Russia Lab Incident: రష్యాలోని సైబీరియా ప్రాంతంలో ఒక యువ ల్యాబ్ టెక్నీషియన్ మరణం ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా తీవ్ర ఆందోళన రేకెత్తిస్తోంది. 28 ఏళ్ల దర్యా షిపిలోవా (Darya Shipilova) అనే ఉద్యోగిని మరణం అనంతరం అక్కడ అనూహ్య పరిణామాలు చోటుచేసుకున్నాయి. ఆమెతో సన్నిహితంగా మెలిగిన దాదాపు 200 మందిని వైద్యుల పర్యవేక్షణలో ఉంచడం, వారిని ఉంచిన ఆసుపత్రుల్లో ఆంక్షలు విధించడం అనుమానాలకు తావిస్తోంది. సదరు ఉద్యోగిని సాధారణ న్యుమోనియాతోనే మరణించిందని రష్యా ఆరోగ్య శాఖ చెబుతున్నప్పటికీ.. ల్యాబ్ లో లీకైన అత్యంత ప్రమాదకర ‘ప్లేగ్’ బాక్టీరియా వల్లే ఆమె చనిపోయినట్లు అంతర్జాతీయ కథనాలు పేర్కొంటున్నాయి.
పారిశ్రామిక నగరం షెలెకోవ్ (Shelekhov)లోని ‘ఇర్కుట్స్క్ యాంటీ ప్లేగ్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్’ (Irkutsk Anti Plague Research Institute) లో షిపిలోవా పనిచేసేది. స్థానిక మీడియా ‘ల్యూడి బైకాలా’ తెలిపిన వివరాల ప్రకారం.. సెప్టెంబర్ 25న నమూనాలు సేకరిస్తున్న సమయంలో ప్రాణాంతక బాక్టీరియా ఉన్న టెస్ట్ ట్యూబ్ ప్రమాదవశాత్తు పగిలిపోయింది. అనంతరం తీవ్రమైన న్యుమోనియా లక్షణాలతో సెప్టెంబర్ 29న ఆమె ఆసుపత్రిలో చేరగా పరిస్థితి విషమించి అక్టోబర్ 1 అర్ధ రాత్రి వెంటిలేటర్‌పై చికిత్స పొందుతూ ఆమె మరణించింది. దీనిపై పొరుగున ఉండే బురియాటియా రిపబ్లిక్ అధినేత అలెక్సీ త్సిడెనోవ్ (Alexei Tsydenov) స్పందిస్తూ.. ‘ఆమె ప్లేగ్ వ్యాధితో మరణించి ఉండవచ్చు’ అని పేర్కొనడం ఈ అనుమానాలకు మరింత బలమిచ్చింది.
ఒకవైపు పరిస్థితి బాగానే ఉందంటూ రష్యా ప్రభుత్వం పదేపదే చెబుతున్నప్పటికీ క్షేత్రస్థాయిలో తీసుకుంటున్న చర్యలు మాత్రం అందుకు భిన్నంగా ఉన్నాయి. బాధితురాలితో పరిచయం ఉన్న దాదాపు 200 మందిని ఐసోలేషన్‌లో ఉంచారు. ఇర్కుట్స్క్‌లోని చిన్నారుల ఆసుపత్రి, ప్రసూతి ఆసుపత్రులతో సహా పలు ఆసుపత్రుల్లో ఆంక్షలు, క్వారంటైన్ విధించారు. స్థానిక అల్యూమినియం ఫ్యాక్టరీ కార్మికులకు మాస్కులు ధరించాలని ఉత్తర్వులు జారీ చేశారు. అమెరికాలోని వైట్ హౌస్ సైతం ఈ పరిణామాలను నిశితంగా పరిశీలిస్తున్నట్లు తెలిపింది. సాధారణ న్యుమోనియా కేసు అయితే అధికారులు ఇంత పెద్దఎత్తున క్వారంటైన్ ఆంక్షలు విధించరని, ప్రమాదాన్ని బయటకు చెప్పకుండా అదుపు చేసేందుకే ప్రభుత్వం ప్రయత్నిస్తోందని నిపుణులు భావిస్తున్నారు.
సాధారణంగా ప్లేగ్ అనేది ‘యెర్సినియా పెస్టిస్’ (Yersinia pestis) అనే బాక్టీరియా వల్ల వస్తుంది. ఎలుకలు, ఈగలు ద్వారా వచ్చే బుబోనిక్ ప్లేగ్ బాగా పాపులర్ అయినప్పటికీ.. ఊపిరితిత్తులపై దాడి చేసే ‘న్యుమోనిక్ ప్లేగ్’ (Pneumonic plague) అత్యంత ప్రమాదకరమైనది. ఇది శ్వాసకోశ తుంపరల ద్వారా ఒకరి నుంచి ఒకరికి వేగంగా వ్యాపిస్తుంది. సమయానికి చికిత్స అందకపోతే 24 గంటల్లోనే ప్రాణాలు తీసే ప్రమాదం ఉంది. అయితే ఆరంభంలోనే యాంటిబయోటిక్స్ ఇస్తే దీని నుంచి కోలుకోవచ్చు. వ్యాప్తి వేగం, ప్రాణాలకు ఉన్న ముప్పు కారణంగానే ప్రపంచవ్యాప్తంగా ఈ ఘటన ఆందోళనకు గురిచేస్తోంది.
పరిశోధనశాలల్లో ఇటువంటి ప్రమాదాలు జరగడం అరుదే అయినప్పటికీ అసలేం జరిగింది? ఏ క్రిమి బయటకు వచ్చింది? ఎంతమంది ప్రభావితమయ్యారు? అనే వివరాలను పారదర్శకంగా వెల్లడించాల్సిన బాధ్యత ప్రభుత్వాలపై ఉంది. రష్యా ప్రభుత్వం సమాచారాన్ని దాచడానికి ప్రయత్నించడం వల్ల అంతర్జాతీయంగా అనవసర భయాందోళనలు, వదంతులు వ్యాపిస్తున్నాయి.
Also Read: సీఈసీ జ్ఞానేష్ కుమార్ వివాదం.. రంగంలోకి సుప్రీంకోర్టు.. ఎన్నికల సంఘానికి నోటీసులు
రష్యా ల్యాబ్ లో జరిగిన ఈ ఘటన భారత్ కు సైతం ఒక హెచ్చరిక లాంటిదని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. 1994లో సూరత్‌లో ప్లేగ్ భయాలు చోటుచేసుకున్నప్పుడు వదంతులు ఎంతటి దారుణమైన పరిస్థితికి దారితీశాయో దేశం చూసింది. కోవిడ్, నిపా, సార్స్ తర్వాత దేశంలో కూడా హై-కంటైన్‌మెంట్ ల్యాబ్‌ల సంఖ్య పెరిగింది. ల్యాబ్‌ల సంఖ్య పెరగడంతో పాటు, అక్కడ జరిగే చిన్న చిన్న ప్రమాదాలను కూడా పారదర్శకంగా నివేదించే సంస్కృతిని భారత్ పెంపొందించుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. లేదంటే తీవ్ర పరిణామాలు ఎదుర్కొవాల్సి వస్తుందని హెచ్చరిస్తున్నారు.
Also Read: ‘రే*ప్ చేస్తే చస్తామనే భయం పుట్టించాలి’.. మహిళల భద్రతపై సుప్రీంకోర్టు సంచలన వ్యాఖ్యలు!