UPI Vyapaar Saksham Scheme: చిన్న వ్యాపారులకు డిజిటల్ చెల్లింపులను మరింత చేరువ చేసేందుకు నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (NPCI) ఒక కొత్త పథకాన్ని తీసుకురాబోతోంది. ‘యూపీఐ వ్యాపార్ సక్షమ్’ (UPI Vyapaar Saksham) పేరుతో త్వరలోనే ఈ స్కీమ్ అందుబాటులోకి రానుంది. ముఖ్యంగా చిన్న పట్టణాలు, మారుమూల ప్రాంతాల్లోని చిరు వ్యాపారులను ప్రోత్సహించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. మర్చంట్ పేమెంట్లపై త్వరలో ఛార్జీలు వసూలు చేయనున్న నేపథ్యంలో.. చిన్న దుకాణదారులకు భారం పడకుండా ఈ ఇన్సెంటివ్ పథకాన్ని NPCI ప్లాన్ చేసింది.
ఈ పథకం ప్రధానంగా టైర్-3 నుండి టైర్-6 నగరాలు, ఈశాన్య రాష్ట్రాలు, జమ్మూ కాశ్మీర్, లడఖ్ వంటి ప్రాంతాల్లోని వ్యాపారులపై దృష్టి పెట్టింది. ఏడాదికి రూ.40 లక్షల లోపు టర్నోవర్ ఉన్న చిన్న వ్యాపారులందరూ ఈ ప్రోత్సాహకాలకు అర్హులు. మర్చంట్ డిస్కౌంట్ రేట్ (MDR) ఛార్జీలు అమల్లోకి వచ్చినప్పటి నుండి మూడేళ్ల పాటు ఈ పథకం కొనసాగుతుంది.
కొత్తగా యూపీఐ సేవలు ప్రారంభించే వ్యాపారి షాపులో క్యూఆర్ (QR) కోడ్ ఏర్పాటు చేస్తే రూ.300 ప్రోత్సాహకం లభిస్తుంది. అంతేకాకుండా.. పేమెంట్ వివరాలు చెప్పే సౌండ్ బాక్స్ ఇన్‌స్టాల్ చేసుకుంటే అదనంగా మరో రూ.750 ఇన్సెంటివ్ ఇస్తారు. దీనివల్ల వ్యాపారులపై ఎలాంటి అదనపు ఆర్థిక భారం పడకుండా డిజిటల్ పరికరాలు అందుబాటులోకి వస్తాయి.
Also Read: గోల్డెన్ ఛాన్స్.. రూ.11,000 లోపే 40 ఇంచుల స్మార్ట్ టీవీ.. బ్యాంక్ డిస్కౌంట్లతో మరింత తగ్గింపు!
వ్యాపారులు చేసే అర్హత గల లావాదేవీల మొత్తం విలువపై 0.03 శాతం ఇన్సెంటివ్‌గా ఇస్తారు. ఒకవేళ వ్యాపారి వెనుకబడిన లేదా ఎంపిక చేసిన ప్రాంతాల్లో ఉంటే.. ఈ బేస్ రేటుపై అదనంగా 50 శాతం బోనస్ లభిస్తుంది. అయితే, గత త్రైమాసికంతో పోలిస్తే ప్రస్తుత త్రైమాసికంలో వ్యాపారి లావాదేవీల విలువ పెరిగి ఉండాలి.
వసూలు చేసే MDR ఛార్జీలలో 5 శాతాన్ని ఈ స్కీమ్ కోసం కేటాయిస్తారు. ఇందులో 30 శాతం కొత్త వ్యాపారులను చేర్చడానికి, 50 శాతం లావాదేవీల సంఖ్యను పెంచడానికి, మిగిలిన 20 శాతం లావాదేవీల విలువ పెరుగుదలకు ఉపయోగిస్తారు. ఈ పథకం ద్వారా ఏటా రూ.60 లక్షల నుండి కోటి రూపాయల కొత్త క్యూఆర్ కోడ్‌లు, రూ.5 లక్షల నుండి రూ.10 లక్షల కొత్త సౌండ్ బాక్స్‌లను ఏర్పాటు చేయాలని NPCI లక్ష్యంగా పెట్టుకుంది.
Also Read: ఇంకా పాత గీజరే వాడుతున్నారా? ఈ 5 సంకేతాలు కనిపిస్తే అలర్ట్ అవ్వండి, లేదంటే ప్రమాదం తప్పదు!