China Dam: మనం ఈ రోజు భూమిపై జీవించగలుగుతున్నామంటే కారణం.. భూమి తన చుట్టూ తాను తిరుగుతూ.. సూర్యడిని చుట్టూ భ్రమించడం వల్లే. ఇది సహజసిద్ధంగా జరిగే ప్రక్రియ. ఇందులో ఏ మాత్రం పొరపాటు జరిగినా.. ఫలితం ఊహించని విధంగా ఉంటుంది. భవిష్యత్తులో దారుణమైన పరిస్థితులు ఎదుర్కోవల్సి వస్తుంది. అయితే, ఆ పొరపాటుకు మన పొరుగు దేశం చైనాయే కారణం కానుందా? ఈ ప్రశ్నకు ఔననే సమాధానం వస్తోంది. తాజాగా NASA పరిశోధనలు కూడా ఇవే చెబుతున్నాయి. చైనా నిర్మిస్తున్న త్రీ జార్జెస్ డ్యామ్ (Three Gorges Dam) వల్ల భూభ్రమణం (భూమి తిరగడం) నెమ్మదిస్తుందని నాసా పేర్కొంది. ఆ డ్యామ్ వల్ల భూమి తిరిగే వేగం 0.06 మైక్రోసెకన్లకు తగ్గుతుందని వెల్లడించింది. అయితే, ఈ నెంబర్ మనకు చిన్నగానే అనిపించవచ్చు. అదే.. భవిష్యత్తుల్లో పెద్ద ముప్పుగా పరిగణించవచ్చు.
చైనా నిర్మిస్తున్న ఈ డ్యామ్ ప్రత్యేకత ఏమిటీ?
ప్రపంచంలో ఇప్పటివరకు ఏ దేశంలో లేనిస్థాయిలో చైనా త్రీగోర్జెస్ డ్యా్మ్‌ను నిర్మిస్తోంది. సుమారు రెండు కిలోమీటర్లు విస్తరించిన ఈ డ్యామ్‌ను యాంగ్జీ నదికి 185 మీటర్ల ఎత్తులో ఉంది. ఇందులో 40 బిలియన్ క్యూబిక్ మీటర్ల నీరు నిల్వ ఉంటుంది. ఈ డ్యామ్ ద్వారా 22,500 మెగావాట్ల విద్యుత్తును ఉత్పత్తి చేస్తున్నారు. అయితే, చైనాలో నీటి సమస్యలను తీర్చేందుకు, విద్యుత్తు అవసరాలకు ఈ డ్యామ్ అవసరమే. కానీ, ఇది పర్యావరణానికి ప్రమాదకరంగా మారడమే కలచివేసే అంశం. ఈ డ్యామ్ వల్ల ఇప్పుడు ప్రపంచం మొత్తం ప్రమాదంలో పడినట్లు నివేదికలు చెబుతున్నాయి. ఇప్పటికే పర్యావరణవేత్తలు దీనిపై ఆందోళన వ్యక్తం చేశారు. నాసా కూడా దీన్ని బలపరుస్తూ ఒక తాజా నివేదికను బయటపెట్టింది.
ఒక్క డ్యామ్.. మొత్తం భూభ్రమణాన్నే మార్చేస్తుందా?
భూభ్రమణం మన భూమి ద్రవ్యరాశిపై ఆధారపడి ఉంటుంది. అది సమానంగా ఉన్నప్పుడే ఎలాంటి ఆటంకాలు లేకుండా భూమి నిర్దేశిత వేగంతో తిరగగలుగుతుంది. అయితే, చైనా నిర్మించిన ఆ డ్యామ్ వల్ల ద్రవ్యరాశిపై ఊహించని స్థాయిలో ప్రభావం పడుతోంది. పరిశోధనల ప్రకారం భూమి ఒక రోజులో 0.06 మైక్రోసెకన్ల ఆలస్యంగా భ్రమిస్తున్నట్లు తెలిసింది. ఈ సంఖ్య తక్కువే కదా అని అనుకోవద్దు. అది భూభ్రమణ వేగాన్ని మందగించేలా చేసి ఎన్నో విపత్తులకు కారణమవుతుంది. భూమి జడత్వం (భూమిపై కలిగే ఒత్తిడి) భ్రమణ సామర్థ్యంపై ప్రభావం చూపుతుంది. ఉదాహరణకు.. నీరు ప్రవహిస్తూ ఉంటే భూమిపై ఎలాంటి భారమూ ఉండదు. అలా ప్రవహించే నీటికి అడ్డుకట్ట వేసి భారీ మొత్తం నిల్వ ఉంచితే.. ఆ ప్రాంతంలో బరువు ఏర్పడుతుంది.
నీటి భారమంతా ఒకేవైపుకు..
