Robot Vacuum Privacy Risks: నేటి ఉరుకుల పరుగుల జీవితంలో ఇంటి పనుల భారాన్ని తగ్గించేందుకు చాలామంది రోబోట్ వ్యాక్యూమ్ క్లీనర్లను ఆశ్రయిస్తున్నారు. బటన్ నొక్కితే చాలు.. ఇల్లంతా తిరుగుతూ దుమ్ము, ధూళిని శుభ్రం చేసే ఈ స్మార్ట్ డివైజ్‌లు మన పనిని సులభం చేస్తున్నాయి. కానీ, మనకు తెలియకుండానే ఇవే మన వ్యక్తిగత జీవితంలోకి తొంగిచూసే అవకాశం ఉందని మీకు తెలుసా?
వీటిలో ఉండే కెమెరాలు, సెన్సార్లు ఇంటి పరిసరాలను మ్యాప్ చేయడంతో పాటు, కొన్ని మోడళ్లలో ఇంటి దృశ్యాలు, ఇతర సున్నితమైన డేటా కూడా రికార్డయ్యే ప్రమాదం ఉంది. ఈ సమాచారం హాకర్ల చేతుల్లో పడితే మన ప్రైవసీకి ముప్పు తప్పదు. అంటే.. ఇంటిని శుభ్రం చేసేందుకు తెచ్చుకున్న ఓ చిన్న రోబోట్ మన వ్యక్తిగత విషయాలను బయటపెట్టొచ్చు. అందుకే రోబోట్ వ్యాక్యూమ్ కొనేముందు ఈ విషయాలు తప్పక తెలుసుకోవాలి.
రోబోట్ వ్యాక్యూమ్‌లు సరిగ్గా తిరగడానికి ఇంట్లో రూట్ మ్యాపింగ్ కోసం కెమెరాలు, జీపీఎస్ ఉపయోగిస్తాయి. అయితే వీటి వల్ల వచ్చే సమస్య ఏంటంటే.. అవి తీసే ఫొటోలు, వీడియోలు క్లౌడ్‌లో స్టోర్ అవుతాయి. గతంలో ఓ మహిళ తన ఇంట్లో ఉన్న సమయంలో తీసిన ఫొటోలు నెట్‌లో లీక్ అవ్వడం పెద్ద కలకలం రేపింది. పరికరం తయారీ సంస్థ అది టెస్టింగ్ కోసం అనుమతితోనే జరిగిందని చెప్పినప్పటికీ, చివరికి ఆ ఫొటోలు సోషల్ మీడియా గ్రూపుల్లో దర్శనమిచ్చాయి.
Also Read: Google Pixel 11పై బిగ్ డిస్కౌంట్.. ఫ్లిప్‌కార్ట్ సేల్‌లో రూ.19,000 ఆదా చేసుకునే అవకాశం!
కేవలం ఫొటోలే కాదు.. సెన్సార్ల ద్వారా వచ్చే వైబ్రేషన్లను బట్టి మాటలను వినే సాంకేతికత కూడా వీటికి సాధ్యమేనని పరిశోధకులు నిరూపించారు. దీనికి తోడు వీటి సాఫ్ట్‌వేర్‌లో ఉండే లోపాల వల్ల హ్యాకర్లు సులువుగా ఈ వ్యాక్యూమ్‌లను తమ అధీనంలోకి తీసుకుంటున్నారు. ఇటీవల ఓ ప్లేస్టేషన్ కంట్రోలర్ సాయంతో ఏకంగా వేలాది రోబోట్ వ్యాక్యూమ్‌ల లైవ్ కెమెరా ఫీడ్, ఆడియోను ఒక హ్యాకర్ యాక్సెస్ చేయగలిగాడు. అంటే మన పర్సనల్ లైఫ్ ఇతరులకు రికార్డెడ్ షోగా మారిపోతోందన్నమాట.
ఐరోబోట్ వంటి కొన్ని బ్రాండ్లు సెక్యూరిటీ ఇస్తున్నామని చెప్తున్నా.. కంపెనీలు చేతులు మారడం, సరైన అప్‌డేట్స్ లేకపోవడం వల్ల నమ్మకం తగ్గుతోంది. మరోవైపు మ్యాటిక్ అనే బ్రాండ్ డేటా ప్రైవసీకి పెద్దపీట వేస్తున్నా, దాని ధర భారతీయ కరెన్సీలో దాదాపు రూ.1,31,000 పైనే ఉంటుంది. ఇది సామాన్యులకు చాలా ఖరీదైన వ్యవహారమే. ఇక భద్రతా కారణాల దృష్ట్యా కొన్ని దేశాలు విదేశీ రోబోటిక్ పరికరాలపై నిషేధాలు కూడా విధిస్తున్నాయి.
సాంకేతికత ఎంత పెరిగినా.. మన ప్రైవసీని పణంగా పెట్టకూడదు. రోబోట్ వ్యాక్యూమ్ క్లీనర్ కొనేముందు దాని డేటా పాలసీలు, వైఫై సెక్యూరిటీ అంశాలను క్షుణ్ణంగా పరిశీలించాలి. వీలైతే కెమెరాలు లేని బేసిక్ మోడల్స్ ఎంచుకోవడం లేదా అవసరం లేనప్పుడు వైఫై ఆఫ్ చేయడం మంచిది. సదుపాయం కోసం మన ఇంట్లోని పర్సనల్ స్పేస్‌ను ప్రమాదంలో పడేసుకోకుండా జాగ్రత్త పడటమే ఉత్తమం.
Also Read: మీ ఐఫోన్‌ను టేప్ కొలతలా వాడొచ్చని తెలుసా? ఇల్లు మారేటప్పుడు ఇది చాలా హెల్ప్ అవుతుంది!