CEC Controversy: చీఫ్ ఎలక్ష న్ కమిషనర్ (సీఈసీ) జ్ఞానేష్ కుమార్ చుట్టూ గత కొద్దిరోజులుగా తిరుగుతున్న వివాదంపై సుప్రీంకోర్టు స్పందించింది. వార్తాపత్రికలలో వచ్చిన కథనాల ఆధారంగా నేరుగా ఎలాంటి ఉత్తర్వులు జారీ చేయలేమని స్పష్టం చేసింది. అదే సమయంలో దీనిపై పూర్తి వివరాలతో సమాధానం ఇవ్వాలని ఎన్నికల సంఘాన్ని (ఈసీ) ఆదేశించింది. ఈమేరకు సీజేఐ జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ జయమాల్య బాగ్చీ, జస్టిస్ వి. మోహనలతో కూడిన ధర్మాసనం ఈసీకి నోటీసులు జారీ చేసింది.
పాట్నాకు చెందిన రాకేష్ కుమార్ సింగ్ దాఖలు చేసిన పిటిషన్ పై సోమవారం సుప్రీంకోర్టు త్రిసభ్య ధర్మాసనం విచారణ చేపట్టింది. ఈసీ పరిధిలోని నిర్ణయాలు ఏవైనా సరే.. సభ్యులందరి ఏకగ్రీవ ఆమోదంతో లేదా మెజారిటీ అభిప్రాయంతోనే జరగాలని కోర్టు స్పష్టం చేసింది. సాధారణంగా నిర్ణయాలన్నీ ఇదే పద్ధతిలో జరుగుతాయని తాము భావిస్తున్నామని పేర్కొంది. ఒకవేళ నిబంధనలకు విరుద్ధంగా, ఎలాంటి సంప్రదింపులు లేకుండా ఏకపక్షంగా నిర్ణయాలు తీసుకున్నట్లు తేలితే వాటిని నిలిపివేస్తామని వ్యాఖ్యానించింది. అయితే నిజానిజాలు తేలకుండా ముందే ఒక నిర్ణయానికి రావడం సరికాదని అభిప్రాయపడింది.
విచారణ సందర్భంగా పిటిషనర్ పత్రికా కథనాలను ఉటంకించగా.. ‘వార్తాపత్రికలలో వచ్చే కథనాలు నూటికి నూరు శాతం నిజం కావచ్చు. పాక్షికంగా నిజం కావచ్చు లేదా పూర్తిగా తప్పు కూడా కావచ్చు’ అని బెంచ్ వ్యాఖ్యానించింది. కేవలం ఒక పత్రికా కథనాన్ని ప్రామాణికంగా తీసుకుని ఎలాంటి తుది ఆదేశాలు ఇవ్వలేమని తేల్చిచెప్పింది. కమిషన్ నుంచి సర్టిఫై చేసిన అధికారిక సమాచారం అందిన తర్వాతే దీనిపై ఒక స్పష్టతకు రాగలమని, చట్టాన్ని ఉల్లంఘించినట్లు తేలితే ఆ నిర్ణయాలను రద్దు చేస్తామని కోర్టు తెలిపింది.
Also Read: ‘రే*ప్ చేస్తే చస్తామనే భయం పుట్టించాలి’.. మహిళల భద్రతపై సుప్రీంకోర్టు సంచలన వ్యాఖ్యలు!
ఓటర్ల నమోదు, జాబితా, సాంకేతిక వ్యవస్థలకు సంబంధించి గత 10 నెలల వ్యవధిలో కనీసం 14 సందర్భాల్లో సీఈసీ తీరుపై మిగతా ఇద్దరు కమిషనర్లు సుఖ్‌బీర్ సింగ్ సంధు, వివేక్ జోషి అభ్యంతరాలు తెలిపారంటూ ఇటీవల ‘ది ఇండియన్ ఎక్స్‌ప్రెస్’ ఒక కథనాన్ని ప్రచురించింది. అయితే ఈ కథనాన్ని ఎన్నికల సంఘం తీవ్రంగా ఖండించింది. ముసాయిదా దశలో లేవనెత్తే సందేహాలు, సలహాలు సాధారణ ప్రక్రియలో భాగమేనని పేర్కొంది. ఓటర్ల సవరణకు సంబంధించి తీసుకున్న తుది నిర్ణయాలన్నీ కమిషన్ సభ్యులందరి ఏకగ్రీవ ఆమోదంతోనే జరిగాయని వివరణ ఇచ్చింది.
Also Read: బాల్యంలో లైంగిక దాడి.. 20 ఏళ్ల వయసులో తాతపై యువతి ప్రతీకారం.. క్రికెట్ బ్యాట్‌తో కొట్టి హత్య!