Whatsapp : వాట్సప్.. ఈ సోషల్ మెసేజింగ్ యాప్ తో ఉపయోగాలు ఎన్ని ఉన్నాయో మోసపోయే అవకాశాలు కూడా అన్నే ఉన్నాయి. నిజానికి ఈ మధ్యకాలంలో వాట్సాప్ లో జరుగుతున్న మోసాలకి కొదవ లేకుండా పోతుంది. ఫోన్ ఉన్న ప్రతీ ఒక్కరూ ఉపయోగించే వాట్సాప్ ను అడ్డాగా చేసుకొని నేరగాళ్లు రెచ్చిపోతున్నారు. వాట్సప్ తో తేలిగ్గా మోసాలు చేయగలుగుతున్నారు. హానికరమైన లింక్స్ పంపించడం, వీడియో కాల్స్ చేయటం, గ్రూప్స్ లో మోసాలు చేయటం వంటివి చేసి డబ్బులు రాబడుతున్నారు. అయితే వాట్సాప్ లో జరిగే మోసాల కోసం కొంతవరకు మాత్రమే తెలుసు. కానీ తెలియని ఎన్నో మోసాలు ఉన్నాయి.
నిత్యం వాట్సప్ లో ఎన్నో మోసాలు జరుగుతున్నాయి. వీటిపై సాధారణ ప్రజలకు అవగాహన లేక ఎందరో అమాయకులు మోసపోతున్నారు. అసలు వాట్సాప్ ను సైబర్ నేరగాళ్లు అడ్డాగా ఏ విధంగా ఉపయోగించుకుంటారు? మోసాలు ఎలా చేయగలుగుతున్నారు? అనే విషయాన్ని కచ్చితంగా తెలుసుకోవాలి.
వాట్సప్ కాల్ ఫార్వర్డ్ స్కామ్ – ఈ మధ్యకాలంలో ఎక్కువగా వినిపిస్తున్న స్కామ్స్ లో ఇది కూడా ఒకటి. కాల్ చేసి ఫార్వర్డ్ చేయమని చెబుతూ సమాచారాన్ని రాబట్టేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. ఇంకా బాధితుల ఖాతాల నుంచి డబ్బులు కొల్లగొడుతున్నారు.
స్పెషల్ ఆఫర్స్/గిఫ్ట్స్ – ప్రముఖ డిజిటల్ ప్లాట్ఫామ్స్, ఈ కామర్స్ సంస్థలను ఆధారంగా చేసుకుని వాటి పేరుతో కొన్ని లింక్స్ పంపిస్తారు నేరగాళ్లు. ఇవి ఓపెన్ చేస్తే మీకు గిఫ్ట్ లు వస్తాయి అంటూ చెబుతూనే మోసం చేసే ప్రయత్నం చేస్తారు. ఒక లింక్ ఓపెన్ చేయగానే ఒకదానికొకటి లింక్స్ కనిపిస్తూనే ఉంటాయి. ఇలాంటి వాటిని ఓపెన్ చేస్తే ఫోన్ హ్యాక్ అవడంతో పాటు అకౌంట్లో డబ్బులు మొత్తం పోయే అవకాశం ఉంది.
ఫేక్ కాల్స్ – కొందరు అమ్మాయిలు కాల్ చేసి గర్ల్ ఫ్రెండ్స్ లా మాట్లాడే ప్రయత్నం చేస్తారు. కొన్నాళ్లు బంధాన్ని పెంచుకుంటారు. అనంతరం ఇందుకు సంబంధించిన చాటింగ్, కాల్స్ ను భద్రపరుచుకొని అనంతరం బ్లాక్ మెయిల్ కు దిగుతారు.
ఎంప్లాయిమెంట్ స్కామ్స్ – ఉద్యోగం లేని నిరుద్యోగులను ఆసరాగా చేసుకుని స్కామర్స్ రెచ్చిపోతున్నారు. ఉచితంగా శిక్షణ ఇస్తామని చెప్పడంతో పాటు ఉద్యోగం గ్యారెంటీ అంటూ నమ్మించి వాళ్ళ నుంచి డబ్బులు కొల్లగొడుతున్నారు. అడ్మిషన్ ఫీజు, కోర్స్ ఫీజు అంటూ మోసం చేస్తున్నారు. ఇలా డబ్బులు కట్టి మోసపోయిన ఎందరో బాధితులు చివరకు సైబర్ పోలీసులను ఆశ్రయిస్తున్నారు.
గ్రూప్ మోసాలు – వాట్సాప్ గ్రూప్స్ లో తెలిసిన వాళ్లమంటూ చాటింగ్ చేస్తూ గ్రూప్ లో జాయిన్ అవ్వమని చెబుతారు. ఇందుకు సంబంధించిన లింక్స్ సైతం పంపిస్తారు. ఈ లింక్స్ ని ఓపెన్ చేస్తే ఇక ఫోన్ హ్యాక్ అవడం ఖాయం.
ఇలాంటి స్కామ్స్ పట్ల ప్రతీ ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలి. నిత్యం ఉపయోగించే వాట్సాప్ లో జరిగే ప్రతీ విషయాన్ని కచ్చితంగా ఓ కంట కనిపెట్టడం మంచిది. లేదంటే స్కామర్స్ బారినపడి పలు సమస్యలు ఎదుర్కొనే అవకాశం ఉంటుంది.
ALSO READ : 2025లో రాబోతున్న టాప్ మెుబైల్ ఇవే.. ఐఫోన్ 17, సామ్ సాంగ్ S25తో పాటు ఇంకా ఎన్నో!