Human Coder Defeat AI| రానున్నదంతా యంత్రాల యుగం. ఇప్పటికే కృత్రిమ మేధస్సు (ఆర్టిఫీషియల్ టెక్నాలజీ – ఏఐ) అన్ని రంగాల్లో ఆదిపత్యం చూపిస్తోంది. ప్రతి డివైజ్ లో ఇప్పుడు ఏఐ తప్పనిసరిగా మారిపోయింది. ఇలాంటి తరుణంలో మానవులు ఉద్యోగాలను ఏఐ తినేస్తుందని ఆందోళన కూడా పెరిగిపోతోంది. అందుకే మనిషి ఆలోచనా సామర్థ్యం, యంత్రాల శక్తి మధ్య పోటీ ఎప్పటినుంచో కొనసాగుతోంది.
అయితే, అన్ని రంగాల్లో యంత్రాలు ఇంకా మనుషులను పూర్తిగా ఓడించలేకపోతున్నాయి. ఇటీవల జపాన్ రాజధాని టోక్యోలో జరిగిన ఓ అంతర్జాతీయ కోడింగ్ పోటీల్లో ఒక మనిషి అత్యంత క్లిష్ట పరిస్థితుల్లో కూడా ఏఐపై గెలుపు సాధించాడు. టోక్యోల జరిగిన ఆట్‌కోడర్ వరల్డ్ టూర్ ఫైనల్స్ 2025 హ్యూరిస్టిక్ కాంటెస్ట్‌లో ఈ విషయం మరోసారి నిరూపితమైంది. ఈ పోటీలో ఒక నైపుణ్యం గల మానవ ప్రోగ్రామర్.. ఓపెన్‌ఏఐ అభివృద్ధి చేసిన అడ్వాన్స్ ఏఐ మోడల్ మధ్య నేరుగా పోటీ జరిగింది.
10 గంటల పాటు నడిచిన ఈ ప్రోగ్రామింగ్ మారథాన్ (పోటీ)లో పోలండ్‌కు చెందిన ప్రజెమిస్వాఫ్ డెబియాక్ అనే ప్రోగ్రామర్ విజేతగా నిలిచాడు. గతంలో ఓపెన్‌ఏఐలో పనిచేసిన డెబియాక్, అలసటతో కళ్లు మూసుకుపోతున్న స్థితిలోనూ, ఏఐ మోడల్‌ను ఓడించి, మానవ సహజ బుద్ధి, ఒత్తిడిలో సమస్యలను పరిష్కరించే సామర్థ్యం ఇంకా శక్తివంతంగా ఉన్నాయని చాటాడు.
ఆర్స్ టెక్నికా నివేదిక ప్రకారం.. ఈ ఈవెంట్ ఒక మైలురాయి. ఇది మొదటిసారిగా ఒక ఏఐ మోడల్ ప్రపంచ స్థాయి ప్రోగ్రామింగ్ పోటీలో అత్యుత్తమ మానవ కోడర్లతో నేరుగా పోటీపడిన సందర్భం. ఏఐ మోడల్ అనేక మానవ పోటీదారులను ఓడించినప్పటికీ, డెబియాక్‌ను మాత్రం దాటలేకపోయింది.
పోటీ తర్వాత డెబియాక్ తన అనుభవాలను హాస్యాస్పదంగా పంచుకున్నాడు: “మానవాళి గెలిచింది (ఇప్పటికైనా)! నేను పూర్తిగా అలసిపోయాను. గత మూడు రోజుల్లో కేవలం 10 గంటలు మాత్రమే నిద్రపోయాను. నిలబడే శక్తి కూడా లేదు. కొంచెం విశ్రాంతి తీసుకున్నాక మరిన్ని వివరాలు పంచుకుంటాను.” తర్వాత అతను అధికారిక ఫలితాలను ప్రకటించాడు: “నా ఆధిక్యం ఏఐపై 5.5% నుండి 9.5%కి పెరిగింది. ఈ హైప్ అంతా కాస్త అవాస్తవంగా అనిపిస్తోంది. కాంపిటీటివ్ ప్రోగ్రామింగ్‌పై ఇంతమంది ఆసక్తి చూపుతారని ఊహించలేదు. బహుశా ఇలాంటివి ఇంకా తరచూ చేయాలేమో!”
ఈ పోటీలో పోటీదారులు 10 గంటల వ్యవధిలో సంక్లిష్టమైన ఆప్టిమైజేషన్ సమస్యను పరిష్కరించాల్సి ఉంది. ఏఐ మోడల్ ఇతర మానవ పోటీదారులను ఓడించినప్పటికీ, డెబియాక్ రూపొందించిన సమర్థవంతమైన పరిష్కారాన్ని అధిగమించలేకపోయింది.
ఈ విజయం ఇంకా టెక్నాలజీ, లాజిక్‌కు సంబంధించిన రంగాల్లో మానవులు ఏఐని ఓడించగలరని నిరూపించింది. అయితే, ఏఐ AGI (మానవ ఆలోచనా సామర్థ్యాలను సమానంగా లేదా అధిగమించే ఏఐ) రంగంలో వస్తున్న పురోగతులతో.. భవిష్యత్తులో యంత్రాలు ఈ పోటీలలో ముందంజలో ఉండవచ్చు.
Also Read: 2025లో భారీ బ్యాటరీ లైఫ్ ఇచ్చే టాప్ 5 బడ్జెట్ స్మార్ట్‌ఫోన్‌లు
ఈ ఈవెంట్ కోడింగ్ సమాజానికి మానవాళికి ఒక ముఖ్యమైన సందేశాన్ని ఇస్తుంది. అధిక ఒత్తిడి ఉన్న పరిస్థితుల్లో కూడా మానవ క్రియేటివేటీ, అనుకూలత, ఓర్పు ఇంకా మెషిన్ లెర్నింగ్ అల్గారిథమ్‌లను మించగలవని ఈ విజయం నిరూపిస్తుంది.