Crab Shell Battery: ఆహారంలో భాగమైన పీతలను తిన్న తర్వాత.. వాటి మందపాటి షెల్స్ ను చెత్తబుట్టలో పారేస్తుంటారు. కానీ అమెరికాలోని మేరీల్యాండ్ విశ్వవిద్యాలయ శాస్త్రవేత్తలు.. ఈ వ్యర్థాల ఆధారంగా పర్యావరణానికి హాని చేయని ఒక వినూత్న బ్యాటరీని తయారు చేశారు. క్రస్టేషియన్ పొట్టు నుండి తీసిన ‘చిటోసన్’ (Chitosan) అనే పదార్థాన్ని ఉపయోగించి జింక్ ఆధారిత బ్యాటరీలో ‘ఎలక్ట్రోలైట్’ను రూపొందించారు.
ప్రస్తుతం పునరుత్పాదక విద్యుత్‌ను నిల్వ చేయడానికి ఉపయోగిస్తున్న సంప్రదాయ బ్యాటరీల వల్ల పర్యావరణానికి తీవ్ర ముప్పు పొంచి ఉంది. బ్యాటరీ పాడైపోయిన తర్వాత అందులోని పాలిప్రొపీలిన్, పాలి కార్బోనేట్ వంటి సింథటిక్ విభాగాలు దశాబ్దాలు లేదా శతాబ్దాల తరబడి ప్లాస్టిక్ వ్యర్థాలుగా భూమిలోనే ఉండిపోతాయి. ఈ సమస్యను తగ్గించేందుకే మేరీల్యాండ్ పరిశోధకులు సహజసిద్ధంగా కుళ్లిపోయే (బయోడిగ్రేడబుల్) ప్రత్యామ్నాయ పదార్థాలపై దృష్టి సారించారు. సీఫుడ్ పరిశ్రమ నుండి టన్నుల కొద్దీ వెలువడే రొయ్యల షెల్స్ వ్యర్థాలను దీనికి ముడిసరుకుగా ఎంచుకున్నారు.
ఈ ప్రయోగంలో శాస్త్రవేత్తలు లిథియంకు బదులుగా జింక్ లోహాన్ని ప్రధాన మూలకంగా వాడారు. సాధారంగా జింక్ భూమిపై విస్తృతంగా లభించడమే కాకుండా, తక్కువ ఖర్చుతో కూడుకున్నది. పైగా ఎంతో సురక్షితమైనది. అయితే ప్రయోగంలో భాగంగా పీతల పెంకుల నుండి సేకరించిన చిటోసన్‌ను జెల్ ఎలక్ట్రోలైట్‌గా మార్చి ఈ జింక్ బ్యాటరీలో అమర్చారు. కాగా ఎలక్ట్రోలైట్ అనేది బ్యాటరీ పనిచేస్తున్నప్పుడు అయాన్ల కదలికకు తోడ్పడే కీలకమైన భాగం.
ప్రయోగశాలలో నిర్వహించిన పరీక్షల్లో ఈ కొత్త బ్యాటరీ అసాధారణ పనితీరును కనబరిచింది. 1,000 సార్లు ఛార్జింగ్, డిశ్చార్జింగ్ చేసిన తర్వాత కూడా ఇది 99.7% విద్యుత్ సామర్థ్యాన్ని నిలబెట్టుకుంది. ఇక బ్యాటరీ జీవితకాలం పూర్తయ్యాక చిటోసన్ ఎలక్ట్రోలైట్ కేవలం ఐదు నెలల వ్యవధిలోనే సూక్ష్మజీవుల ద్వారా పూర్తిగా మట్టిలో కలిసిపోయింది. బ్యాటరీలోని మొత్తం భాగాలలో దాదాపు మూడింట రెండు వంతులు సులభంగా జీవవిచ్ఛిత్తి చెందుతాయని పరిశోధకులు స్పష్టం చేశారు.
Also Read: బంగ్లాదేశ్‌లో హిందూ సాధువు తీవ్ర భావోద్వేగం.. దేవుడి పాదాలు తాకి కన్నీటి పర్యంతం!
ఈ సాంకేతికత ఇంకా పరిశోధనా దశలోనే ఉన్నప్పటికీ సౌర, పవన విద్యుత్ ప్లాంట్లలో పెద్ద ఎత్తున గ్రిడ్ నిల్వ స్థావరాల ఏర్పాటుకు ఇది ఎంతగానో ఉపయోగపడనుంది. బ్యాటరీ కేవలం పనిచేసేటప్పుడే కాకుండా అది పాడైపోయిన తర్వాత పర్యావరణానికి ఎలాంటి హాని తలపెట్టకూడదనే కోణంలో ఈ ప్రయోగం ఒక కొత్త ఆలోచనకు శ్రీకారం చుట్టింది. ఈ ప్రయోగం సీఫుడ్ వ్యర్థాన్ని ఒక విలువైన శక్తి వనరుగా మార్చడమే కాకుండా నిలకడైన ఇంధన నిల్వ సాంకేతికతకు ఇది మార్గం సుగమం చేస్తోందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
Also Read: జియో దుమ్మురేపే ప్లాన్.. రూ.899 కే 90 రోజుల వ్యాలిడిటీ.. 5G డేటా, ఓటీటీ, ఫ్రీ కాల్స్!