ISRO New Launch Pads| అంతరిక్ష ప్రయోగాల్లో వినూత్నంగా ముందుకు సాగుతున్న భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) తన శక్తి సామర్థ్యాలను మరింత పెంచుకునే ప్రయత్నాల్లో భాగంగా మరో రెండు నూతన లాంచ్ ప్యాడ్లను సమకూర్చుకుంటోంది. తమిళనాడులోని కులశేఖరపట్నంలో, ఆంధ్రప్రదేశ్ లోని శ్రీహరికోటలో వీటిని నిర్మిస్తున్నట్టు ఇస్రో చైర్మన్ వి. నారాయణన్ ధ్రువీకరించారు. వీటిని రెండేళ్లలో అందుబాటులోకి తెచ్చేలా ప్రణాళికలు సిద్ధం చేశారు. వాటి ద్వారా అత్యాధునిక రాకెట్లను ఆకాశంలోకి పంపనున్నారు.
కొత్త లాంచ్ ప్యాడ్లతో ఇస్రో రాకెట్ ప్రయోగ సామర్థ్యం మరింత పెరుగుతుందని చైర్మన్ నారాయణన్ అభిప్రాయపడ్డారు. చంద్రయాన్–4కు సంబంధించి ఆయన కీలక ప్రకటన చేశారు. 2028లో ప్రయోగం చేపట్టనున్నట్లు తెలిపారు. చంద్రయాన్–3 ఉపగ్రహం మొత్తం బరువు 4,000 కిలోలు కాగా, చంద్రయాన్–4 9,200 కిలోలుంటుందని వెల్లడించారు. చంద్రునిపైకి చేరుకొని, అక్కడి నమూనాలను సేకరించి విజయవంతంగా తిరిగి రావడం చంద్రయాన్–4 మిషన్ లక్ష్యం. చంద్రునిపై మన ప్రయోగాల్లో ఇది కీలక మలుపు కానుందని చెబుతున్నారు.
శ్రీహరికోటలో రూ. 3,984.86 కోట్లతో నాలుగేళ్ల వ్యవధిలో పూర్తి చేయాలని కేంద్ర కేబినెట్ గతంలో తీర్మానించింది. ఇది అందుబాటులోకి వస్తే ప్రస్తుతం ఉన్న రెండో లాంచ్ ప్యాడ్కు కీలకమైన బ్యాకప్‌గా నిలవనుంది.
Also Read: చంద్రనిపై నివాసాలకు రెడీ – మరింత మంచు, నీటిని గుర్తించిన భారత్
ఏపీలోని కొత్త లాంచ్ ప్యాడ్ ప్రస్తుతమున్న రెండింటికి మించిన సామర్థ్యాన్ని కలిగి ఉంటుందని కేంద్ర సమాచార శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్ కేబినెట్ ఆమోదం తరువాత తెలిపారు. న్యూ జనరేషన్ లాంచ్ వెహికల్ (ఎన్జీఎల్వీ) ప్రోగ్రామ్ సహా ఇస్రో భవిష్యత్తులో చేపట్లే ప్రతిష్టాత్మక మిషన్లకు ఈ కొత్త లాంచ్ ప్యాడ్ ఎంతో సహాయకారి కానుంది. 2035కల్లా భారతీయ అంతరిక్ష కేంద్రం (బీఏఎస్)ను నెలకొల్పడంతోపాటు 2040కల్లా చంద్రునిపైకి మానవ సహిత యాత్ర చేపట్టాలనే బృహత్ లక్ష్యాలు ఇస్రో ముందున్నాయి. అందుకే, వచ్చే 25, 30 ఏళ్ల అవసరాలను తీర్చేలా ఏర్పాట్లను సిద్ధం చేసుకుంటోంది.
మహిళా శాస్త్రవేత్తలకు ప్రాధాన్యం
అంతరిక్ష ప్రయోగాల్లో పురుషులతో సమానంగా మహిళా సైంటిస్టులకు ప్రాధాన్యం కల్పిస్తున్నట్లు నారాయణన్ పేర్కొన్నారు. చంద్రయాన్, మార్స్ ఆర్బిటర్ మిషన్ ప్రయోగాల్లో మహిళలది కీలక పాత్ర అని ప్రశంసించారు. అమెరికా, భారత్ ఉమ్మడిగా ‘నిసార్’ శాటిలైట్‌ని అభివృద్ధి చేస్తున్నాయన్నారు. దాన్ని జీఎస్ఎల్వీ మార్క్–2 రాకెట్ ద్వారా ప్రయోగించనున్నట్లు తెలియజేశారు. పర్యావరణ మార్పులపై అధ్యయనానికి ఈ ఉపగ్రహం తోడ్పడుతుందన్నారు. వాతావరణ పరిస్థితులపై అధ్యయనానికి జి–20 శాటిలైట్ రూపకల్పనలో ఇస్రో నిమగ్నమైంది. ఇందులో 40 శాతం పేలోడ్లు దేశీయంగా అభివృద్ధి చేసినవే కావడం విశేషం. ఇప్పటిదాకా 34 దేశాలకు చెందిన 433 ఉపగ్రహాలను భారత తయారీ రాకెట్లతో ప్రయోగించినట్టు వి. నారాయణన్ వెల్లడించారు. ఇందులో 90 శాతం ప్రయోగాలు గత పదేళ్లలోనే జరిగాయన్నారు.
20 ఏళ్ల క్రితం ఏర్పాటైన రెండో లాంచ్ ప్యాడ్
భారతీయ అంతరిక్ష రవాణా వ్యవస్థలు పూర్తిగా రెండు లాంచ్ ప్యాడ్లపై ఆధారపడి ఉన్నాయి. పీఎస్ఎల్వీ మిషన్ల కోసం 30 ఏళ్ల క్రితం మొదటి లాంచ్ ప్యాడ్ ఏర్పాటు చేశారు. ప్రస్తుతం దీనిని స్మాల్ శాటిలైట్ లాంచ్ వెహికల్ (ఎస్ఎస్ఎల్వీ) కోసం సైతం వాడుతున్నారు. క్రయోజెనిక్ దశ కారణంగా జీఎస్ఎల్వీ మిషన్ల అవసరాలను ఇది తీర్చలేకపోతోంది. అదే విధంగా.. 20 ఏళ్ల క్రితం ఏర్పాటైన రెండో లాంచ్ ప్యాడ్ జీఎస్ఎల్వీ, ఎల్వీఎం–3 మిషన్ల సేవలందిస్తోంది. చంద్రయాన్–3, గగన్యాన్ మిషన్ల కోసం దీనినే వాడుతున్నారు.