Sony Mobiles| ఒకప్పుడు మొబైల్ ఫోన్‌ల రంగంలో పెద్ద బ్రాండ్ గా పేరొందిన సోనీ, ఇప్పుడు తీవ్రమైన పోటీ మధ్య తన స్మార్ట్‌ఫోన్ వ్యాపారాన్ని కొన్ని దేశాల్లో మూసివేసే దిశగా సాగుతోంది. గేమింగ్ కన్సోల్స్, కెమెరాలు, టెలివిజన్‌లలో సోనీ ఇప్పటికీ బలంగా ఉంది. కానీ దాని మొబైల్ ఫోన్ విభాగం నష్టాల్లో కూరుకుపోయింది. నివేదికల ప్రకారం, యూకేలో సోనీ తన మొబైల్ కార్యకలాపాలను తగ్గిస్తోంది, భారతదేశంతో సహా ఇతర యూరోపియన్ దేశాల్లో ఇప్పటికే వ్యాపారాన్ని మూసివేసింది.
1992లో తన మొదటి ‘మార్స్ బార్’ ఫోన్‌తో మొబైల్ రంగంలోకి సోనీ అడుగుపెట్టింది. 2000లలో, ఎరిక్సన్ కంపెనీతో కలిసి సోనీ ఎరిక్సన్ బ్రాండ్‌ను ప్రారంభించింది. స్టైలిష్, చిన్న 2G ఫోన్‌లను విడుదల చేసింది. ఈ ఫోన్‌లు నోకియా, మోటరోలా, శామ్‌సంగ్‌లతో పోటీపడ్డాయి. ఒకానొక సమయంలో సోనీ ప్రపంచ మొబైల్ మార్కెట్‌లో 9% వాటాను కలిగి ఉండేది, కానీ ఇప్పుడు అది 1 శాతం కంటే తక్కువకు పడిపోయింది.
సన్సార్ నివేదిక ప్రకారం.. యూకేలో తన మొబైల్ ఫోన్‌ల విక్రయాలను నిలిపివేయడానికి సోనీ కంపెనీ సిద్ధమవుతోంది. సోనీ వెబ్‌సైట్‌లో చూస్తే, ఎక్స్‌పీరియా స్మార్ట్‌ఫోన్‌లు దాదాపు అన్నీ అవుట్ ఆఫ్ స్టాక్‌లో ఉన్నాయి. భారతదేశంలో ఇప్పటికే వ్యాపారాన్ని మూసివేసిన తర్వాత, ఇతర ఆంగ్లం మాట్లాడే దేశాల్లో కూడా సోనీ ఈ ధోరణిని అనుసరిస్తోంది.
సోనీ ఎక్స్‌పీరియా స్మార్ట్‌ఫోన్‌ల కెమెరాలు అద్భుతమైన నాణ్యతను కలిగి ఉన్నాయి. సోనీ ఇతర బ్రాండ్‌లకు కెమెరా సెన్సార్‌లను సరఫరా చేస్తోంది. అయినప్పటికీ, ఎక్స్‌పీరియా ఫోన్‌లు అధిక ధర, బలమైన పోటీ కారణంగా కొనుగోలుదారులను ఆకర్షించలేకపోతున్నాయి.
ప్రస్తుతం స్మార్ట్‌ఫోన్ మార్కెట్‌లో ఆపిల్, శామ్‌సంగ్ ప్రీమియం విభాగంలో ఆధిపత్యం చెలాయిస్తున్నాయి. శామ్‌సంగ్ 20.1% ప్రపంచ వాటాతో మొదటి స్థానంలో ఉండగా, ఆపిల్ 19.5%తో రెండవ స్థానంలో ఉంది. చైనీస్ బ్రాండ్‌లైన షియోమి (13.9%), ఒప్పో (7.8%), వివో (7.5%) భారతదేశం వంటి అభివృద్ధి చెందుతున్న మార్కెట్‌లలో పెద్ద వాటాను కలిగి ఉన్నాయి. ఈ ఐదు కంపెనీలు కలిసి మొత్తం స్మార్ట్‌ఫోన్ మార్కెట్‌లో దాదాపు 70% వాటాను నియంత్రిస్తున్నాయి, ఇది సోనీ వంటి పాత బ్రాండ్‌లకు ప్రభావం చూపడానికి అవకాశాన్ని తగ్గిస్తోంది.
ఈ సమస్య ఎదుర్కొంటున్న కంపెనీల్లో సోనీతో పాటు LG, HTC, మరియు బ్లాక్‌బెర్రీ వంటి ప్రసిద్ధ బ్రాండ్‌లు కూడా ఉన్నాయి. ఈ కంపెనీలన్నీ మొబైల్ మార్కెట్ నుండి నిష్క్రమించాయి. అయితీ ఈ జాబితాలోనే నష్టాల్లో ఉన్న మోటరోలా, కొన్ని మార్కెట్‌లలో తిరిగి స్థిరపడడంలో విజయం సాధించింది. అదే సమయంలో, HTC, బ్లాక్‌బెర్రీ తిరిగి రావొచ్చనే పుకార్లు కొనసాగుతున్నాయి.
Also Read: 12GB ర్యామ్‌తో టాప్ 5 హై స్పీడ్ స్మార్ట్‌ఫోన్లు.. 2025 మిడ్ రేంజ్‌లో సూపర్ ఫోన్స్ ఇవే..
సోనీ ఇంకా తన స్మార్ట్‌ఫోన్ వ్యాపారాన్ని పూర్తిగా మూసివేస్తున్నట్లు అధికారికంగా ప్రకటించలేదు, కానీ సంకేతాలు స్పష్టంగా ఉన్నాయి. పోటీ తీవ్రతరం అవుతున్న కొద్దీ విక్రయాలు క్షీణిస్తున్న కొద్దీ, సోనీ మొబైల్ బిజినెస్ త్వరలోనే ముగిసిన చరిత్ర కావచ్చు.