Etela Rajender: కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి లక్ష్యంగా బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్ తీవ్ర స్థాయిలో నిప్పులు చెరిగారు. శనివారం బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో కాంగ్రెస్ పార్టీని, రేవంత్ సర్కార్ పాలనను ఎండగట్టారు. ప్రతిపక్ష నేతగా ఉన్న రాహుల్ గాంధీ వ్యవహారశైలి, ఆయన వాడుతున్న భాష ఆ పదవికి తగినట్లుగా లేదన్నారు. దేశ ప్రతిష్టను దిగజార్చేలా మాట్లాడుతున్నారని, రాజ్యాంగ సంస్థలను అపహాస్యం చేయడంతో పాటు దేశ రక్షణ కోసం పోరాడే సైనికులను సైతం అవమానించే స్థాయికి దిగజారారని ఆయన ఆరోపించారు.
గాంధీ కుటుంబానికి ప్రజలు ఎన్నో పదవులు కట్టబెడితే.. ఇవాళ రాహుల్ గాంధీ దేశాన్ని అవమానిస్తున్నారని మండిపడ్డారు. ప్రజాస్వామ్యం ఉంది కాబట్టే ఆయన దేశవ్యాప్తంగా పాదయాత్రలు చేయగలుగుతున్నారని, సుప్రీంకోర్టుకు వెళ్లగలుగుతున్నారని గుర్తు చేశారు. గత కాంగ్రెస్ పాలనంతా కుంభకోణాలు, బాంబు పేలుళ్లతో నిండి ఉండేదని.. ఆ పేలుళ్లలో వందలాది మంది అమాయకులు ప్రాణాలు కోల్పోయారని ఈటల అన్నారు. రాజీవ్ గాంధీ హయాంలో ఉమ్మడి ఏపీలో ఐదేళ్లలో ఐదుగురు ముఖ్యమంత్రులను మార్చి ప్రజాస్వామ్యాన్ని ఆ పార్టీ ఖూనీ చేసిందన్నారు. దీనికి భిన్నంగా గతంలో వాజ్‌పేయి ప్రపంచ వేదికలపై భారత ఆత్మగౌరవాన్ని నిలబెట్టారన్నారు. 12 ఏళ్లుగా ప్రధానిగా కొనసాగుతున్నప్పటికీ ప్రధాని మోదీ ఒక్క అవినీతి మరక అంటించుకోలేదన్నారు.
2014 నుండి ఉగ్రవాదాన్ని పూర్తిగా నియంత్రించడంతో పాటు, ప్రపంచ దేశాలకు అన్నం పెట్టే స్థాయికి భారత్ ఎదిగిందని ఆయన పేర్కొన్నారు. బంగ్లాదేశ్, నేపాల్, ఫ్రాన్స్ దేశాల్లో జరిగినట్లుగా మన దేశంలో కూడా అల్లర్లు సృష్టించాలని చూస్తున్నారని ఆరోపించారు. మరోవైపు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎన్నికల మేనిఫెస్టోను పూర్తిగా తుంగలో తొక్కారని ఈటల విమర్శించారు. రైతులకు ఏకకాలంలో రుణమాఫీ చేస్తామని చెప్పి మోసం చేశారన్నారు. విద్యార్థులకు ఫీజు రీయింబర్స్‌మెంట్ కూడా ఇవ్వడం లేదని మండిపడ్డారు.
సమ్మిట్‌ల పేరుతో రాహుల్ గాంధీ స్నేహితుడైన జార్జ్ సోరోస్‌ను తీసుకువచ్చారని ఈటల ఆరోపించారు. ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికలు జరగని 42 ఇస్లామిక్ దేశాల ప్రతినిధులను పిలిచారన్నారు. అసెంబ్లీ, పార్లమెంట్‌లను దేవాలయాలుగా భావించే ఈ దేశంలో, పార్లమెంట్‌లో నిజం మాట్లాడే దమ్ము రాహుల్ గాంధీకి లేదన్నారు. ఈ అంశాలపై ఆయనతో చర్చకు తాను సిద్ధమని సవాల్ విసిరారు. అటు రాష్ట్రంలో హైడ్రా పేరుతో సాగుతున్న కూల్చివేతలపై ఈటల స్పందించారు. పేదల ఇళ్లను కూల్చడం లేదని హైడ్రా కమిషనర్ రంగనాథ్ కోర్టుకు చెబుతున్నారని, కానీ వాస్తవానికి సామాన్యుల ఇళ్లను కూల్చివేశారని ఆరోపించారు. సినీ నటుడు నాగార్జునకు చెందిన కట్టడాలను కూల్చినప్పటికీ, వాటి విలువ కంటే ఆయనకు ఎక్కువ మేలే చేశారన్నారు.
Also Read: జియో బంపరాఫర్.. ఆ ప్లాన్‌పై 84 రోజులు నెట్‌ఫ్లిక్స్ ఉచితం.. ఇంకా బోలెడన్ని బెనిఫిట్స్!
సమయం వచ్చినప్పుడు ఆ వివరాలన్నీ బయటపెడతామని వ్యాఖ్యానించారు. ‘హైడ్రా’ అనే పేరును హిట్లర్ నుండి తీసుకున్నామని సీఎం రేవంత్ రెడ్డి స్వయంగా చెప్పారని, హిట్లర్ మీకు ఆదర్శమా? అని నిలదీశారు. ముందుగా మూసీ పరివాహక ప్రాంత ప్రజలకు న్యాయం చేసి ఆ తర్వాతే ప్రక్షాళన చేపట్టాలని సూచించారు. రేవంత్ రెడ్డి వ్యవహరిస్తున్న తీరు చూస్తుంటే రాబోయే 20 ఏళ్ల పాటు తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ మళ్లీ కోలుకోకుండా ఆయనే చేసి వెళ్ళిపోతారన్నారు. రాష్ట్రంలో మరలా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చే ఆస్కారమే లేదని.. మంత్రులు, ఎమ్మెల్యేలు ఆలోచించుకోవాలని ఈటల రాజేందర్ హితవు పలికారు.