AFG Fans Celebrations: ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ 2025 టోర్నీలో అసలు సిసలైన మ్యాచ్ బుధవారం రోజు జరిగింది. ఇప్పటివరకు జరిగిన మ్యాచ్ లు అన్నీ ఒక లెక్క అయితే.. ఇంగ్లాండ్ వర్సెస్ ఆఫ్ఘనిస్తాన్ మధ్య జరిగిన పోరు మరో లెక్క. చిన్న టీమ కదా ఈజీగా గెలుస్తాం అనుకున్న ఇంగ్లాండ్ ప్లేయర్లను ముప్పు తిప్పలు పెట్టి మూడు చెరువుల నీళ్లు తాగించారు ఆఫ్ఘనిస్తాన్ ప్లేయర్లు. తనకంటే బలమైన ఇంగ్లాండ్ జట్టును ఓడించడమే కాకుండా ఛాంపియన్స్ ట్రోఫీ నుండి బయటికి పంపించేసింది ఆఫ్గనిస్తాన్.
లాహోర్ లోని గడాఫీ స్టేడియం వేదికగా జరిగిన ఈ మ్యాచ్ లో అఫ్గానిస్థాన్ అటు బ్యాటింగ్, ఇటు బౌలింగ్ లోను అదరగొట్టి ఇంగ్లాండ్ జట్టును మట్టి కరిపించింది. చివరి వరకు హోరా హోరీగా సాగిన ఈ మ్యాచ్ లో అఫ్గానిస్థాన్ విజేతగా నిలిచింది. ఈ టోర్నీలో ఇప్పటివరకు ఆడిన రెండు మ్యాచ్లలో ఓడిపోయిన ఇంగ్లాండు జట్టు.. టోర్నీ నుండి నిష్క్రమించింది. ఇక ఈ విజయంతో ఆఫ్గనిస్తాన్ నాకౌట్ ఆశలను సజీవంగా ఉంచుకుంది. ఈ మ్యాచ్ లో 8 పరుగుల తేడాతో ఇంగ్లాండ్ పై ఆఫ్గనిస్తాన్ గెలుపొందింది.
ఈ మ్యాచ్ లో మొదట బ్యాటింగ్ చేసిన ఆఫ్ఘనిస్తాన్ 7 వికెట్లను నష్టపోయి ఇంగ్లాండ్ ముందు 326 పరుగుల లక్ష్యాన్ని ఉంచింది. ఆఫ్ఘనిస్తాన్ ఆటగాడు ఇబ్రహీం జద్రాన్ అద్భుత ఇన్నింగ్స్ ఆడాడు. 146 బంతులలో 177 పరుగులు చేసి ఛాంపియన్స్ ట్రోఫీలోనే అత్యధిక వ్యక్తిగత స్కోర్ సాధించిన బ్యాటర్ గా నిలిచాడు. అంతేకాకుండా ఆఫ్గనిస్తాన్ తరుపున ప్రపంచ కప్, ఛాంపియన్స్ ట్రోఫీలలో సెంచరీ చేసిన బ్యాటర్ గా తన పేరును లిఖించుకున్నాడు. అనంతరం బ్యాటింగ్ కి దిగిన ఇంగ్లాండు జట్టు 49.5 ఓవర్లలో 317 పరుగులు చేసి ఆల్ అవుట్ అయింది.
ఇంగ్లాండ్ బ్యాటర్లలో జో రూట్ ఒక్కడే పోరాడిన ఫలితం లేకుండా పోయింది. మిగతా బ్యాటర్లు 40 పరుగులకు మించి రాణించకపోవడంతో ఇంగ్లాండ్ జట్టుకి ఓటమి తప్పలేదు. ఇక ఆఫ్గనిస్తాన్ బౌలర్ అజ్మతుల్లా ఓమర్జై ఐదు వికెట్లు పడగొట్టి సత్తా చాటాడు. ఆఫ్ఘనిస్తాన్ పై ఓటమితో ఇంగ్లాండ్ సీనియర్ ప్లేయర్ జో రూట్ డ్రెస్సింగ్ రూమ్ లో కన్నీళ్లు పెట్టుకున్నాడు. సెంచరీతో రాణించినా జట్టును గెలిపించలేకపోయానన్న బాధ అతని ముఖంలో కనిపించింది. అలాగే రూట్ కి ఇదే చివరి ఛాంపియన్స్ ట్రోఫీ అనే టాక్ వినిపిస్తున్న క్రమంలో టోర్నీలో గెలిచి ఘనంగా వీడ్కోలు చెప్పాలని అనుకుంటే.. ఆఫ్ఘనిస్తాన్ జట్టు దెబ్బేసిందని కూడా క్రికెట్ అభిమానులు అంటున్నారు.
ఇక ఇంగ్లాండ్ పై ఘన విజయం సాధించిన నేపథ్యంలో ఆఫ్గనిస్తాన్ లో క్రీడాభిమానులు పెద్ద ఎత్తున సంబరాలు చేసుకున్నారు. మ్యాచ్ లో గెలుపొందిన వెంటనే టీవీలు కట్టేసి పెద్ద ఎత్తున రోడ్లపైకి వచ్చి బాణాసంచా కాల్చుతూ, బైక్, ఆటోలతో.. జీరో కట్ లు కొడుతూ సంబరాలు చేసుకున్నారు. టీవీల ముందు, వాహనాల పైకి ఎక్కి డాన్సులు చేస్తూ ఆఫ్ఘనిస్తాన్ క్రీడాభిమానులు చేసుకున్న సంబరాలకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
Celebrations after beating England in Afghanistan.pic.twitter.com/cHxfnrt76J
— CricTracker (@Cricketracker) February 27, 2025