Top Online Scams : ఆన్లైన్ స్కామ్స్ ప్రతీ చోటా జరుగుతూనే ఉన్నాయి. సైబర్ నేరస్తులు నచ్చినట్టుగా రెచ్చిపోతున్నారు. అమాయకుల్ని మోసం చేసి ప్రతీ చోటా డబ్బులు దండుకుంటున్నారు. ఇండియాలో రోజురోజుకీ ఇలాంటి కేసులు వేగంగా పెరిగిపోతున్నాయి. అయితే అసలు సైబర్ నేరగాళ్లు ఏ విధంగా ట్రాప్ చేస్తారు. అందులో ముఖ్యమైన ఐదు స్కామ్స్ ఏంటో తెలుసుకుందాం.
సైబర్ నేరగాళ్లు ఎక్కువగా ఐదు రకాల స్కామ్స్ తో వలలో వేసుకునే ప్రయత్నం చేస్తున్నారు. అందులో ఒకటి డిజిటల్ అరెస్ట్. ఇంకా మ్యారేజ్ స్మామ్స్, ఇన్వెస్ట్మెంట్ స్కామ్స్, వర్క్ ఫ్రమ్ హోం జాబ్స్, బ్యాంక్ స్కామ్స్ వంటివి ఈ మధ్యకాలంలో ఎక్కువగా జరుగుతున్నాయి. అయితే ఈ స్కామ్స్ లో ఏ విధంగా మోసం చేస్తారో ఒకసారి తెలుసుకుందాం.
డిజిటల్ అరెస్ట్ – ఈ పేరు వింటేనే హడలెత్తిపోతున్నారు. ప్రభుత్వ ఉద్యోగులమంటూ వాట్సాప్ లో వీడియో కాల్స్ చేసి మీ పేరుతో మాదక ద్రవ్యాలకు సంబంధించిన పార్సిల్ వచ్చిందని చెబుతారు. లేదా మీరు పంపించిన పార్సిల్ లో మాదక ద్రవ్యాలు ఉన్నాయని చెబుతారు. ఎక్కడికి కదలొద్దని, ఇంటిలోనే ఉండమని, ఈ విషయాన్ని ఎవరితో షేర్ చేయొద్దని, మీరు డిజిటల్ అరెస్ట్ అయ్యారని చెబుతారు. ఆ విషయాన్ని నమ్మిన అమాయకులు వారు చెప్పినట్టే చేస్తారు. అనంతరం నచ్చినంత డబ్బుల్ని బెదిరించి నేరగాళ్లు తమ ఎకౌంట్లో జమ చేయించుకుంటున్నారు.
మ్యారేజ్ స్కామ్స్ – తరచూ ఈ స్కామ్స్ జరుగుతూనే ఉంటున్నాయి. వాట్సప్ ద్వారా నకిలీ సమాచారాలన్ని మోసగాళ్లు పంపిస్తూ వాటిలో తప్పుడు ఫైల్స్ ను చొప్పిస్తున్నారు. దీంతో ఆ లింకును ఓపెన్ చేయగానే ఫోన్ లోకి మాల్వేర్ ఇన్స్టాల్ అవుతుంది. దీంతో వ్యక్తిగత ఆర్థిక సమాచారాన్ని దొంగలించే అవకాశం ఉంటుంది.
ఇన్వెస్ట్మెంట్ స్కామ్స్ – ఈ స్కామ్స్ వాట్సాప్, టెలీగ్రామ్ ద్వారా ఎక్కువగా జరుగుతున్నాయి. సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ ను ఉపయోగించి పెట్టుబడి పెట్టాలంటూ అధిక రాబడి వస్తుందంటూ నమ్మించి మోసం చేస్తున్నారు. నకిలీ ప్రొఫైల్స్ తో ఇన్వెస్ట్మెంట్ పై అవగాహన ఉన్నట్లు నటిస్తూ నమ్మించి దోచుకుంటున్నారు.
వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ స్కామ్స్ – నిరుద్యోగులే లక్ష్యంగా ఈ స్కామ్స్ జరుగుతున్నాయి. ఈ మధ్యకాలంలో జరుగుతున్న స్కామ్స్ లో వర్క్ ఫ్రం హోం జాబ్స్ ఎక్కువగానే ఉన్నాయి. నకిలీ ఉద్యోగ అవకాశాల్ని చూపిస్తూ శిక్షణ ఇస్తామంటూ, సాఫ్ట్వేర్ కోసం ఫీజులు చూపించమంటూ బాధితులని బెదిరించి డబ్బులు తీసుకుంటున్నారు. ఆపై కనుమరుగు అవుతున్నారు.
బ్యాంక్ స్కామ్స్ – ఇండియాలో ఎక్కువగా జరుగుతున్న స్కామ్స్ లో ఇది ఒకటి. నకిలీ బ్యాంక్ వెబ్సైట్స్, ఫోన్ కాల్స్ ద్వారా బ్యాంక్ కు సంబంధించిన వివరాలను అడిగి తెలుసుకుని డబ్బులు తమ ఖాతాలో వేయించుకుంటున్నారు. బ్యాంక్ కు సంబంధించిన ఓటీపీ వచ్చిందని, మీ బ్యాంక్ అకౌంట్ ను అప్డేట్ చేయమని చెబుతూ ఓటీపీ చెప్పాక ఫోన్ ను హ్యాక్ చేస్తున్నారు.
అందుకే ప్రతీ ఒక్కరూ ఈ స్కామ్స్ విషయంలో అప్రమత్తంగా ఉండాలి. ముఖ్యంగా ఫేక్ కాల్స్ ఎటువంటి పరిస్థితుల్లోనే నమ్మకూడదు. ఫోన్ కి వచ్చే లింక్స్ ను ఓపెన్ చేయకూడదు. అవసరమైతే నమ్మకమైనవారి సలహా తీసుకొని అప్రమత్తమవ్వాలి.
ALSO READ : డీప్‌ఫేక్‌పై మెటా కొరడా.. ఏం చేయబోతోందంటే!