
Babar Azam : వన్డే వరల్డ్ కప్ 2023 టోర్నమెంట్ అయ్యే కొద్దీ హీట్ పెరిగిపోతోంది. ఒకొక్క జట్టుకి చెమటలు పడుతున్నాయి. సరిగ్గా ఆడని జట్లకు ఆయా దేశాల క్రికెట్ బోర్డులు అల్టిమేటమ్స్ జారీ చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో పాకిస్తాన్ కెప్టెన్ బాబర్ అజామ్ పరిస్థితి పెనం మీద అట్టులా ఉంది. అంతకు మించి విలేఖర్ల సమావేశంలో తను మాట్లాడిన మాటలు కూడా వైరల్ అవుతున్నాయి.
ఇంకా సమయం ఉంది. మరొక ఆట మిగిలే ఉంది. అది ముగిసిన తర్వాత ఏం జరుగుతుందో చూద్దామని అన్నాడు. అదే ఇప్పుడందరూ పట్టుకున్నారు. ఎప్పుడైతే ఇంగ్లండ్ టాస్ గెలిచి ఫస్ట్ బ్యాటింగ్ తీసుకుందో ఇక పాకిస్తాన్ సెమీస్ ఆశలు దాదాపు మూసుకుపోయాయి. ఇదిక నామ్ కే వాస్తేగా మారిపోయింది.
మ్యాచ్ గెలిచినా, ఓడినా పెద్ద ఫరక్ ఉండదు. కాకపోతే మొదట్లో వచ్చినంత తీవ్ర వ్యతిరేకత అయితే లేదు. ఎందుకంటే సెమీస్ రేస్ వరకు వచ్చి నిలిచారు. జట్టు ఐదో స్థానంలో ఉంది. ఇవన్నీ సానుకూల అంశాలుగానే ఉన్నాయి. కాకపోతే మొదట్లో ఆఫ్గాన్ పై ఓడినప్పుడు వచ్చిన విమర్శలు మామూలుగా లేవు. అసలే ఇండియా మీద ఓడిపోయి…మంటెక్కి ఉన్న పాక్ అభిమానులు, ఆఫ్గాన్ పై ఓటమితో జట్టుపై విరుచుకుపడ్డారు.
వసీం అక్రమ్ లాటి వారు మీకు తిండి దండగ అన్నట్టు మాటాడే స్థాయికి వెళ్లిపోయింది. మిగిలినవాళ్లు ఒక ఆటాడుకున్నారు. ఈ దశలో బాబర్ ఆజామ్ సహనం కోల్పోకుండా నిలిచాడు. ఏ కెప్టెన్ అయినా సరే, తనకిచ్చిన జట్టుతోనే ఆడాలి. జట్టు ఎంపికలో కెప్టెన్ పాత్ర ఎంత? బోర్డు ఎంపిక చేసిన వారితోనే ఆడాల్సి ఉంటుంది. వాళ్లు ఆడకపోతే తనొక్కడు ఏం చేస్తాడు. అలా కెప్టెన్ ఒక్కడినే బాధ్యుడ్ని చేయడం కరెక్ట్ కాదని కొందరంటున్నారు.
పాకిస్తాన్ వెళ్లిన తర్వాత బాబర్ ఆజామ్ ఒక నిర్ణయం తీసుకునేలా ఉన్నాడని అంటున్నారు. బహుశా వన్డే కెప్టెన్సీకి రాజీనామా చేస్తాడని చెబుతున్నారు. కాకపోతే తనకి ఆప్తులైన పీసీబీ మాజీ ఛైర్మన్ రమీజ్ రాజాతోపాటు మరికొందరిని కలిసి, వారితో చర్చించి నిర్ణయం తీసుకోవచ్చునని చెబుతున్నారు.