Champions Trophy 2025: ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీలోని గ్రూప్ స్టేజ్ లో హైట్రిక్ విజయాలు సాధించిన భారత జట్టు జోష్ మీదుంది. ఆదివారం రోజు న్యూజిలాండ్ ని చిత్తు చేసిన భారత జట్టు.. సెమీస్ పోరుకు సిద్ధమవుతుంది. దుబాయ్ వేదికగా ఈ మ్యాచ్ జరగనుండడంతో భారత్ ఫేవరెట్ అని అనడంలో ఎటువంటి సందేహం లేదు. అయితే సెమీఫైనల్ లో టీమిండియా కు అసలు సిసలు అగ్ని పరీక్ష ఎదురుకానుంది. ఈ సెమీస్ లో మోస్ట్ డేంజరస్ ఆస్ట్రేలియాతో భారత జట్టు తలపడబోతోంది.
ఐతే మెగా టోర్నీలలో ఆస్ట్రేలియాను తక్కువగా అంచనా వేయకూడదు. ఇందుకు ఉదాహరణ 2023 వన్డే ప్రపంచ కప్. ఈ ప్రపంచ కప్ లో ఆరంభంలో తడబాటుకు గురైనా.. ఫైనల్ కీ చేరుకుని భారత్ కి షాక్ ఇచ్చి కప్పును ఎగరేసుకుపోయింది ఆస్ట్రేలియా. ఇప్పుడు కూడా ఆస్ట్రేలియా స్క్వాడ్ ని చూసి క్రీడా వర్గాలు కనీసం గ్రూప్ స్టేజ్ కూడా దాటలేదని అభిప్రాయపడ్డారు. కానీ సెమిస్ కి చేరింది ఆస్ట్రేలియా. ఇక భారత జట్టులో కొన్ని లోపాలు కూడా కనిపిస్తున్నాయి.
ఈ లోపాలను సరి చేసుకుంటే ఆస్ట్రేలియాపై విజయం తధ్యమని అభిప్రాయపడుతున్నాయి క్రీడా వర్గాలు. ఈ టోర్నీలో ఆస్ట్రేలియా ప్రధానంగా బలమైన బ్యాటింగ్ తో బరిలోకి దిగింది. మరోవైపు అంతర్జాతీయ మ్యాచ్లు అంటే, ముఖ్యంగా భారత్ పై దూకుడుగా ఆడే ట్రావీస్ హెడ్ ఫామ్ లోకి వచ్చాడు. ఇంగ్లాండ్ పై విఫలమైన హెడ్.. ఆఫ్ఘనిస్తాన్ పై ఆఫ్ సెంచరీ తో రాణించాడు. అలాగే మిడిల్ ఆర్డర్ లో లబుషేన్, ఇంగ్లీస్, అలెక్స్ కేరి ప్రమాదకరమైన బ్యాటర్లు.
వీరిని కట్టడి చేయాల్సిన అవసరం ఉంటుంది. ఇక గ్రూప్ ఏ లో అగ్రస్థానంలో ఉన్న భారత జట్టు సెమీస్ లో.. గ్రూప్ – బి లో రెండవ స్థానంలో ఉన్న ఆస్ట్రేలియాతో తలపడుతుంది. ఇక గ్రూప్ – ఎ లో రెండవ స్థానంలో ఉన్న న్యూజిలాండ్.. గ్రూప్ – బి లో ఉన్న సౌత్ ఆఫ్రికా తో రెండవ సెమీఫైనల్ మ్యాచ్ ఆడబోతోంది. ఇక భారత్ సెమిస్ లో విజయం సాధించి ఫైనల్ కీ చేరుకుంటే.. ఫైనల్ మ్యాచ్ దుబాయ్ వేదికగా జరుగుతుంది. అలా కానిపక్షంలో పాకిస్తాన్ లోని లాహోర్ వేదికగా ఫైనల్ మ్యాచ్ జరుగుతుంది.
అయితే ఈ టోర్నీలో ఇప్పటివరకు వర్షం కారణంగా మూడు మ్యాచ్లు రద్దు అయ్యాయి. మరి కీలకమైన సెమీస్, ఫైనల్ మ్యాచ్ రద్దు అయితే పరిస్థితి ఏంటి..? అంటే.. ఈ టోర్నీకి రెండు సెమీ ఫైనల్, ఫైనల్ మ్యాచ్ లకు ఐసీసీ రిజర్వుడ్ డేలను ప్రకటించింది. ఈ క్రమంలో వర్షం కారణంగా మ్యాచ్ ఆగిపోతే.. మరుసటి రోజు నిర్వహించే అవకాశం ఉంది. మ్యాచ్ ఎక్కడైతే ఆగిపోతుందో మరిసాటి రోజు అక్కడి నుండే కొనసాగిస్తారు. ఒకవేళ రిజర్వుడే రోజు కూడా వర్షం కారణంగా మ్యాచ్ రద్దు అయితే.. సెమిస్ చేరిన రెండు జట్లలో గ్రూప్ లలో అగ్రస్థానంలో నిలిచిన జట్టు ఫైనల్ చేరుకుంటుంది.