Sci Fi Horror Thriller: హారర్ సినిమాల్లో దెయ్యాలు, రాక్షసుల కంటే మన చుట్టూ ఉండే చిన్న జీవులే ఒక్కోసారి భయంకరమైన విలన్లుగా మారిపోతుంటాయి. రీసెంట్ గా విషపూరితమైన సాలెపురుగులతో తెరకెక్కిన ఒక గ్రిప్పింగ్ సై-ఫై హారర్ థ్రిల్లర్ ఓటీటీలో వణుకు పుట్టిస్తోంది. సాలెపురుగులు ఒక అపార్ట్‌మెంట్ మొత్తాన్ని ఆక్రమించి, అందులోని మనుషుల ప్రాణాల మీదకు వస్తే, బయటకు వెళ్లే దారి లేకుండా అధికారులు భవనాన్ని సీల్ చేస్తే అక్కడ చిక్కుకున్న వారి పరిస్థితి ఏంటనే భయంకరమైన కాన్సెప్ట్‌తో ‘క్రాలర్స్’ (Crawlers) మూవీ సీట్ ఎడ్జ్ కు తీసుకెళ్తోంది. 2026 అక్టోబర్ 16న థియేటర్లలో విడుదలైన ఈ చిత్రం నెల తిరక్కుండానే ఓటీటీ ఆడియన్స్ కు కూడా వణుకు తెప్పిస్తోంది. ఈ సాలెపురుగుల కథ ఏంటి ? ఏ ఓటీటీలో చూడవచ్చు ? అనే వివరాలను తెలుసుకుందాం పదండి.
ఈ సినిమా కథ లాస్ ఏంజిల్స్‌లోని ‘పారడిసో పామ్స్’ అనే ఒక అపార్ట్‌మెంట్ కాంప్లెక్స్‌లో ప్రారంభమవుతుంది. విదేశీ పర్యటన నుండి తిరిగి వచ్చిన ఒక ప్రొఫెసర్ భుజంపై ఉన్న గాయం పగిలి, అందులో నుండి కొత్త జాతికి చెందిన అత్యంత విషపూరితమైన సాలెపురుగులు బయటకు వస్తాయి. ఆ ప్రొఫెసర్ మరణించిన తర్వాత, ఆ సాలెపురుగులు ఎయిర్ డక్ట్‌ల ద్వారా అపార్ట్‌మెంట్ భవనం మొత్తం వేగంగా వ్యాపిస్తాయి.
లోపల ఏదో తెలియని ప్రాణాంతక వైరస్ ప్రబలిందని భావించిన పోలీసులు, భవనాన్ని పూర్తిగా సీల్ చేసి క్వారంటైన్ విధిస్తారు. బయటకు వెళ్లే దారి లేక లోపల చిక్కుకుపోయిన నివాసితులపై ఆ విషపూరిత సాలెపురుగులు దాడి చేయడం మొదలుపెడతాయి. ఈ విపత్కర పరిస్థితుల్లో, బిల్డింగ్ మేనేజర్ అయిన సెరీనా తనకున్న భవనం గురించిన పూర్తి అవగాహనతో నివాసితులను రక్షించడానికి ప్రాణాలకు తెగించి పోరాడుతుంది.
చివరికి లోపల ఉన్న సాలెపురుగులను పూర్తిగా అంతం చేయడానికి అధికారులు భవనంలో విషవాయువును వదలాలని నిర్ణయిస్తారు. ఆ సమయంలో సెరీనా ఆ సాలెపురుగుల రాణిని చంపి, అపార్ట్‌మెంట్‌లో చిక్కుకున్న వాళ్ళను కాపాడటానికి సాయశక్తులా ప్రయత్నిస్తుంది. చివరికి ఆమె ప్రయత్నం ఫలిస్తుందా ? వాటి చేతిలో అందరూ చనిపోతారా ? భవనంలో విషవాయువును అధికారులు వాడులుతారా ? ఇంతకీ సాలెపురుగులు అక్కడికి ఎలా వచ్చాయి ? అనే విషయాలను మాత్రం ఈ మూవీని చూసి తెలుసుకోవాల్సిందే.
Crawlers (2026) సినిమా 2026 అక్టోబర్ 16న థియేటర్లలో విడుదలైంది. ఇది 2026 నవంబర్ 13 నుండి Lionsgate Play ఓటీటీ ప్లాట్‌ఫారమ్‌లో స్ట్రీమింగ్ అవుతోంది. ఇది Amazon Prime Videoలో అద్దెకు (Rent) తీసుకునే సదుపాయం కూడా ఉంది. ఏంజెల్ గోమెజ్ హెర్నాండెజ్ దర్శకత్వం వహించిన ఈ హారర్-థ్రిల్లర్ చిత్రంలో మాటిల్డా లుట్జ్ ప్రధాన పాత్ర అయిన బిల్డింగ్ మేనేజర్ ‘సెరీనా’గా నటించారు. ఆమెతో పాటు గ్రెగ్ సుల్కిన్ (బ్రాడ్లీ), మెలీనా మాథ్యూస్ (లేడీ లాష్), విలియం మిల్లర్ (మిస్టర్ రాస్మోర్), గ్యారీ ఆంథోనీ స్టెన్నెట్, ఎలెనా సాన్జ్ ఇతర ముఖ్య పాత్రల్లో కనిపించారు. సుమారు 80 నిమిషాల నిడివి ఉన్న ఈ ఇంగ్లీష్ హారర్ థ్రిల్లర్ ప్రస్తుతం ఒరిజినల్ ఇంగ్లీష్ ఆడియోతో పాటు హిందీ, తెలుగు ఆడియో వెర్షన్లు కూడా అందుబాటులో ఉన్నాయి.