Pegasus Spyware : ప్రముఖ మెసేజింగ్ యాప్ వాట్సప్ ఐదేళ్ల క్రితం వేసిన దావాలో తాజాగా తీర్పు వచ్చింది. వాట్సాప్ యూజర్లపై నిఘా పెట్టింది ఇజ్రాయెల్‌కు చెందిన సంస్థేనని అమెరికా కోర్టు తన విచారణలో వెల్లడించింది. మెటాకు అనుకూలంగా తీర్పు ఇస్తూ ఇందుకు సంబంధించిన కేసులో తుది తీర్పును వెలువరించింది.
ప్రపంచవ్యాప్తంగా అత్యధిక మంది యూజర్స్ వాడుతున్న సోషల్ మెసేజ్ వాట్సాప్ కొన్నాళ్ల క్రితం ప్రైవసీ ఉల్లంఘన ఆరోపణలు ఎదుర్కొన్న సంగతి తెలిసిందే. తాజాగా వాట్సప్ ప్రైవసీ ఉల్లంఘన కేసులో వాట్సాప్ మాతృ సంస్థ మెటా (Meta) కు భారీ ఊరట లభించింది. తమ వాట్సాప్ లో బగ్‌ను ఉపయోగించి ఇజ్రాయెల్ (Israel) ఎన్‌ఎస్‌ఓ గ్రూప్ (NSO Group) యూజర్లపై నిఘా పెట్టిందని మెటా ఆరోపిస్తూ.. కాలిఫోర్నియాలోని ఓ క్లాండ్ కోర్టులో 2019లో దావా వేసింది. దీనిపై విచారణ జరిపిన న్యాయస్థానం మెటాకు అనుకూలంగా తీర్పు ఇచ్చింది. యూజర్లపై హ్యాకింగ్‌కు ఎన్‌ఎస్‌ఓ గ్రూప్ కారణమని తాము గుర్తించామని.. మెటా ఎలాంటి ప్రైవీసీ ఉల్లంఘన చర్యలు చేపట్టాలని న్యాయస్థానం వెల్లడించింది.
ఇక ఐదేళ్ల క్రితం వాట్సప్ (WhatsApp)లోని బగ్ ను ఉపయోగించి ఇజ్రాయెల్ కు చెందిన సంస్థ యూజర్స్ ఫోన్లలో పెగాసెస్ స్పై సాఫ్ట్‌వేర్ (Pegasus Spyware)ను చొప్పించిందని అప్పట్లో మెటా ఆరోపించింది. దాంతో యూజర్లపై ఆ సంస్థ అనధికారంగా నిఘా పెట్టిందని.. ఇది ప్రైవసీ ఉల్లంఘనేనని తెలుపుతూ మెటా అమెరికా కోర్టులో దావా వేసింది. దీనిపై తాజాగా విచారణ జరిపిన న్యాయస్థానం.. కాంట్రాక్ట్ ఒప్పందం ఉల్లంఘనకు ఎన్ఎస్ఓ సంస్థ బాధ్యత వహిస్తుందని, హ్యాకింగ్ సైతం జరిగిందని గుర్తించింది. ఈ విషయంపై నష్టపరిహారం సైతం చెల్లించాల్సి ఉంటుందని.. తదుపరి విచారణలో నష్టపరిహారంపై స్పష్టత వస్తుందని తెలిపింది.
అయితే కోర్టు ఇచ్చిన ఈ తీర్పుపై ఎన్‌ఎస్‌ఓ గ్రూప్ ఇంకా స్పందించలేదు కానీ వాట్సప్ హెడ్ విల్ క్యాథ్‌కార్ట్ స్పందించారు. ‘ఇది ప్రైవసీ సాధించిన విజయం’ అంటూ తెలిపారు. ఇజ్రాయెల్‌కు చెందిన ఎన్‌ఎస్‌ఓ సంస్థ వాట్సప్ సర్వర్ల యాక్సెస్‌ను ఉపయోగించి.. కొన్ని మొబైల్స్ లో పెగాసస్ సాఫ్ట్‌వేర్‌ను ఇన్‌స్టాల్ చేసిందని 2019లో వాట్సప్ ఆరోపించింది. జర్నలిస్టులు, మానవహక్కుల కార్యకర్తలు సహా దాదాపు 1400 మందిపై ఎన్ఎస్‌ఓ కంపెనీ నిఘా పెట్టిందని తెలిపింది. ఇందుకు సంబంధించి నష్టపరిహారం చెల్లించాలని ఆ కంపెనీపై దావా వేసింది. అప్పటి నుంచి ఈ కేసులో విచారణ కొనసాగుతోంది.
ఇక దాదాపు మూడేళ్ల క్రితం ఈ పెగాసస్ హ్యాకింగ్ వ్యవహారం ప్రపంచ వ్యాప్తంగా కలకలం రేపిన సంగతి తెలిసిందే. భారత్ సహా వివిధ దేశాల్లోని రాజకీయ నాయకులు, పాత్రికేయులు, జడ్జ్ లపై పెగాసస్ సాఫ్ట్‌వేర్ ద్వారా ఫోన్ల హ్యాకింగ్ జరిగిందని అప్పట్లో ఓ సంచలన కథనం వెలువడింది. ఇది కాస్తా తీవ్ర దుమారానికి తెర తీసింది. ఇక ఎన్‌ఎస్‌ఓ గ్రూప్ కు చెందిన పెగాసస్ స్పైవేర్… టెర్రరిజంతో పాటు నేరాలను అదుపుచేయటానికి విదేశాలకు ఎగుమతి చేసేందుకు ఇజ్రాయెల్ ప్రభుత్వం అప్పట్లో అనుమతి పొందింది. దీంతో ఈ సంస్థపై ఆ దేశ ప్రభుత్వమే అప్పట్లో దర్యాప్తు సైతం చేపట్టింది.
ALSO READ : ఎమ్మెల్యేలపై సెటైర్లు.. బీఆర్ఎస్ పదేళ్ల పాపాలన్న సీఎం రేవంత్