బంతి గుండ్రంగా ఉన్నప్పుడు సమంగా ద్రవ్యరాశి పంపిణీ జరుగుతుంది. దానికి మీరు ఒక బబుల్ గమ్ అంటించండి లేదా మేకు దిగ్గొట్టి చూడండి. బరువంతా అటువైపుకే వెళ్లి దాని భ్రమణం మారిపోతుంది. అంటే బబుల్ గమ్ లేదా ఆ మేకును మనం చైనా డ్యామ్‌లోని నీటి సాంద్రతగా భావించాలి. బంతిలో వచ్చిన మార్పును ఆ డ్యామ్ వల్ల భూభ్రమణంలో కలిగే మార్పుగా చూడాలి. కొన్ని బిలియన్ల నీటిని ఒకే చోట నిల్వ ఉంచడం వల్ల ఆ ప్రాంతంలో బరువు పెరుగుతుంది. అయితే, చిన్న చిన్న డ్యామ్‌లకు ఇలాంటి సమస్య ఉండదు. కానీ, చైనాలో కట్టింది అత్యంత భారీ మెగా డ్యామ్. అదే ఇప్పుడు సమస్య. దానివల్ల భూమి సమతుల్యత మారిపోయింది. వేగంగా లేదా నెమ్మదిగా తిరిగే అవకాశం ఉంటుంది. తాజా పరిశోధనల ప్రకారమైతే.. భూమిని నెమ్మదిగా తిరిగేలా చేస్తోంది. అలాగే భూమి అక్షంలో కూడా వంపుకు కారణమవుతున్నట్లు కనుగొన్నారు. అలాగే సముద్ర మట్టాల్లో మార్పులు కూడా ఏర్పడవచ్చనే ఆందోళన నెలకొంది.
ఉదాహరణకు 2004లో సముద్రంలో ఏర్పడి భారీ భూకంపం, సునామీల వల్ల భూమి ఉత్తర ద్రువం 2.5 సెంటీమీటర్లు కదిలింది. అయితే, ఇది సహజంగా ఏర్పడింది. కానీ, చైనా డ్యామ్ అలా కాదు.. మానప్రేరిత శక్తి. ప్రకృతితో పెట్టుకుంటే విధ్వంసమే. ఆ విధ్వంసం ఫలితం ఎలా ఉంటుందో ఇప్పుడు చూద్దాం.
భూమి తిరగడం నెమ్మదిస్తే ఏమవుతుంది?
మనమంతా భూమిని ఆధారంగా చేసుకుని బతుకుతున్నాం. దానిపై ప్రతి మార్పు మన జీవితంపై ప్రభావం చూపుతుంది. ముఖ్యంగా భూభ్రమణం మందగిస్తే.. ఎన్నో విపరీత పరిణామాలు చూడాల్సి వస్తుంది. పగలు, రాత్రిళ్లలో విపరీతమైన మార్పులు జరగవచ్చు. వాటి సమయం పెరగవచ్చు లేదా తగ్గవచ్చు. అలాగే సముద్రాలు, వాయువులు.. సైతం భూగమనంపై ప్రభావం చూపుతాయి. దానివల్ల వాతావరణ మార్పులు కూడా చూడవచ్చు. ఇప్పటికే గ్లోబల్ వార్మింగ్ వల్ల ఎన్నో మార్పులు చూస్తున్నాం. కొత్తగా ఇది కూడా తోడైతే.. విపత్కర పరిస్థితులను ఎదుర్కోవలసి వస్తుంది. అలాగే భూభ్రమణం మందగించడం వల్ల మరో ఊహించని విపత్తు కూడా చోటుచేసుకోవచ్చనే వాదనలు ఉన్నాయి. ప్రపంచంలోని మహా సముద్రం.. రెండు సముద్రాలుగా విడిపోతుందట. మనకు నైరుతి దిశలో ఉన్న కిరిబిటీ దీవులు (ఈ దీవులను గ్లోబల్ డివైడ్ లైన్‌గా పరిగణిస్తున్నారు) వద్ద సముద్రంగా రెండుగా విడిపోతుందట.
ఇప్పటికే నెమ్మదించిన భూమి.. అప్పట్లో రోజుకు 18.41 గంటలే..
భూమి పుట్టినప్పటి నుంచి అనేక మార్పులు జరుగుతూనే ఉన్నాయి. ప్రస్తుతం మనం 24 గంటలకు ఒక రోజుగా పరిగణిస్తున్నాం. అయితే.. 1.4 బిలియన్ సంవత్సరాల కిందట భూమిపై ఒక రోజు 18 గంటల 41 నిమిషాలు ఉండేదట. అలాగే డైనోసార్ల యుగంలో 23 గంటలకు పెరిగిందట. అంటే భూభ్రమణం ఎంత నెమ్మదించిందో అర్థం చేసుకోవచ్చు. కాలంలో వచ్చిన మార్పుల వల్లే మనం లీపు సంవత్సరాన్ని పాటిస్తున్నాం. ప్రతి నాలుగేళ్లకు ఒకసారి లీప్ ఇయర్ వస్తుందనే సంగతి తెలిసిందే. ఎందుకంటే.. ఏడాదికి 365 రోజులు ఉంటాయి. కానీ, భూమి.. సూర్యుడి చుట్టూ తిరగడానికి పట్టే సమయం 365.2422 రోజులు. ఆ సమయాన్ని కవర్ చేయడం కోసమే మనం నాలుగేళ్లకు ఒకసారి లీపు సంవత్సరాన్ని పాటిస్తున్నాం. ఫిబ్రవరి 29 అదనంగా వస్తుంది. భూభ్రమణంలో జరిగే మార్పులను బట్టి లీప్ సెకన్స్‌ను కూడా మారుస్తారు. 2029 లేదా 2029లో ఈ మార్పు జరగవచ్చు. భూమి నెమ్మదిగా తిరిగితే భవిష్యత్తులో లీప్ సంవత్సరం అవసరం కూడా ఉండకపోవచ్చట.
Also Read: ఓ వైపు కాల్చేస్తున్న కార్చిచ్చు.. మరోవైపు రక్తం గడ్డకట్టే చలి.. కారణాలేంటి..