ChatGPT Anniversary: ఒకప్పుడు AI అంటే.. హాలీవుడ్ సినిమాల్లో కనిపించే రోబోలు సైన్స్ ఫిక్షన్ కథల్లో మాత్రమే ఉండే టెక్నాలజీ అనుకునేవాళ్లం. కానీ 2022లో పరిస్థితి మారిపోయింది. నవంబర్ 30, 2022 OpenAI సంస్థ ChatGPTని సాధారణ ప్రజలకు అందుబాటులోకి తీసుకొచ్చింది. ChatGPT వచ్చిన తర్వాత జరిగిన మొదటి సంచలనం ఏంటంటే.. కేవలం 5 రోజుల్లోనే 10 లక్షల మంది యూజర్లు. ఒక కొత్త టెక్నాలజీకి ఇంత వేగంగా జనాలు కనెక్ట్ అవడం అప్పట్లో పెద్ద సంచలనంగా మారింది. Netflixకి 10 లక్షల యూజర్లు రావడానికి 3 ఏళ్లకు పైగా పట్టింది. అదే Facebookకి 10 నెలలు Instagramకి దాదాపు రెండున్నర నెలలు పట్టింది. కానీ ChatGPTకి మాత్రం 5 రోజుల్లోనే 10 లక్షల మంది యూజర్లు వచ్చారు. రెండు నెలల్లోనే 10 కోట్ల మంది యూజర్లు వచ్చి రికార్డు సృష్టించింది.
గూగుల్‌లో మనం ఏదైనా వెతికితే.. మనకు చాలా వెబ్‌సైట్ లింకులు కనిపిస్తాయి. కానీ ChatGPTలో నాకు ఇది కావాలి అని అడిగితే మనతో మాట్లాడుతున్నట్టే సమాధానం ఇస్తుంది. కథ కావాలా..? రాస్తుంది. కవిత కావాలా..? రాస్తుంది. లెటర్ కావాలా..? తయారు చేస్తుంది. కోడింగ్ కావాలా..? కోడ్ ఇస్తుంది. కష్టమైన విషయం అర్థం కావడం లేదా..? దాన్ని సింపుల్‌గా చెప్పమంటే సింపుల్‌గా చెబుతుంది. అంటే సెర్చ్ నుంచి సంభాషణ వైపు టెక్నాలజీ టర్న్ తీసుకుంది.
ఇక అక్కడి నుంచి మొదలైంది అసలు AI రేస్. Google.. Microsoft.. Meta లాంటి టెక్ దిగ్గజాలు తమ AI టెక్నాలజీపై మరింత ఫోకస్ పెట్టాయి. ఈరోజు మనం AIతో.. ఫొటోలు తయారు చేస్తున్నాం వీడియోలు క్రియేట్ చేస్తున్నాం కంటెంట్ రాస్తున్నాం.. చదువుకుంటున్నాం కోడింగ్ చేస్తున్నాం రోజువారీ పనుల్లో సాయం తీసుకుంటున్నాం. ఇదంతా చూస్తుంటే.. AI ఇక భవిష్యత్తు టెక్నాలజీ కాదు. మన జీవితంలో భాగమైపోయింది. అలా ఒక చాట్‌బాట్‌గా మొదలైన ChatGPT ప్రపంచం టెక్నాలజీని చూసే విధానాన్నే మార్చేసింది. 2022 నవంబర్ 30న మొదలైన ఈ ప్రయాణం ఇప్పుడు కోట్లాది మంది జీవితాల్లో భాగమైంది. అందుకే నవంబర్ 30 అంటే ChatGPT పుట్టినరోజు మాత్రమే కాదు. సాధారణ మనిషి చేతిలోకి AI వచ్చిన రోజుగా గుర్తుండిపోయే రోజు.
Also read: ట్రేడ్ లైసెన్స్ రెన్యూవల్‌పై వ్యాపారులు ఫైర్.. జరిమానాలు తప్పవా..?