Brain: మన శరీరంలో మెదడు అత్యంత ముఖ్యమైన అవయవాలలో ఒకటి. ఆలోచనలు, జ్ఞాపకాలు, భావోద్వేగాలు, శారీరక పనులను నియంత్రించే మెదడు ఆరోగ్యంగా ఉంటేనే మనం మెరుగ్గా జీవించగలం. ఇదిలా ఉంటే.. రోజువారీ జీవితంలో మనం చేసే కొన్ని అలవాట్లు మెదడు ఆరోగ్యాన్ని తీవ్రంగా దెబ్బతీస్తాయి. ఈ అలవాట్లను గుర్తించి వాటిని మానుకోవడం ద్వారా మెదడును ఆరోగ్యంగా, చురుకుగా ఉంచుకోవచ్చు.
హానికరమైన సాధారణ అలవాట్లు:
పోషకాహార లోపం (Junk Food & Processed Food):
అధిక చక్కెర, ఉప్పు, అనారోగ్యకరమైన కొవ్వులు ఉన్న ప్రాసెస్డ్ ఫుడ్స్, జంక్ ఫుడ్స్ మెదడు పనితీరును దెబ్బతీస్తాయి. ఇవి జ్ఞాపకశక్తిని తగ్గించి, డిప్రెషన్, ఆందోళన వంటి సమస్యలకు దారితీస్తాయి. మెదడు ఆరోగ్యానికి అవసరమైన విటమిన్లు, ఖనిజాలు కూడా వీటిలో ఉండవు.
నిద్ర లేకపోవడం (Lack of Sleep):
నిద్ర మెదడుకు విశ్రాంతినిస్తుంది. అంతే కాకుండా రోజువారీ పనుల నుంచి పేరుకుపోయిన వ్యర్థాలను తొలగించడంలో సహాయపడుతుంది. తగినంత నిద్ర లేకపోవడం వల్ల ఏకాగ్రత లోపించడం, జ్ఞాపకశక్తి తగ్గడం, మానసిక స్థితిలో మార్పులు, దీర్ఘకాలంలో అల్జీమర్స్ వంటి వ్యాధుల ప్రమాదం పెరుగుతుంది.
ఒంటరితనం & సామాజిక దూరం (Social Isolation):
మనుషులు సామాజిక జీవులు. సామాజిక సంబంధాలు మెదడును చురుకుగా ఉంచుతాయి. ఒంటరితనం, ఇతరులతో సంబంధాలు లేకపోవడం వల్ల మెదడు పనితీరు మందగిస్తుంది. అంతే కాకుండా డిప్రెషన్, డిమెన్షియా (మతిమరుపు) వచ్చే ప్రమాదం పెరుగుతుంది.
శారీరక శ్రమ లేకపోవడం (Lack of Physical Activity):
వ్యాయామం కేవలం శరీరాన్ని మాత్రమే కాకుండా మెదడును కూడా ఆరోగ్యంగా ఉంచుతుంది. శారీరక శ్రమ లేకపోవడం వల్ల మెదడుకు రక్త ప్రసరణ తగ్గి ఆక్సిజన్, పోషకాలు సరిగా అందవు. ఇది జ్ఞాపకశక్తిని, ఏకాగ్రతను ప్రభావితం చేస్తుంది.
అతిగా ఫోన్లు/ కంప్యూటర్ల వాడకం (Excessive Screen Time):
స్మార్ట్‌ఫోన్‌లు, కంప్యూటర్లు, టీవీలను అతిగా వాడటం వల్ల మెదడుపై ప్రతికూల ప్రభావం పడుతుంది. ఇది నిద్రలేమి, కంటి ఒత్తిడి, ఏకాగ్రత లోపం, మెదడులోని కొన్ని భాగాలపై దీర్ఘకాలిక ప్రభావాలకు దారితీసే ప్రమాదం ఉంటుంది.
అధిక ఒత్తిడి (Chronic Stress):
దీర్ఘకాలిక ఒత్తిడి కార్టిసాల్ అనే హార్మోన్‌ను పెంచుతుంది. ఇది మెదడు కణాలకు నష్టం కలిగిస్తుంది. జ్ఞాపకశక్తి తగ్గిపోవడం, ఆందోళన, డిప్రెషన్ , మెదడు పరిమాణం తగ్గడానికి కూడా ఒత్తిడి కూడా కారణం కావచ్చు.
తక్కువ నీరు తాగడం (Dehydration):
మన మెదడులో ఎక్కువ భాగం నీరే ఉంటుంది. శరీరానికి తగినంత నీరు అందకపోతే.. మెదడు పనితీరు మందగిస్తుంది. ఇది అలసట, తలనొప్పి, ఏకాగ్రత లోపంతో పాటు మానసిక స్పష్టత తగ్గడానికి దారితీస్తుంది.
డ్రింకింగ్, స్మోకింగ్ (Smoking & Excessive Alcohol Consumption):
ధూమపానం మెదడుకు రక్త ప్రసరణను తగ్గించి, ఆక్సిజన్ సరఫరాను అడ్డుకుంటుంది. మద్యపానం మెదడు కణాలను నాశనం చేస్తుంది. అంతే కాకుండా జ్ఞాపకశక్తి, సమన్వయంపై తీవ్ర ప్రభావం చూపుతుంది.
Also Read: టీ తాగిన వెంటనే మందులు వేసుకుంటున్నారా ? జాగ్రత్త !
మెదడు ఆరోగ్యం కోసం ఏం చేయాలి ?
ఆరోగ్యకరమైన ఆహారం: పండ్లు, కూరగాయలు, తృణధాన్యాలు, ఆరోగ్యకరమైన కొవ్వులు (నట్స్, అవకాడో) కలిగిన సమతుల్య ఆహారం తీసుకోండి.
క్రమం తప్పకుండా నిద్ర: రోజుకు 7-8 గంటలు నాణ్యమైన నిద్ర పొందండి.
సామాజికంగా చురుకుగా ఉండండి: స్నేహితులు, కుటుంబ సభ్యులతో సమయం గడపండి.
క్రమం తప్పకుండా వ్యాయామం: ప్రతిరోజూ కనీసం 30 నిమిషాల పాటు వ్యాయామం చేయండి.
ఒత్తిడిని తగ్గించుకోండి: యోగా, ధ్యానం, శ్వాస వ్యాయామాలు వంటివి చేయండి.
నీరు పుష్కలంగా తాగండి: శరీరాన్ని, మెదడును హైడ్రేటెడ్‌గా ఉంచండి.
కొత్త విషయాలు నేర్చుకోండి: మెదడును చురుకుగా ఉంచడానికి కొత్త భాషలు, నైపుణ్యాలు లేదా హాబీలను నేర్చుకోండి.