వాయుగుండం.. ఈ పదం వింటేనే తూర్పు తీర ప్రాంతాల ప్రజల గుండెల్లో రైళ్లు పరిగెడతాయి. అది ఎక్కడ బలపడి తుఫాన్‌గా మారి.. అతలాకుతలం చేస్తుందో అనే భయం వెంటాడుతుంది. రైతులు, మత్స్యకారులకైతే ఇది పెద్ద గండం కింద లెక్క. తాజాగా ఆంధ్రప్రదేశ్‌లో అర్నబ్ తుఫాన్ ఎంత బీభత్సం సృష్టించిందో తెలిసిందే. అది మిగిల్చిన విషాదం నుంచి ఇంకా కోలుకోక ముందే.. మరో తుఫాన్ సిద్ధమైపోతుంది. కొంచెం కూడా గ్యాప్ ఇవ్వకుండా.. దాడి చేయడానికి సిద్ధమైపోతుంది. అది ఎప్పుడు.. ఎక్కడ తీరం దాటుతుందో ఇప్పట్లో చెప్పలేం. ఎందుకంటే.. తుఫాన్ ఊహించినట్లుగా ఉండదు. దాని మూడ్ మారితే బలహీనం అవుతుంది. లేదా మరింత బలపడి విరుచుకుపడుతుంది. ఇలా వరుస తుఫాన్లు వెంటాడటం చూసి.. ఈ బంపర్ ఆఫర్ మాకే ఎందుకు? పశ్చిమంలో ఉన్న అరేబియా మహా సముద్రంలో ఏర్పడొచ్చు కదా అని చాలామంది భావిస్తారు. అయితే, అక్కడ తుఫాన్లు ఏర్పడేందుకు అవసరమైన పరిస్థితులు తక్కువ. బంగాళాఖాతానికి.. అరేబియా మహా సముద్రంలో ఉన్న పరిస్థితులకు చాలా వ్యత్యాసం ఉంది.
తుఫాన్ ఏర్పడటానికి ముందు.. చిన్నగా అల్పపీడనం ఏర్పడుతుంది. అది క్రమేనా బలపడి వాయుగుండం మారుతుంది. అది క్రమేనా తీవ్రమైన తుఫానుగా మారుతుంది. సముద్రంలో ఉన్నంత సేపు ఇది చాలా భయానకంగా ఉంటుంది. ముఖ్యంగా బంగాళాఖాతంలో ఏర్పడే తుఫాన్లు మరింత గంభీరంగా ఉంటాయి. దారం తెగిన గాలిపటంలో ఈ తుఫాన్ ఎటు వెళ్తుంటో ముందుగా పసిగట్టలేం. అయితే, తీరానికి కొన్ని వందల దూరంలో ఉన్నప్పుడు ఒక స్పష్టమైన అంచనా వస్తుంది. దాని వల్ల ప్రభుత్వం వెంటనే అప్రమత్తమై ప్రాణ నష్టం లేకుండా జాగ్రత్త పడగలుగుతుంది. అయితే, అన్ని ఏర్పాట్లు చేశాక.. తుఫాన్ అక్కడే తీరం దాటుతుందని చెప్పలేం. ఒక్కోసారి దిశ మార్చుకుని ఊహించని చోట కూడా తీరం దాటొచ్చు. అందుకే, తుఫాన్ హెచ్చరికలు రాగానే.. ఆంధ్రప్రదేశ్, ఒడిశా, పశ్చిమ బెంగాల్, తమిళనాడు ప్రభుత్వాలు అప్రమత్తంగా ఉంటాయి.
బంగాళాఖాతంలో ఇంత భయానక తుఫాన్లు ఉంటే.. అరేబియా సముద్రం ఎందుకు అంత ప్రశాంతంగా ఉంటుందనే సందేహం చాలామందిలో ఉంటుంది. భారత దేశాన్ని మూడువైపులా సముద్రం చుట్టి ఉన్నా.. బంగాళాఖాతంలో మాత్రమే తుఫాన్లు ఏర్పడటానికి కారణం.. సముద్రపు నీటి ఉష్ణోగ్రతలు. దీనికి తోడు గాలుల దిశ.. సముద్రపు లోతుల్లో నీటి కదలికలు, వాతావరణంలోని తేమ, గాలి కోత, భౌగోళిక పరిస్థితులు.
