WhatsApp Payments: మనం వాట్సప్‌లో చాటింగ్ చేయడం, ఫొటోలు పంపుకోవడం ఎంత సహజమో.. ఇప్పుడు డబ్బులు పంపడం కూడా అంతే ఈజీ అయిపోయింది. అయితే, కేవలం ఒకరికొకరు డబ్బులు ట్రాన్స్ఫర్ చేసుకోవడంతోనే ఆగిపోకుండా.. వాట్సప్ ఇప్పుడు మరో అడుగు ముందుకు వేయబోతోంది. మనం ఎవరికి డబ్బులు ఇస్తున్నాం? ఎందుకు ఇస్తున్నాం? అనే సందర్భాన్ని బట్టి వాట్సప్ దానంతట అదే అర్థం చేసుకుని పేమెంట్స్ చేసేలా కొత్త ఫీచర్లను తీసుకొచ్చే ప్రయత్నం చేస్తోంది. ముంబైలో జరిగిన గ్లోబల్ ఫిన్‌టెక్ ఫెస్ట్‌లో మెటా సంస్థ ఈ విషయాలను స్పష్టంగా వెల్లడించింది. భారత్‌లో యూపీఐ రంగంలో వాట్సప్ ఇప్పటికే ఏడో అతిపెద్ద ప్లేయర్‌గా నిలవడం విశేషం.
ఇప్పటికే వాట్సప్‌లో యూపీఐ లైట్, బిల్లులు కట్టడం, రెంట్ లేదా ఇతర ఖర్చులు ఫ్రెండ్స్‌తో పంచుకోవడం వంటివి అందుబాటులో ఉన్నాయి. అయితే వీటిని మరింత సులభంగా మార్చాలని మెటా చూస్తోంది. మనం ఎవరితో తరచుగా మాట్లాడుతున్నాం, మన దైనందిన జీవితంలో పేమెంట్స్ రొటీన్ ఎలా ఉంది అనే విషయాలను వాట్సప్ బేస్ చేసుకుంటుంది. దీనివల్ల మనం ఎవరికైనా డబ్బులు పంపాలని అనుకున్నప్పుడు, యాప్ మనకంటే ముందే అర్థం చేసుకుని ఆప్షన్స్ చూపిస్తుంది. అంటే.. ప్రతిసారీ నెంబర్లు కొట్టి, పిన్ నెంబర్ ఎంటర్ చేసే తలనొప్పి తప్పుతుంది.
Also Read: కేవలం 3.8 గ్రాముల బరువు, 50 గంటల బ్యాటరీ లైఫ్.. వివో కొత్త బడ్స్ భారత్‌లో లాంచ్!
టెక్నాలజీ మారుతున్న కొద్దీ యూజర్ల అవసరాలు కూడా మారుతున్నాయి. కేవలం పేమెంట్ గేట్‌వే ఇవ్వడం వేరు, యూజర్ మూడ్ లేదా సిట్యుయేషన్‌కి తగ్గట్టుగా పేమెంట్ ప్రాసెస్ చేయడం వేరు. మనం చేసే చాటింగ్, మన గ్రూప్స్, మన అవసరాలను బట్టి నెక్స్ట్ పేమెంట్ ఏంటో వాట్సప్ ముందే ఊహించగలదు. ఉదా: వీకెండ్ పార్టీ బిల్లులు షేర్ చేసుకోవడం లేదా మంత్లీ రెంట్ ఇవ్వడం వంటి వాటిని వాట్సప్ తనంతట తానుగా గుర్తుచేస్తుంది. దీనివల్ల లావాదేవీలు చాలా వేగంగా, ఎలాంటి తప్పులు లేకుండా పూర్తవుతాయి.
భారతదేశంలో వాట్సప్ వాడని స్మార్ట్‌ఫోన్ యూజర్ ఉండరంటే అతిశయోక్తి కాదు. ఈ భారీ యూజర్ బేసే మెటాకు అతిపెద్ద ప్లస్ పాయింట్. ఆల్రెడీ పేమెంట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా సెట్ అయి ఉంది కాబట్టి.. దానిని మన రోజువారీ చాటింగ్ అనుభవాలతో అనుసంధానించడమే ఇప్పుడున్న టాస్క్. ఈ టెక్నాలజీని కనుక వాళ్లు పర్ఫెక్ట్‌గా ఇంప్లిమెంట్ చేస్తే.. ఇకపై మనీ ట్రాన్సాక్షన్స్ చేయడం అనేది మెసేజ్ పంపినంత సింపుల్ అయిపోతుంది.
రాబోయే రోజుల్లో వాట్సప్ కేవలం ఒక మెసేజింగ్ యాప్‌గా మాత్రమే కాకుండా.. ఒక కంప్లీట్ ఫైనాన్షియల్ హబ్‌లా మారుతుందనడంలో ఎలాంటి సందేహం లేదు. టెక్నాలజీని సామాన్యుడికి మరింత చేరువ చేసేలా ఈ ‘ప్రోగ్రామబుల్ పేమెంట్స్’ ఉండబోతున్నాయి. భవిష్యత్తులో మనం చేసే ప్రతి ఆర్థిక లావాదేవీని మరింత స్మార్ట్‌గా, సురక్షితంగా మార్చేందుకు వాట్సప్ సిద్ధమవుతోంది. మరి ఈ కొత్త ఫీచర్లు మన రోజువారీ జీవితాన్ని ఎంతవరకు ఈజీ చేస్తాయో వేచి చూడాలి.
Also Read: వాట్సప్‌లో చలాన్ మెసేజ్ వచ్చిందా? ఆ లింక్ క్లిక్ చేశారో.. మీ బ్యాంక్ ఖాతా ఖాళీ!