FIFA World Cup : ఫిఫా వరల్డ్‌కప్‌లో టైటిల్ ఫేవరెట్లలో ఒకటైన బ్రెజిల్ నాకౌట్‌కు దూసుకెళ్లింది. గ్రూప్-Gలో భాగంగా స్విట్జర్లాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో స్థాయికి తగ్గ ప్రదర్శన చేయకపోయినా… కసెమిరో వేసిన ఏకైక గోల్‌తో 1-0 ఆధిక్యంలో నిలిచిన బ్రెజిల్… విజయాన్ని అందుకుంది.
ఆట ఆరంభం నుంచే ఎటాకింగ్ గేమ్ ఆడింది… బ్రెజిల్. తొలి అర్ధభాగంలో పూర్తి ఆధిపత్యాన్ని ప్రదర్శిస్తూ బంతిని తన నియంత్రణలోనే ఎక్కువగా ఉంచుకుంది. ఆ జట్టు చేసిన నాలుగు గోల్ ప్రయత్నాలను… స్విట్జర్లాండ్ సమర్థంగా అడ్డుకుంది. ఆ జట్టు కూడా బ్రెజిల్ గోల్ పోస్టుపై దాడులు చేసినా… ప్రత్యర్థి రక్షణశ్రేణిని ఛేదించలేకపోయింది. ఆట 12వ నిమిషంలోనే బ్రెజిల్‌కు గోల్ చేసే అవకాశం వచ్చింది. కానీ, బ్రెజిల్ ఆటగాళ్ల ప్రయత్నాన్ని స్విస్ ఆటగాడు విన్సియస్ అడ్డుకున్నాడు. 19వ నిమిషంలోనూ బ్రెజిల్ మరో ప్రయత్నం చేసినా సఫలం కాలేకపోయింది. 27వ నిమిషంలో బ్రెజిల్ గోల్ చేసిందనే అనుకున్నారంతా. కానీ… విన్సియస్ షాట్‌ను స్విస్ గోల్‌కీపర్ సోమర్ అడ్డుకున్నాడు. ఆట 39వ నిమిషంలో స్విట్జర్లాండ్‌కు కూడా ఓ అవకాశం వచ్చినా… గోల్‌గా మలచలేక పోయింది. తొలి అర్ధభాగం కాసేపట్లో ముగుస్తుందనగా… బ్రెజిల్ వరుసగా రెండు కార్నర్‌లు సాధించినా… గోల్ చేయలేకపోయింది.
ఇక సెకండ్ హాఫ్‌లో… బ్రెజిల్ డిఫెన్స్‌పై స్విట్జర్లాండ్ కాస్త ఒత్తిడి పెంచింది. 53వ నిమిషంలో విడ్మర్ అందించిన పాస్‌ను రీడర్ నెట్లోకి పంపే ప్రయత్నం చేసినా… విఫలమయ్యాడు. 64వ నిమిషంలో విన్సియస్ గోల్ వేయడంతో బ్రెజిల్ సంబరాల్లో మునిగిపోయింది. కానీ… రిఫరీ దాన్ని ఆఫ్‌సైడ్‌గా తేల్చడంతో ఆ జట్టు అభిమానులు నిరాశలో మునిగిపోయారు. ఆట మరో పది నిమిషాల్లో ముగుస్తుందనగా కూడా… ఇరు జట్లు గోల్ చేయకపోవడంతో మ్యాచ్ డ్రా అవుతుందేమోనని అంతా భావించారు. కానీ… 83వ నిమిషంలో కసెమిరో గోల్‌తో బ్రెజిల్ 1-0 ఆధిక్యంలోకి వెళ్లింది. బాక్స్‌లోకి రోడ్రిగో పంపిన బంతిని గోల్‌కీపర్ నుంచి తప్పిస్తూ కసెమిరో నెట్లో ఓ మూలకు కొట్టి బ్రెజిల్ అభిమానుల్లో సంబరాలు నింపాడు. నిర్ణీత సమయం ముగిసేలోగా స్విట్జర్లాండ్ గోల్ చేయలేకపోవడంతో… 1-0 తేడాతో గెలిచిన బ్రెజిల్… టోర్నీలో వరుసగా రెండో విజయంతో నాకౌట్ చేరింది.