మన ఇండియాకు తూర్పున బంగాళాఖాతం, పశ్చిమాన అరేబియా మహా సముద్రం ఉంటాయి. అయితే, వీటి భౌగోళిక నిర్మాణంలో చాలా తేడాలున్నాయి. బంగాళాఖాతం మూడు వైపులా భూగాలతో చుట్టబడి ఉంటుంది. పశ్చిమాన ఇండియా, ఉత్తరాన బంగ్లాదేశ్, పశ్చిమ బెంగాల్, తూర్పున మయన్మార్ భూభాగాలు ఉంటాయి. దక్షిణం వైపు హిందూ మహాసముద్రంతో కలిసి ఉంటుంది. ఇక అరేబియా సముద్రమైతే.. పశ్చిమంలో అరేబియా దేశాల భూభాగాలు, ఉత్తరాన పాకిస్తాన్, తూర్పున ఇండియా, దక్షిణాన హిందూ మహా సముద్రంతో కలిసి ఉంటుంది. ఈ భౌగోళిక పరిస్థితులు సముద్రపు నీటి కదలికలు, తేమ, గాలలుపై ప్రభావం చూపుతాయి. దీనికి సముద్రపు ఉష్ణోగ్రతలు, గాలులు కూడా తోడయితే తుఫాన్లు ఏర్పడతాయి. ముఖ్యంగా సముద్రపు ఉపరితల ఉష్ణోగ్రతలు ఈ విషయంలో కీలక పాత్ర పోషిస్తాయి. బంగాళాఖాతంలో ఈ ఉష్ణోగ్రత కనీసం 26.5 డిగ్రీల సెల్సియస్, అంత కంటే ఎక్కువగా ఉంటుంది. దీనివల్ల సముద్రపు నీరు వేడిగా ఉంటుంది. ఈ వేడి నీరు తుఫాన్లకు అవసరమైన అందిస్తుంది.
సూర్యుడి వేడి వ్లల సముద్రపు ఉపరితలంపై ఉండే నీరు ఆవిరిగా మారి.. పైకి వెళ్తుంది. అక్కడ ఆ ఆవిరి చల్లబడి మేఘాలుగా మారుతుంది. ఇలా మేఘాలు ఏర్పడే సమయంలో నీటిలో దాగిన వేడి బయటకు విడుదల అవుతుంది. ఈ వేడి.. గాలిని మరింత తేలికగా మార్చి పైకి వెళ్లేలా చేస్తుంది. దీనివల్ల కింద ఉన్న ప్రాంతంలో గాలి పీడనం తగ్గుతుంది. ఇదే అల్పపీడనం మరింత బలపడేందుకు సహకరిస్తుంది. ఇలా ఏర్పడిన అల్పపీడనం చుట్టూ గాలులు వేగంగా తిరుగుతూ లోపలికి ప్రవేశిస్తాయి. తేమతో కూడిన ఈ గాలి మేఘాలను బలోపేతం చేస్తాయి. అది క్రమేనా బలపడి వాయుగుండంగా మారుతుంది. ఆ తర్వాత తుఫానుగా రూపాంతరం చెందుతుంది. అరేబియా సముద్రంలో నీరు కూడా వెచ్చగానే ఉంటుంది. కానీ, బంగాళాఖాతంతో పోల్చితే తక్కువ. అక్కడి వాతావరణ పరిస్థితులు తుఫాన్ల పెరుగుదలకు అనుకూలంగా ఉండవు. అందుకే.. అరేబియా సముద్రంలో ఒక తుఫాన్ ఏర్పడే సమయానికి.. బంగాళాఖాతంలో నాలుగు తుఫాన్లు ఏర్పడగలవు.
తుఫాన్లకు మరో కారణం.. బంగాళాఖాతంలో కలిసి నదులు. సముద్రంతో పోల్చితే.. ఈ నీరు చాలా స్వచ్ఛమైనది. గంగా, బ్రహ్మపుత్ర, మయన్మార్ నుంచి వచ్చే ఇరావడ్డీ నదులు భారీ మొత్తంలో బంగాళాఖాతంలో కలుస్తాయి. దానివల్ల సముద్రంలో లవణీయత (ఉప్పదనం) తగ్గుతుంది. ఫలితంగా ఆ మంచి నీరంతా సముద్రం మీద తేలుతూ పొరలా ఏర్పడుతుంది. ఎందుకంటే.. ఉప్పు తక్కువగా ఉండే నీటి సాంద్రత.. ఉప్పు నీటి కంటే చాలా తక్కువగా ఉంటుంది. అందుకే, సముద్రం నీటితో పూర్తిగా కలిసిపోకుండా పొరలా పై భాగంలోనే తేలుతుంది. సాధారణంగా తుఫాన్ ఏర్పడినప్పుడు సముద్రంపై బలమైన గాలులు వీస్తాయి. ఈ గాలుల వల్ల సముద్రం పైభాగంలోని నీటి కింద ఉండే చల్లటి నీటితో కలుస్తుంది. అప్పుడు సముద్రపు ఉపరితల ఉష్ణోగ్రత తగ్గుతుంది. దీంతో తుఫానుకు లభించే శక్తి కూడా తగ్గిపోతుంది. కానీ, బంగాళాఖాతంలో ఉండే మంచి నీటి పొర వల్ల అది సాధ్యం కాదు. దాని వల్ల చల్లటి నీరు పైకి రాదు. ఫలితంగా తుఫాన్ సమయంలో ఉపరితలంపై వెచ్చని నీరు అలాగే ఉండిపోంది. అది తుఫాన్ మరింత బలపడేందుకు అవసరమైన వేడి నీటిని అందిస్తుంది.
