Samsung Galaxy A27: శాంసంగ్ తమ బడ్జెట్ స్మార్ట్‌ఫోన్ లవర్స్‌కు అదిరిపోయే న్యూస్ చెప్పబోతోంది. కంపెనీ త్వరలో లాంచ్ చేయనున్న ‘Galaxy A27’ మోడల్‌కు సంబంధించిన డిజైన్ వివరాలు తాజాగా లీక్ అయ్యాయి. ప్రముఖ కేస్ మేకర్ డక్స్‌డుసిస్ షేర్ చేసిన ట్రాన్స్‌పరెంట్ కేస్ రెండర్స్ ద్వారా ఈ ఫోన్ లుక్ ఎలా ఉండబోతోందో పూర్తిగా తెలిసిపోయింది. పాత డిజైన్‌కు గుడ్‌బై చెబుతూ శాంసంగ్ ఈసారి సరికొత్త మార్పులతో రంగంలోకి దిగుతోంది.
ఈ ఫోన్‌లో అందరినీ ఆకట్టుకునే ప్రధాన మార్పు డిస్‌ప్లేపైనే కనిపిస్తోంది. శాంసంగ్ ఎట్టకేలకు పాతకాలపు వాటర్‌డ్రాప్ నాచ్‌ను పక్కన పెట్టేసింది. దీని స్థానంలో ట్రెండీగా ఉండే పంచ్ హోల్ కెమెరా కటౌట్‌ను తీసుకొచ్చింది. అంతేకాదు.. 6.7 ఇంచుల స్క్రీన్ చుట్టూ ఉండే బెజెల్స్ (అంచులు), ముఖ్యంగా కింద ఉండే చిన్ సైజ్‌ను చాలా వరకు తగ్గించింది. దీనివల్ల ఫోన్ ప్రీమియం లుక్‌తో కనిపిస్తోంది.
గెలాక్సీ A27 డిజైన్.. ఇటీవల మార్కెట్లోకి వచ్చిన A37, A57 మోడల్స్‌ను పోలి ఉంటుంది. శాంసంగ్ తమ సిగ్నేచర్ ‘కీ ఐలాండ్’ డిజైన్‌ను ఇందులోనూ వాడింది. దీంతో పవర్, వాల్యూమ్ బటన్స్ ఉండే భాగం పక్కన ఫ్రేమ్ కాస్త పైకి లేచినట్టుగా ఉంటుంది. ఫోన్ వెనుక వైపు నిలువుగా మూడు కెమెరాల సెటప్ ఉంది. ఈ కెమెరా మాడ్యూల్ పక్కనే ఫ్లాష్ లైట్‌ను అమర్చారు.
Also Read: ఐఫోన్ క్రేజ్‌కు బ్రేక్ వేసేలా.. Google Pixel 10పై క్రోమా మైండ్ బ్లోయింగ్ డీల్, ఏకంగా రూ.20,000 ఆదా!
ఈ ఫోన్ కేవలం 7.9 మిమీ మందంతో చాలా స్లిమ్‌గా ఉండబోతోంది. అంత సన్నగా ఉన్నప్పటికీ.. దీనిలో ఏకంగా 5000mAh భారీ బ్యాటరీని అందించడం విశేషం. ఇది 25W ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్ట్ చేస్తుందని సమాచారం. ఇక సెల్ఫీల కోసం ముందు భాగంలో 12MP కెమెరా ఉండే అవకాశం ఉంది. సాఫ్ట్‌వేర్ పరంగా ఇది ఆండ్రాయిడ్ 16 ఆధారిత వన్ యూఐ 8.5 వెర్షన్‌తో రానుంది.
కంపెనీ అధికారికంగా ఎలాంటి ప్రకటన చేయనప్పటికీ.. కేస్ డిజైన్స్ వచ్చేయడాన్ని బట్టి చూస్తే ప్రొడక్షన్ వేగంగా జరుగుతోందని అర్థమవుతోంది. ఈ బడ్జెట్ ఫోన్ బ్లాక్, బ్లూ, గ్రీన్, పింక్ అనే నాలుగు ఆకర్షణీయమైన రంగుల్లో లభించనుంది. ఈ ఏడాది ద్వితీయార్థంలో ఈ స్మార్ట్‌ఫోన్ మార్కెట్లోకి అడుగుపెట్టే అవకాశం ఉంది.
Also Read: చదివిన వెంటనే సీక్రెట్ మెసేజ్‌లు మాయం.. వాట్సప్‌లో అదిరిపోయే కొత్త ఫీచర్!