Pakistan Coach: ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ 2025లో అతిధ్య పాకిస్తాన్ లీగ్ దశలోనే ఇంటిదారి పట్టింది. డిఫెండింగ్ ఛాంపియన్ గా బరిలోకి దిగిన పాకిస్తాన్ జట్టు.. ఆడిన రెండు మ్యాచ్లలోను ఓటమిపాలై నాకౌట్ కి చేరకుండానే టోర్నీ నుంచి నిష్క్రమించింది. మొదట న్యూజిలాండ్ చేతిలో ఘోర పరాజయం పాలైన పాకిస్తాన్.. ఆ తరువాత భారత్ చేతిలో చిత్తయింది. 29 సంవత్సరాల తర్వాత ఈ టోర్నమెంట్ కి ఆతిధ్యం ఇస్తున్న పాకిస్తాన్.. టోర్నమెంట్ నుండి నిష్క్రమించిన మొదటి జట్టుగా అప్రతిష్టను మూటగట్టుకుంది.
ఈ నేపథ్యంలో గురువారం బంగ్లాదేశ్ తో జరిగే మ్యాచ్ లో గెలిచి పరువు కాపాడుకోవాలని భావిస్తోంది. ఇక టోర్నీ నుండి నిష్క్రమించిన క్రమంలో ఇప్పుడు పాకిస్తాన్ ఆటగాళ్లు ఓటమికి ఒకరినొకరు నిందించుకుంటున్నారు. అయితే బంగ్లాదేశ్ తో మ్యాచ్ కి ముందు పాకిస్తాన్ కోచ్ అకీబ్ జావిద్ మీడియాతో మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశాడు. అనుభవజ్ఞులైన ఆటగాళ్లు లేకపోవడం వల్లే భారత్ చేతిలో ఓటమి చెందామన్నాడు అకీబ్ జావేద్. భారత జట్టు చేతిలో ఓటమితో అభిమానుల కంటే.. తమ ఆటగాళ్లు ఎక్కువగా బాధపడ్డారని తెలిపాడు.
” ఒక్క దుబాయి లోనే మ్యాచులు ఆడడం భారత జట్టుకు కలిసి వస్తుందని కొందరు చెబుతున్నారు. కానీ మా ఓటమికి దానిని సాకుగా చూపబోం. ఒకే మైదానంలో ఆడడం, ఒకే హోటల్ లో ఉండడం వల్ల కచ్చితంగా ప్రయోజనం ఉంటుంది. కానీ మా జట్టు దానివల్ల ఓడిపోలేదు. మాతో మ్యాచ్ కి ముందు భారత జట్టు దుబాయిలో 10 మ్యాచ్లు ఆడలేదు. మా జట్టు ఇంకా మెరుగుపడాల్సి ఉంది. తదుపరి మ్యాచ్ పై మేము దృష్టి సారిస్తున్నాం. కానీ భారత్ – పాకిస్తాన్ మ్యాచ్ జరిగితే చాలా భావోద్వేగాలు ముడిపడి ఉంటాయి.
భారత్ తో ఓటమి వల్ల అభిమానులు, జర్నలిస్టుల కంటే ఆటగాళ్లు ఎక్కువగా మానసిక వేదనకు గురవుతున్నారు. భారత జట్టుతో ఆడడానికి చాలా అనుభవం అవసరం. ప్రస్తుతం ఉన్న భారత జట్టు అత్యంత అనుభవజ్ఞులతో నిండి ఉంది. కానీ పాకిస్తాన్ జట్టులో అనుభవజ్ఞులైన ఆటగాళ్లు లేరు. భారత జట్టులోని ప్లేయర్లు ఆడిన మ్యాచ్ ల సంఖ్య 1500 ఉంటే.. పాకిస్తాన్ ఆటగాళ్ల మ్యాచ్ ల మొత్తం సంఖ్య 400 తక్కువగా ఉంది. అలాగే ఒకే గ్రౌండ్ లో ఆడుతూ ఉండడం కూడా ఇండియాకి అడ్వాంటేజ్ గా మారింది. బాబర్ అజామ్ మాత్రమే 100 కంటే ఎక్కువ మ్యాచ్ లు ఆడాడు. ఇక రిజ్వాన్, మహమ్మద్ లకు కొంత అనుభవం ఉంది. కానీ మిగతా ప్లేయర్లంతా 30 మ్యాచ్లకు మించి ఆడలేదు.
అనుభవం లేకపోవడం వల్లే ఓటమిపాలయ్యామనడంలో సందేహం లేదు. కొత్తగా జట్టులోకి వచ్చిన వారు ఆశించిన విధంగా రాణించలేదు”. అని చెప్పుకొచ్చాడు. ఇక ఈ టోర్నికి సంబంధించిన ఫైనల్ మ్యాచ్ దుబాయ్ లోనే జరగబోతోంది. ఒకవేళ భారత జట్టు ఫైనల్ చేరితే.. ఆ మ్యాచ్ ని కూడా దుబాయ్ లోనే నిర్వహించేలా షెడ్యూల్ రూపొందించారు. భద్రతా కారణాలవల్ల భారత జట్టుని పాకిస్తాన్ కి పంపించేందుకు బీసీసీఐ నిరాకరించిన విషయం తెలిసిందే.