జూన్ నుంచి సెప్టెంబర్ నెలల్లో ఏర్పడు రుతుపవనాలు అరేబియా సముద్రాన్ని ప్రశాంతంగా ఉంచుతాయి. ఈ సమయంలో అరేబియా సముద్రం నుంచి ఇండియా వైపు బలమైన గాలులు వీస్తాయి. ఇది సముద్రపు ఉపరితలంపై నీటిని కదుపుతుంది. దానివల్ల సముద్రంలోని చల్లటి నీరు పైకి వస్తుంది. ఫలితంగా సముద్రపు ఉపరితల ఉష్ణోగ్రత తగ్గుతుంది. అదే సమయంలో గాలి వేగం, దిశల్లో మార్పులు వస్తాయి. దీన్నే గాలి కోత అంటారు. ఇది ఎక్కువగా ఉన్నప్పుడు తుఫాన్ పై భాగం, కింది భాగం ఒకే దిశలో కదలవు. దానివల్ల తుఫాన్‌కు అవసరమైన నిలకడ దెబ్బతిని.. మేఘాలుగానే మిగిలిపోతాయి. అయితే, రుతుపవనాలు ముగిసిన తర్వాత పరిస్థితులు మారి, గాలికోత తగ్గి సముద్రం నీరు వెచ్చగా మారితే.. అరేబియాలో కూడా తుఫాన్లు ఏర్పడతాయి.
కొన్నిసార్లు పశ్చిమ పసిఫిక్ మహాసముద్రంలో ఏర్పడే తుఫాన్లు కూడా బంగాళాఖాతంపై ప్రభావం చూపుతాయి. అక్కడ ఏర్పడిన తుఫాన్లు ఆగ్నేయా ఆసియా దేశాల మీదుగా ప్రయాణించి.. బలహీనమై అల్పపీడనంగా బంగాళాఖాతంలో కలుస్తాయి. అక్కడ వాటికి తగిన వాతావరణం ఏర్పడితే అవి మళ్లీ బలపడి తుఫాన్లుగా మారుతాయి.
తుఫాన్లు ఏర్పడటంలో భూమి భ్రమణం కూడా కీలక పాత్ర పోషిస్తుంది. భూభ్రమణం కారణంగా గాలుల కదిలికలపై పడే ప్రభావాన్ని కోరియోలిస్ ప్రభావం అంటారు. ఉత్తరార్ధగోళంలో తుఫాన్లు అపసవ్య దిశలో తిరుగుతాయి. దక్షిణార్ధగోళంలో సవ్య దిశలో తిరుగాయి. అయితే.. భూమధ్య రేఖకు అతి సమీపంలో కోరియోలిస్ ప్రభావం చాలా తక్కువ. అందుకే అక్కడ సాధారణంగా ఉష్ణమండలం తుఫాన్లు ఏర్పడవు. తుఫాన్లు రావాలంటే భూమధ్య రేఖకు కనసీం 5 డిగ్రీల అక్షాంశాల దూరంలో ఉండాలి. బంగాళాఖాతం, అరేబియా సముద్రం ఈ అక్షాంశాల్లోనే ఉన్నాయి. అయితే, కోరియోలిన్ ప్రభావం తుఫాన్లు ఏర్పడేందుకు కారణం కాదు. కేవలం తుఫాన్‌కు అవసరమైన భ్రమణాన్ని కల్పించడానికే ఇది ఉపయోగపడుతుంది.
Also Read: ఆర్గానిక్ అంత్యక్రియలు.. చనిపోయిన తర్వాత డెడ్ బాడీని ఏం చేస్తారంటే..
బంగాళఖాతంలోనే ఎప్పుడూ తుఫాన్లు వస్తాయా? అరేబియా సముద్రంలో రావా అని అనుకోవద్దు. గతంలో చాలాసార్లు ఈ సముద్రంలో తుఫాన్లు ఏర్పడ్డాయి. భారీ నష్టాలను కూడా మిగిల్చాయి. 2021లో అరేబియా సముద్రంలో ఏర్పడిన తౌక్టే తుఫాన్.. గుజరాత్ తీరాన్ని దాటే సమయంలో భారీ గాలులు, వర్షాలతో విరుచుకుపడింది. అలాగే 2023లో బిపార్జోయ్ తుఫాన్ కూడా గుజరాత్, పాకిస్తాన్ మీదుగా తీరం దాటింది. అరేబియా సముద్రంలో ఏర్పడితన అత్యంత శక్తివంతమైన తుఫాన్.. గోను. 2007లో ఏర్పడిన ఈ తుఫాన్ ఓమన్‌ను అతలాకుతలం చేసింది. అయితే, ఈ సముద్రంలో.. బంగాళాఖాతంలో వచ్చినట్లుగా ఏటా తుఫాన్లు ఏర్పడవు. ఒక వేళ ఏర్పడినా.. అవి ఎక్కువగా గుజరాత్ వైపు గానీ, అరేబియా దేశాల వైపు గానీ తీరం దాటుతుంటాయి.