Sarfaraz Khan: దేశంలో క్రికెట్ అంటే ఎంత క్రేజ్ ఉంటుందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఐపీఎల్‌లో చోటు రావడమే అదృష్టంగా భావిస్తారు ప్లేయర్లు. అలాంటిది దేశం తరపున ఆడే అవకాశం వస్తే అంతకుమించి ఇంకేం కావాలి. అలాంటి అవకాశమే సర్ఫరాజ్ ఖాన్‌కు ఇలా వచ్చి అలా చేజారినట్లైంది. గతేడాది టెస్టులకు సర్ఫరాజ్‌ను ఎంపిక చేసిన సెలక్టర్లు ఫెర్ఫామెన్స్ బాగున్నప్పటికీ ఇంగ్లాండ్ పర్యటనకు అతన్ని ఎంపిక చేయలేదు. దీనిపై చర్చలు కూడా బాగానే జరిగాయి. కోహ్లీ, రోహిత్ శర్మ లాంటి దిగ్గజాలు రిటైర్మెంట్ ప్రకటించడంతో అతనికి జట్టులో కచ్చితంగా చోటు వస్తుందని ఆశ పడ్డాడు. కానీ అతడిని జట్టులోకి తీసుకునేందుకు సెలక్టర్లు మొగ్గు చూపలేదు. అందుకు కారణాలు చాలానే ఉన్నప్పటికీ అతడు గ్రౌండ్‌లో చురుగ్గా కదలలేడు అనేది ఒక కారణం కావొచ్చు.
అయితే లోపం ఎక్కడుందో తెలుసుకున్నాడో లేక మరెవరైనా సలహా ఇచ్చారో తెలియదు కానీ.. తన ఫిట్‌నెస్‌పై దృష్టి పెట్టాడు. జట్టులో ఎలాగైనా తిరిగి స్థానం దక్కించుకోవాలనుకున్నాడు.తన బరువును తగ్గించుకునేందుకు తీవ్రంగా శ్రమిస్తున్నాడు. కఠోరమైన డైట్‌ను పాటిస్తూ జిమ్‌లో శ్రమిస్తున్నాడు. ఇందులో భాగంగానే ఏకంగా రెండు నెలల్లో 17 కేజీలు తగ్గి అందరినీ ఆశ్చర్యానికి గురిచేశాడు. సాధారణంగా బొద్దుగా ఉండే సర్ఫరాజ్ ఖాన్ స్లిమ్‌గా తయారయ్యాడు. ఉడకబెట్టిన కూరగాయలు, చికెన్ మాత్రమే తీసుకుంటూ 95 కిలోల నుంచి 78 కిలోలకు తగ్గాడు. జిమ్‌లో తాను తాజాగా తీసుకున్న ఫోటోను షేర్ చేసి అందరికీ షాక్ ఇచ్చాడు. అందులో బొద్దుగా ఉండే సర్ఫరాజ్ ఖాన్ స్లిమ్‌గా కనిపించాడు.
Also Read: Shimron hetmyer : హెట్ మేయర్ అరాచకం..పడుకొని మరి క్యాచ్ పట్టాడు.. ఎక్కడి నుంచి వస్తారో వీళ్లంతా
ఇదిలా ఉంటే సర్ఫరాజ్ ఖాన్ బరువు తగ్గడం పట్ల అందరి నుంచి ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. సర్ఫరాజ్ ఖాన్ లుక్ పట్ల క్రికెట్ అభిమానులు ఫిదా అవుతున్నారు. సర్ఫరాజ్ ఫోటోను షేర్ చేస్తూ సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఇదే సమయంలో పలువురు మాజీల నుంచి సర్ఫరాజ్ ఖాన్‌కు అభినందనలు అందుతున్నాయి. సర్ఫరాజ్ సన్నగా మారడంపై ఇంగ్లాండ్ మాజీ ప్లేయర్ కెవిన్ పీటర్సన్ హర్షం వ్యక్తం చేశాడు. అద్భుతమైన ప్రయత్నం సర్ఫరాజ్..! నీకు హృదయపూర్వక అభినందనలు. గ్రౌండ్‌లో మరింత మెరుగైన, స్థిరమైన ప్రదర్శనకు ఇది కచ్చితంగా దోహదపడుతుందని ఆశిస్తున్నా అంటూ పోస్ట్ పెట్టాడు.
ఇదే సమయంలో ఫిట్‌నెస్ సమస్యలతో జాతీయ జట్టులో చోటు కోల్పోయిన యువ బ్యాటర్ పృథ్వీషా విషయాన్ని పీటర్సన్ ప్రస్తావించాడు. సర్ఫరాజ్ ఖాన్ ఎలా స్లిమ్‌గా మారాడో పృథ్వీ షాకు చూపించాలంటూ కామెంట్ చేస్తూ పోస్టు పెట్టాడు. కెరీర్ ఆరంభంలో అద్భుతమైన ఆటతీరుతో భవిష్యత్ సూపర్‌స్టార్ అనిపించుకున్న పృథ్వీ షా ఆ తర్వాత క్రమంగా పట్టుతప్పాడు. ఫిట్‌నెస్ కోల్పోయి లావయ్యాడు. ఫామ్ కోల్పోయి క్రమంగా జాతీయ జట్టుకు దూరమయ్యాడు. మొన్న జరిగిన ఐపీఎల్ మెగా వేలంలోనూ షా un సోల్డ్ గా మిగిలాడు. అతన్ని ఎవరు కొనలేదు. ఐపీఎల్ తర్వాత దేశవాళీల్లో రాణించినప్పటికీ షాను పట్టించుకోవడం లేదు.