YouTube Premium: ప్రతిరోజూ ఫోన్‌లో యూట్యూబ్ ఓపెన్ చేయగానే కనిపించేది అదే రెడ్ కలర్ లోగో. ఇన్నాళ్లూ ఒకే లుక్‌లో ఉన్న యూట్యూబ్ యాప్‌కు ఇక కొత్త కళ రాబోతోంది. యూజర్లకు కాస్త కొత్త అనుభూతిని ఇచ్చేందుకు యూట్యూబ్ ఓ సరికొత్త ఫీచర్‌ను తీసుకొస్తోంది. ఇకపై యూట్యూబ్ ప్రీమియం సబ్‌స్క్రైబర్లు తమకు నచ్చిన డిజైన్‌లో యాప్ ఐకాన్‌ను మార్చుకోవచ్చు. ఆండ్రాయిడ్, ఐఓఎస్ యూజర్లకు అందుబాటులోకి వస్తున్న ఈ ఫీచర్‌లో పాత లోగోకు బదులుగా కొత్త కొత్త డిజైన్లను ఎంచుకునే అవకాశం ఉంటుంది.
ప్రస్తుతం ఈ కస్టమైజేషన్ ఆప్షన్ కొంతమంది యూట్యూబ్ ప్రీమియం యూజర్లకు మాత్రమే అందుబాటులోకి వచ్చింది. మీ ఫోన్‌లో ఈ ఫీచర్ వచ్చిందో లేదో తెలుసుకోవాలంటే యూట్యూబ్ యాప్ ఓపెన్ చేసి Settings > General > Premium app icon విభాగంలోకి వెళ్లి చెక్ చేసుకోవచ్చు. అక్కడ పాత రెడ్ అండ్ వైట్ ప్లే బటన్‌కు బదులుగా కొత్త డిజైన్లు కనిపిస్తాయి.
సోషల్ మీడియాలో కొందరు యూజర్లు షేర్ చేసిన స్క్రీన్‌షాట్లను బట్టి చూస్తే ఈ కొత్త ఐకాన్లు చాలా క్రియేటివ్‌గా ఉన్నాయి. ఒకటి మెరుస్తున్న సిల్వర్ ప్లే బటన్ లాగా ఉంటే, మరొకటి రెడ్ పెయింట్ బ్రష్‌తో గీసినట్లు కనిపిస్తోంది. ఇంకొకటి పిక్సెల్ ఎఫెక్ట్‌తో గ్రేడియంట్ ఫినిష్ కలిగి ఉంది.
Also Read: రూ.1.30 లక్షల iPhone 17 Pro ఇప్పుడు రూ.80 వేల లోపే.. ఈ ఆఫర్ ఎలా పొందాలంటే?
యూట్యూబ్ బీటా వెర్షన్‌లో మొత్తం ఏడు రకాల డిజైన్లను గుర్తించారు. వీటిలో పాత రోజులను గుర్తుచేసే రెండు రెట్రో ఐకాన్లు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నాయి. ఒకటి యూట్యూబ్ ప్రారంభంలో ఉన్న ఒరిజినల్ లోగో కాగా, మరొకటి తొలినాళ్ల ఐఫోన్లలో కనిపించే పాత కాలపు టీవీ ఆకారంలో ఉన్న ఐకాన్.
ఈ సరికొత్త కస్టమైజేషన్ ఫీచర్ కేవలం యాక్టివ్ యూట్యూబ్ ప్రీమియం సబ్‌స్క్రిప్షన్ ఉన్నవారికి మాత్రమే పనిచేస్తుంది. ప్రస్తుతం కంపెనీ దీనిని దశలవారీగా విడుదల చేస్తోంది. కాబట్టి మీ యాప్ సెట్టింగ్స్‌లో ఈ ఆప్షన్ ఇంకా కనిపించకపోతే కంగారు పడాల్సిన పనిలేదు. త్వరలోనే అందరికీ ఈ అప్‌డేట్ వచ్చే అవకాశం ఉంది.