Schock To The England : వరుస సంచలనాలతో T20 వరల్డ్ కప్ లో ప్రకంపనలు సృష్టిస్తోంది… పసికూన ఐర్లాండ్. క్వాలిఫైయింగ్ రౌండ్ లో వెస్టిండీస్ పై గెలిచి ఆ జట్టును ఇంటిదారి పట్టించిన ఐర్లాండ్… ఇప్పుడు ఇంగ్లండ్ కూ షాకిచ్చింది. వరుణుడి పుణ్యమా అని… డక్ వర్త్ లూయిస్ పద్ధతిలో… ఇంగ్లండ్ పై 5 పరుగుల తేడాతో గెలిచింది.
టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్ చేసిన ఐర్లాండ్… ఆరంభంలోనే ఓపెనర్ పాల్ స్టిర్లింగ్ వికెట్ కోల్పోయినా… మరో ఓపెనర్ ఆండీ, వన్ డౌన్ బ్యాటర్ టకర్ అద్భుతంగా ఆడటంతో భారీ స్కోరు చేసేలా కనిపించింది. ఆండీ, టకర్ రెండో వికెట్ కు 82 రన్స్ జోడించారు. ఆండీ 47 బంతుల్లో 62 రన్స్ చేయగా… టకర్ 27 బంతుల్లో 34 రన్స్ చేశాడు. అద్భుతంగా సాగుతున్న వీళ్ల భాగస్వామ్యం… ఆండీ బలంగా కొట్టిన స్ట్రెయిట్ డ్రైవ్ తో తెరపడింది. రషీద్ వేసిన బంతిని ఆండీ బలంగా కొట్టడంతో… అది అతని చేతిని తాకుతూ వెళ్లి నాన్ స్ట్రయికర్ ఎండ్ లో ఉన్న వికెట్లను తగిలింది. అప్పటికి టకర్ క్రీజ్ బయట ఉండటం, బెయిల్స్ పడిపోవడంతో… టకర్ రనౌట్ గా వెనుదిరగాల్సి వచ్చింది. ఆ తర్వాత ఆండీ కూడా ధాటిగా ఆడే ప్రయత్నంలో ఔటయ్యాడు. వీళ్లిద్దరూ పెవిలియన్ చేరాక… 25 పరుగుల వ్యవధిలో చివరి 6 వికెట్లను కోల్పోయింది… ఐర్లాండ్. ఇందులో మూడు డకౌట్లు కాగా… మరో ముగ్గురు బ్యాటర్లు సింగిల్ డిజిట్ స్కోరుకే వెనుదిరిగారు. చివరికి 20 ఓవర్లు ఆడకుండానే… 19.2 ఓవర్లలో 157 పరుగులకు ఆలౌటైంది… ఐర్లాండ్.
158 రన్స్ టార్గెట్ గా ఛేజింగ్ మొదలెట్టిన ఇంగ్లాండ్ కు… తొలి ఓవర్ రెండో బంతికే షాక్ తగిలింది. కెప్టెన్ జోస్ బట్లర్ డకౌట్ అయ్యాడు. ఆ తర్వాత కూడా ఐర్లాండ్ బౌలర్లు ఇంగ్లండ్ బ్యాటర్లకు ధాటిగా ఆడే ఛాన్స్ ఇవ్వకుండా వరుసగా వికెట్లు తీశారు. స్టార్ బ్యాటర్ బెన్ స్టోక్స్ 6 పరుగులకే ఔటయ్యాడు. మరో ఓపెనర్ అలెక్స్ హేల్స్ 7 రన్స్ చేసి పెవిలియన్ చేరాడు. 29 పరుగులే మూడు వికెట్లు కోల్పోయిన ఇంగ్లండ్ ను… కాసేపు డేవిడ్ మలన్, హెన్రీ బ్రూక్ ఆదుకున్నారు. మలన్ 37 బంతుల్లో 35 రన్స్, బ్రూక్ 21 బంతుల్లో 18 రన్ చేశారు. స్వల్ప వ్యవధిలోనే వీళ్లిద్దరూ ఔట్ కావడంతో… 86 పరుగులకే సగం వికెట్లు కోల్పోయింది… ఇంగ్లండ్. ఆ తర్వాత మొయిన్ అలీ, లివింగ్ స్టోన్ మరో వికెట్ పడకుండా జాగ్రత్తగా ఆడారు. అయితే, 14.3 ఓవర్లలో ఇంగ్లండ్ 5 వికెట్ల నష్టానికి 105 పరుగుల వద్ద ఉన్నప్పుడు… వర్షం ప్రారంభమైంది. వాన ఎంతకీ తగ్గకపోవడంతో డక్ వర్త్ లూయిస్ మెథడ్ ప్రకారం లెక్కలేస్తే… 110 పరుగులు చేసి ఉంటే ఇంగ్లండ్ గెలిచేదని తేల్చారు. ఇంగ్లండ్ అప్పటికే 5 పరుగులు తక్కువ చేసి ఉండటంతో… ఐర్లాండ్ 5 పరుగుల తేడాతో గెలిచినట్లు ప్రకటించారు. హాఫ్ సెంచరీ చేసిన ఐర్లాండ్ బ్యాటర్ ఆండీకి ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డ్ దక్కింది.