఉంటే.. దానిని ఎస్‌ఎస్‌డీకి మార్చండి. ఇది ల్యాప్‌టాప్ వేగాన్ని ఊహించని విధంగా పెంచుతుంది.
క్లీన్: ప్రతి 6 నెలలకొకసారి సర్వీస్ సెంటర్‌కు తీసుకెళ్లి లోపలి డస్ట్ క్లీన్ చేయించి, థర్మల్ పేస్ట్ మారుస్తుంటే.. ల్యాప్‌టాప్ వేడెక్కదు.
ధరలు: ఒకవేళ మీరు కొత్త ల్యాప్‌టాప్ కొనాలనుకుంటే.. బేసిక్ ఆఫీస్ వర్క్ కోసం రూ. 35,000 నుంచి రూ. 50,000 లోపు మంచి ఆప్షన్లు లభిస్తాయి. గేమింగ్ లేదా హెవీ ఎడిటింగ్ కోసం అయితే రూ. 70,000 పైనే ఖర్చు చేయాల్సి ఉంటుంది.
ల్యాప్‌టాప్ తరచుగా ఇబ్బంది పెడుతుంటే అంతే కాకుండా మీ పనులకు అడ్డు వస్తుంటే.. దానిని మార్చడమే సరైన నిర్ణయం. చిన్న చిన్న ట్రిక్స్‌తో దాని లైఫ్‌ను కొద్ది రోజులు పొడిగించవచ్చు, 5 ఏళ్ళు దాటిన తర్వాత కొత్త టెక్నాలజీకి అప్‌గ్రేడ్ అవ్వడం ఎప్పుడైనా మంచిదే.