
Abdul Razzaq : వన్డే వరల్డ్ కప్ 2023లో పాకిస్తాన్ ప్రదర్శనపై సీనియర్లు తీవ్ర విమర్శలు గుప్పిస్తున్నారు. అందరూ రకరకాలుగా మాట్లాడుతున్నారు. ఎప్పుడూ జెంటిల్మెన్ గా ఉండే వసీం అక్రమ్ కి ఒళ్లు మండి ఒకొక్కరు 8 కేజీల మటన్ తినేలా ఉన్నారు. ఆడటానికేమైంది? అని గట్టిగానే మందలించాడు. ఇక అక్కడ నుంచి అందరి గొంతులు లేచాయి.
పాకిస్థాన్ ఓటమిపై మాజీ ఆటగాళ్లు షాహీద్ అఫ్రిదీ, ఉమర్ గుల్, అబ్దుల్ రజాక్ ఒక చర్చా కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా రజాక్ మాట్లాడుతూ.. పాకిస్థాన్ క్రికెట్ బోర్డు ఉద్దేశం సరిగా లేదని అన్నాడు. ఆటగాళ్లలో గెలవాలనే పట్టుదల ఏ కోశానా లేదని అన్నాడు.
నేను పాక్ జట్టుకు ఆడే సమయంలో యూనిస్ ఖాన్ కెప్టెన్‌గా ఉండేవాడు. అతడి నుంచి. సహచరుల నుంచి ఎప్పుడూ స్పూర్తి పొందుతూ ఉండేవాడిని. అది బాబర్ లో లోపించిందని అన్నాడు. మిగిలిన ఆటగాళ్లకు స్ఫూర్తి ఇవ్వాల్సింది పోయి..ఈయన వారి చేతిలో కీలుబొమ్మలా మారాడని విమర్శించాడు.
క్రికెట్‌ను మెరుగుపర్చాలని పాకిస్థాన్ క్రికెట్ బోర్డుకు ఏమాత్రం లేదు. అలాంటప్పుడు అనుకున్న ఫలితాలు ఎలా వస్తాయి? అని అన్నాడు. ఇప్పుడే ఇక్కడికి ఐశ్వర్యారయ్ ని తీసుకొచ్చాడు. నేను తనని పెళ్లి చేసుకోవడం వల్ల అందమైన పిల్లలు పుడతారని అనుకుంటే అది ఎప్పటికీ జరగదు కదా. ఎందుకంటే ఆమెను నేను పెళ్లి చేసుకోలేను. అది జరిగే పని కూడా కాదు. ఈ మాటకి చర్చలో పాల్గొన్న మిగిలిన ముగ్గురూ నవ్వడం ఇండియన్స్ కి ఆగ్రహం తెప్పించింది.
బోర్డు కూడా నాకు అందమైన, అద్భుతమైన టీమ్ కావాలని అనుకుంటే సరిపోదు. ప్రయత్నించాలి. అదే జరగడం లేదు.
నేనూ ఐశ్వర్యను పెళ్లి చేసుకోవాలని అనుకున్నా.. ప్రయత్నించాలి కదా అన్నాడు. ఏమీ లేకుండా ఏదేదో అనుకుంటూ కాగితాల మీద లెక్కలేసుకుంటే అయ్యే పనికాదని అన్నాడు.
ఇప్పుడు ఈ అంశంపై తీవ్ర ట్రోలింగ్ నడుస్తోంది. ముందు మీ క్రికెట్ బోర్డునెలా బాగు చేయాలో, జట్టుకెలా నేర్పించాలో అది ఏడవకుండా, ఐశ్వర్యారాయ్ ని ఎందుకు లాగుతారని నెటిజన్లు సీరియస్ అవుతున్నారు.
ఆడవాళ్ల మీద మర్యాద లేదా? మీ ఇంట్లో వాళ్లని అంటే నువ్వు ఇలాగే ఊరుకుంటావా? అని మరొకరు రివర్స్ కౌంటర్ వేస్తున్నారు. రజాక్ రోజురోజుకీ నీ స్థాయి దిగజారుతోంది. ఇలా చెప్పడానికి సిగ్గుపడాలి. అంటూ ఓ నెటిజన్ కామెంట్ చేశాడు. నీ పరువు నువ్వే తీసుకుంటున్నావ్. అని ఒక పెద్దాయన విమర్శించాడు.
పాకిస్తాన్ కెప్టెన్ మీదో, టీమ్ మీదో, ఎవరొకరి మీదో ముందు యాక్షన్ తీసుకోండ్రా బాబూ. లేకపోతే సీనియర్స్ గోల ఎక్కువైపోయిందని మరొకరు కామెంట్ చేశారు.