RCB Announced Ex-gratia : ఐపీఎల్ 2025 సీజన్ లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు ట్రోఫీ విజయం సాధించిన విషయం తెలిసిందే. దేశ వ్యాప్తంగా ఆర్సీబీ అభిమానులు సంబురాలు జరుపుకున్నారు. అయితే బెంగళూరు చిన్నస్వామి స్టేడియం వద్ద నిన్న జరిగిన తొక్కిసలాటలో 11 మంది మరణించారు. మృతి చెందిన 11 మంది కుటుంబాలకు తాజాగా ఆర్సీబీ పరిహారం ప్రకటించింది. రూ.10లక్షల చొప్పున ఆర్థిక సాయం అందించనున్నట్టు తెలిపింది. ఈ ఘటనలో గాయపడిన వారి కోసం రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు కేర్స్ పేరిట ఫండ్ ఏర్పాటు చేస్తున్నట్టు పేర్కొంది. ఈ మేరకు తన అధికారిక ఎక్స్ (ట్విట్టర్) పేజీలో పోస్టు చేసింది. అంతేకాదు.. ఈ ఘటనలో క్షతగాత్రులైన వారికి చికిత్స కోసం ఆర్సీబీ కేర్స్ పేరిట నిధులు సేకరించాలని నిర్ణయించింది.
Also Read : Ambani Family – IPL : ఐపీఎల్ లో ముంబై ఓనర్లకు సోఫాలు ఎందుకు వేస్తారు.. మిగతా ఓనర్లు జనాల మధ్యలో కూర్చుంటారు
ఇక ఆర్సీబీ ట్వీట్ ని పరిశీలించినట్టయితే.. “తొక్కిసలాట జరిగిందనే వార్త తెలిసి తీవ్ర దిగ్బ్రాంతికి గురయ్యామని.. మృతి చెందిన కుటుంబాలకు సానుభూతి తెలియజేస్తున్నాం. మా అభిమానులు అందరూ క్షేమంగా ఉండాలని కోరుకుంటున్నాం. మీడియాలో వచ్చినటువంటి పలు కథనాలతో ఈ ఘటన గురించి మాకు తెలిసింది. అభిమానులు పెద్ద ఎత్తున రావడంతో ఇలాంటి ఘటన చోటు చేసుకుంది. మాకు ప్రతీ ఒక్కరి క్షేమం చాలా ముఖ్యం. దీని గురించి తెలిసిన వెంటనే మా కార్యక్రమాలను రద్దు చేసుకున్నాం. బాధిత కుటుంబాలకు మా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాం. స్థానిక అధికారులకు మా పూర్తి సహకారం అందిస్తాం. ఈ సందర్భంగా మాకు మద్దతుగా నిలిచే వారికి ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాం. అందరూ సురక్షితంగా ఉండాలని కోరుకుంటున్నాం” అని ఆర్సీబీ ఓ ప్రకటనలో పేర్కొంది.
మరోవైపు బెంగళూరు తొక్కిసలాట ఘటన పై స్టేటస్ రిపోర్ట్ ఇవ్వాలని కర్నాటక హైకోర్టు ప్రభుత్వాన్ని ఆదేశించింది. స్టేడియంలో ఉన్నటువంటి 21 గేట్లు తెరిచారా..? అని హైకోర్టు ప్రశ్నించింది. విచారణను మంగళవారానికి వాయిదా వేసింది హైకోర్టు. స్టేటస్ రిపోర్ట్ ని మంగళవారం పరిశీలిస్తామని న్యాయస్థానం పేర్కొంది. ఇంతటి భారీ స్థాయిగా సంబరాలు జరుగుతుంటే ముందస్తు భద్రత చర్యలు ఎందుకు తీసుకోలేదని ప్రశ్నించింది హైకోర్టు. వాస్తవానికి ఆర్సీబీ విజయోత్సవాలు జరుపుకోవద్దని పోలీసులు ముందే హెచ్చరించారట. అయినప్పటికీ ఆర్సీబీ పట్టించుకోలేదని వార్తలు వినిపిస్తున్నాయి. విజయోత్సవ వేడుకలు బుధవారానికి బదులుగా ఆదివారం నిర్వహించుకోవాలని సూచించారు. టైటిల్ గెలిచిన మరుసటి రోజే వేడుకలు నిర్వహిస్తే.. అభిమానుల్లో భావోద్వేగాలు ఎక్కువగా ఉంటాయని.. తీవ్రమైన గందరగోళానికి దారి తీయవచ్చని హెచ్చరించారు. దానిని ఆర్సీబీ యాజమాన్యం పెడచెవిన పెట్టింది. వేడి మీద వేడుకలు నిర్వహించకపోతే తమకు డ్యామేజ్ అవుతుందని భావించి రాష్ట్ర ప్రభుత్వం సైతం ఆర్సీబీ యాజమాన్యం వాదనతోనే ముందుకెళ్లింది. ఆర్సీబీ టైటిల్ గెలిచిన మరుక్షణం నుంచే బెంగళూరు వీధుల్లో తీవ్ర గందరగోళం నెలకొంది. జట్టు విజయోత్సవాలు జరుపుకుంటున్న అభిమానులు తెగ హడావుడి చేశారు. ఆర్సీబీ 18 ఏళ్ల తరువాత మొదటిసారిగా ఐపీఎల్ టైటిల్ సాధించడంతో బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో ఆటగాళ్ల సన్మాన కార్యక్రమం ఏర్పాటు చేసారు. తొలుత ఆర్సీబీ యాజమాన్యం ఓపెన్ టాప్ బస్ లో ఆటగాళ్ల ఊరేగింపునకు ప్లాన్ చేసింది.