Uranus Moons:- ప్రస్తుతం ప్రపంచ దేశ ఆస్ట్రానాట్స్ అందరూ భూమితో పాటు ఇతర గ్రహాలపై కూడా దృష్టిపెట్టారు. ఏ గ్రహంలో ఎలాంటి మార్పులు జరుగుతున్నాయని ఎప్పటికప్పుడు కనిపెడుతూ ఉంటున్నారు. అలాంటి ప్రయత్నంలో యూరేనస్‌పై నీటిజాడ ఉండే అవకాశం ఉందనే విషయం వారికి అర్థమయ్యింది. ఈ పరిశోధనల్లో వారు మరికొన్ని కొత్త విషయాలు తెలుసుకున్నట్టు తెలుస్తోంది. యూరేనస్ గ్రహంపై ఇంత క్షుణ్ణంగా పరిశోధనలు జరగడం ఇదే మొదటిసారి అని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
వోయాగర్ 2 శాటిలైట్ నుండి సమాచారం ఆధారంగా యూరేనస్‌పై శాస్త్రవేత్తలు పరిశోధనలు చేపట్టారు. యూరేనస్‌లో నాలుగు పెద్ద మూన్స్ ఉంటాయి. ఏరియల్, అంబ్రియల్, టైటానియా, ఒబెరాన్. ఈ నాలుగు మూన్స్‌లో ఉండే మంచుగడ్డల కింద లోతైన సముద్రాలు ఉన్నాయని శాస్త్రవేత్తలు కనిపెట్టారు. ఈ పరిశోధనతో ఎన్నో అద్భుతాలు చేసే అవకాశాలు ఉన్నాయని వారు భావిస్తున్నారు. ఇప్పటివరకు యూరేనస్‌పై కానీ, దాని మూన్స్‌పై కానీ ఇలాంటి పరిశోధనలు జరగలేదని వారు బయటపెట్టారు.
ఒకప్పుడు యూరేనస్‌లో ఉండే వేడి వల్ల దాని మూన్స్‌లో నీరు ఉండే అవకాశం లేదని శాస్త్రవేత్తలు దీనిని పెద్దగా పట్టించుకోలేదు. అయితే ఇప్పుడు ఈ వేడి ఉష్ణోగ్రతలు మూన్స్‌లో ఉండే సముద్రాలను వెచ్చగా ఉంచడానికి ఉపయోగపడుతున్నాయని వారు అంచనా వేస్తున్నారు. ముఖ్యంగా టైటానియా, ఒబెరాన్ మూన్స్‌లోనే ఇలాంటి ప్రక్రియ సాధ్యమని తేల్చారు. యూరేనస్‌లో ఉండే వేడి వాతావరణం వల్ల సముద్రాలకు ఏమీ నష్టం జరగదని వారు నిర్ధారణకు వచ్చారు.
శాస్త్రవేత్తలు చేసిన కంప్యూటర్ మోడల్స్ పరిశోధనల ద్వారా ఈ మూన్స్ నేలపై సముద్రాలకు తగినంత వేడి మాత్రమే ఉండి ఉంటుందని అంచనా వేస్తున్నారు. అసలు ఈ సముద్రాలు ఎలా తయారవుతున్నాయి అని కనిపెట్టగలిగితే యూరేనస్ గురించి, దాని మూన్స్ గురించి మరిన్ని తెలియని విషయాలు తెలుసుకోవచ్చని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. కేవలం యూరేనస్ మాత్రమే కాదు.. ఇతర గ్రహాల మూన్స్ గురించి తెలుసుకోవడానికి కూడా ఈ పరిశోధనల ఉపయోగకరంగా ఉంటుందని వారు భావిస్తున్నారు.